అమ్మా.. నీవెక్కడ! | Mother Leavs Girl Child In Government maternity hospital hyderabad | Sakshi
Sakshi News home page

అమ్మా.. నీవెక్కడ!

Aug 14 2018 9:40 AM | Updated on Sep 4 2018 5:53 PM

Mother Leavs Girl Child In Government maternity hospital hyderabad - Sakshi

పాపకు పాలు పడుతున్న ఆసుపత్రి సిబ్బంది

ఓ అమ్మ పేగు బంధాన్ని మరిచింది. బిడ్డ పుట్టిన గంటలోనే వదిలేసి వెళ్లిపోయింది. ఆడపిల్ల పుట్టిందని వద్దనుకుందో లేకమరేదైనా కారణమో తెలియదు గానీ... ఆస్పత్రిలోనే పాపను అనాథగావదిలేసింది. పది రోజులైనా ఆ తల్లి తిరిగి రాలేదు. పాతబస్తీలోని పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకివచ్చింది. నవాబ్‌సాబ్‌కుంటకు చెందిన యాస్మిన్‌ అనే యువతి ప్రసవం కోసం ఈ నెల 3న పేట్లబురుజు ఆస్పత్రిలో చేరింది. ప్రసవం జరిగిన గంట తర్వాత యాస్మిన్‌ అదృశ్యమైంది. పాప బలహీనంగాఉండడంతో వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. అయితే ఇప్పటి వరకు ఎవరూ రాకపోవడంతో ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయగా.. విషయం వెలుగులోకి వచ్చింది.   

హైదరాబాద్‌ ,దూద్‌బౌలి: ఆడపిల్లల పట్ల సమాజంలో వివక్ష కొనసాగుతూనే ఉంది. అదృష్టంగా భావించాల్సిన ఆడపిల్లలను భారంగా తలుస్తున్నారు. పేగు తెంచుకు పుట్టిన పసికందును భారంగా భావించిన ఓ కన్నతల్లి ఆస్పత్రిలో అనాథగా వదిలేసి వెళ్లిన సంఘటన పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  ఆసుపత్రి వర్గాలు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి...ఈ నెల 3వ తేదీ సాయంత్రం నవాబ్‌సాబ్‌కుంట ప్రాంతానికి చెందిన యాస్మిన్‌ అనే యువతి ప్రసవం కోసం పేట్లబురుజు ఆసుపత్రిలో చేరింది. గంటలోపే ఆడ పిల్లకు జన్మనివ్వడంతో ఆసుపత్రి వైద్యులు తల్లి, బిడ్డలకు వైద్య సేవలు అందించారు.

మరుసటి రోజు ఉదయం చూసేసరికి యాస్మిన్‌ తన పసికందును వదిలి వెళ్లిపోయింది. శిశువు బలహీనంగా ఉండటంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్న వైద్యులు తల్లి వస్తుందేమోనని ఎదురు చూశారు. ప్రసవ సమయంలో ఇచ్చిన చిరునామా ఆధారంగా విచారణ చేపట్టినా ఫలితం కనిపించలేదు. శిశువు ఆరోగ్యం మెరుగుపడటం, పదిరోజులైనా ఎవరూ రాకపోవడంతో ఆస్పత్రి అధికారులు సోమవారం చార్మినార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ చంద్రశేఖర్‌రెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రసవానికి వచ్చిన సమయంలో సదరు మహిళ తన పేరు యాస్మిన్‌గా, భర్త పేరు ఎస్‌.కె.మస్తాన్‌గా నమోదు చేయించింది. నవాబ్‌సాబ్‌కుంటలో ఉంటున్నట్లు చిరు నామాలో పేర్కొంది. ఆమె ఇచ్చిన వివరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

శిశువు ఆరోగ్యంగా ఉంది
కాన్పు అనంతరం తల్లి బిడ్డను వదిలి వెళ్లిపోవడంతో ఆస్పత్రి సిబ్బందే శిశువు ఆలనా పాలన చూస్తున్నారు. పుట్టుకతోనే అనారోగ్య సమస్యలు ఉన్నట్లు గుర్తించి వైద్యసేవలు అందించాం. ప్రస్తుతం పాప ఆరోగ్యం మెరుగుపడింది. ఈ ఘటనపై చార్మినార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాం. శిశువును తీసుకె ళ్లేందుకు బంధువులెవరూ ముందుకు రాకపోతే... చిన్నారిని శిశు విహార్‌కు తరలిస్తాం.   
– డాక్టర్‌ నాగమణి, సూపరింటెండెంట్, పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement