అర్బన్‌లోనే అధిక నామినేషన్లు

More Nominations Filed In Nizamabad - Sakshi

ఇప్పటివరకు 22 నామినేషన్లు దాఖలు

నేడు మరిన్ని దాఖలయ్యే అవకాశం 

సాక్షి, నిజామాబాద్‌ అర్బన్‌: నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు నిజామాబాద్‌ అర్బన్‌ నియోజక వర్గంలో ఎమ్మెల్యేగా పోటీకి నామినేషన్లు స్వీకరణ నేటితో ముగియనుంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా నిజామాబాద్‌ అర్బన్‌లోనే అత్యధిక నామినేషన్లు 22 దాఖలయ్యాయి. నేడు చివరి రోజు కావడంతో మరిన్ని నామినేషన్లు దాఖలు అయ్యే అవకాశం ఉంది. నేడు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి తాహెర్‌బిన్‌తో పాటు మరికొంత మంది నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది. శనివారం ఒక్కరోజే 12 మంది నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్‌లు ప్రారంభమైన మొదటి రో జు నామినేషన్‌లు దాఖలు కాలేదు. రెండవ రోజు ఒకటి, మరుసటి రోజు నాలుగు నామినేషన్లు, తరువాత రోజు మూడు, అనంతరం 12 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఇప్పటి వరకు 22 నామినేషన్లు దాఖలు అయ్యాయి. స్వతంత్ర అభ్యర్థులు  8 మంది కాగా, టీఆర్‌ఎస్‌ నుండి ఒకరు, భాజాపా నుండి ఇద్దరు, బీఎస్పీ నుండి ఒకరు, సమాజ్‌వాది పార్టీ నుండి ఒకరు, పిరమిడ్‌పార్టీ నుండి ఒకరు, బీఎల్‌ఎఫ్‌ పార్టీ నుండి ఒకరు, అంబేద్కర్‌ నేషనల్‌ పార్టీనుండి ఒకరు, టీడీపీ నుండి ఒకరు చొప్పున నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో టీఆర్‌ఎస్, బీఎస్‌పికి చెందిన అభ్యర్థులు రెండు నుండి మూడు సెట్‌ల చొప్పున నామినేషన్లు దాఖలు చేశారు. ఈ రోజు మరికొన్ని నామినేషన్లు దాఖలు అయ్యే అవకాశం ఉంది.

 భద్రత కట్టుదిట్టం..

 నామినేషన్లు దాఖలు చేసే మున్సిపల్‌ కార్పొరేషన్‌ వద్ద పోలీసులు మరింత కట్టుదిట్టం చేశారు. నేడు చివరి రోజు కావడంతో అభ్యర్థులు అధిక సంఖ్య లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున బందో బస్తును పకడ్బందీగా కొనసాగించనున్నారు. ఏసీ పీ శ్రీనివాస్‌కుమార్‌ ఆధ్వర్యంలో ముగ్గురు సిఐ లు, ఏడుగురు ఎస్‌ఐలు, 40 మంది పోలీసు సిబ్బంది బందోబస్తును  ఏర్పాటు చేశారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌లోకి ఎవరిని కూడా అనుమతించడం లేదు. కేవలం అభ్యర్థులు, వారితోపాటు నలుగురిని మాత్రమే అనుమతిస్తున్నారు.  అభ్యర్థుల వెంట వచ్చేవారిని నామినేషన్‌ కేంద్రానికి 100 మీటర్ల దూరంలో నిలిపివేస్తున్నారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎదుట ట్రాఫిక్‌ నిబంధనలు అమలుచేస్తున్నారు. నేటితో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top