Sakshi News home page

మా ఆకాంక్ష నెరవేరిన రోజు...నీకు చీకటిరోజా?

Published Sat, Jun 3 2017 1:54 AM

మా ఆకాంక్ష నెరవేరిన రోజు...నీకు చీకటిరోజా? - Sakshi

- తెలంగాణపై మరోసారి విషం కక్కిన చంద్రబాబు: హరీశ్‌రావు
- తెలంగాణ ద్రోహికి ఇంకా భజన చేస్తారా?
టీటీడీపీ నేతలు సిగ్గుతో తలదించుకోవాలి
రాసిచ్చిన ప్రసంగాన్నే రాహుల్‌ చదివారని ఎద్దేవా
 
సాక్షి, సిద్దిపేట: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జూన్‌ 2వ తేదీని చీకటి దినం అని అభివర్ణించడంపై భారీ నీటిపారుదలశాఖ మంత్రి టి.హరీశ్‌రావు మండిపడ్డారు. ‘మా ఆకాంక్ష నెరవేరిన రోజు.. నీకు చీకటి రోజా?’అని ప్రశ్నించారు. శుక్రవారం సిద్దిపేటలో ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు తన అసమర్ధతను విభజనపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నాడని, విభజనతో ఏదో జరిగిపోయిందని ఆ ప్రాంత ప్రజలను ఆత్మన్యూనతా భావంలోకి నెట్టి పబ్బం గడుపుకొనే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని, పరిపాలన చేయడంలో ఆయన ఫెయిల్‌ అయ్యారని హరీశ్‌ పేర్కొన్నారు. అభివృద్ధిలో తెలంగాణతో పోటీ పడలేకపోతున్నారని, దీంతో ఆంధ్ర ప్రజలు ఆయన్ను నిలదీస్తున్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం పట్ల, ఇక్కడి ప్రజల పట్ల మరోసారి చంద్రబాబు తన అక్కసు వెళ్లగక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధిని చూసి ఏపీ సీఎం ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. ఆయన నిజ స్వరూపం మరోసారి బయట పెట్టుకున్నారని చెప్పారు. ఇలాంటి నాయకుడు తెలంగాణ ప్రజలకు అవసరం లేదని, చంద్రబాబు మాట్లాడిన మాటలతో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు సిగ్గుతో తలదించుకోవాలన్నారు. అంత అక్కసు వెళ్లబోసుకున్న ద్రోహికి ఇంకా భజన చేస్తారా? అని మీరు ఇప్పటికీ చంద్రబాబు నాయకత్వాన్ని సమర్థిస్తే మిమ్ములను కూడా తెలంగాణ ప్రజలు ద్రోహులుగానే గుర్తిస్తారని హరీశ్‌రావు హెచ్చరించారు. 
 
ఎప్పుడూ ఏడుపేనా!
విభజన  చట్టంతో వారికి పోలవరం జాతీయ ప్రాజెక్టుగా వచ్చిందని, సాగు నీటి పంపిణీలో తమకు అన్యాయమే జరిగిందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. కానీ సీఎం కేసీఆర్‌ ప్రతి కష్టాన్ని ఒక సవాల్‌గా తీసుకుని, వ్యూహంతో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారన్నారు. ‘ఊరికే పక్కోని మీద పడి ఏడుస్తవ్‌.. ఎప్పుడూ ఏడిస్తే నీకేమొస్తది.. మీ రాష్ట్రానికి ఏం కావాలో.. మీ రాష్ట్ర ప్రజలకు ఏం కావాలో దానికోసం పని చేయాలి’అని సూచించారు. కేంద్రం మీదో, ప్రతిపక్షం మీదో.. పక్కరాష్ట్రం మీదో పడి ఏడిస్తే తప్పులు ఒప్పులైపోతాయా? మీ అసమర్ధత సమర్ధత అయిపోతదా? అది ఎప్పటికీ జరగదన్నారు. చంద్రబాబు బేషరతుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని, ఆయన వ్యాఖ్యల పట్ల తెలంగాణ టీడీపీ, ఆయనతో పొత్తు పెట్టుకున్న బీజేపీ నేతలు సమర్ధిస్తారా? వ్యతిరేకిస్తారా? తేల్చి చెప్పాలని మంత్రి డిమాండ్‌ చేశారు. టీడీపీతో పొత్తు పెట్టుకుంటాం అంటున్న కాంగ్రెస్‌లో పెద్ద నేత జైపాల్‌రెడ్డి కూడా సమాధానం చెప్పాలన్నారు. 
 
రాహుల్‌ది అనుభవ, అవగాహనా రాహిత్యం..
రాహుల్‌గాంధీ ప్రసంగంతో జాతీయ నాయకుడి స్థాయి కనిపించలేదని హరీశ్‌రా వుఅన్నారు. అనుభవరాహిత్యం, అవ గాహనా రాహిత్యం  కనిపించిం దన్నారు. రాసిచ్చిన ప్రసంగాన్నే చదివార ని,  ఇక్కడి ప్రజలను, లైక్‌ మైండ్‌ పీపుల్‌ను అడిగి ç సబ్జెక్ట్‌పై అవగాహన పెంచుకొని ప్రసంగిస్తే ప్రజలు ఆసక్తిగా వినేవారన్నారు. తమది ఉద్యమ కుటుంబ మని, ఉద్యమంలోంచి వచ్చామ ని, ప్రజలు ఎన్నుకుంటే చట్టసభల్లోకి వచ్చామని హరీశ్‌రావు అన్నారు. ఇదే కుటుంబ పాల నపై జర్నలిస్టు రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ సోనియా గాంధీని ఇంటర్వూ్య చేస్తే.. డాక్టర్ల పిల్లలు డాక్టర్లు, ఐఏఎస్‌ల పిల్లలు ఐఏఎస్‌లు, ఇంజనీర్ల పిల్లలు ఇంజనీర్లు అవుతున్నప్పు డు, పొలిటీషియన్ల పిల్లలు పొలిటీషియన్లు అయితే తప్పేంటి? అని అన్నారని హరీశ్‌ గుర్తుచేశారు. ఈ విషయం రాహుల్‌కు తెలియనట్టుందని ఎద్దేవా చేశారు.

Advertisement
Advertisement