బాలికలకు భరోసా..

Minimum Speciality Not Implemented In All Warangal Govt Schools - Sakshi

భూపాలపల్లి అర్బన్‌: మానసిక వేధింపులు, లింగవివక్షకు గురవుతూ ఎవరికీ చెప్పలేక తమలోతాము కుంగిపోతున్న బాలికల్లో చైతన్యం నింపి భరోసా ఇవ్వడానికి రాష్ట్ర విద్యాశాఖ నడుంబిగించిం ది. ప్రభుత్వ పాఠశాలల్లో యుక్తవయసు బాలికలు సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొనేలా తీర్చిదిద్దడానికి బాలిక సాధికారత క్లబ్‌ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. సర్కారు స్కూళ్లలో చదువుతున్న పేద, మధ్య తరగతి కుటుంబాల బాలికలు లింగవిక్షతోపాటు పలురకాల మానసిక వేధింపులకు గురవుతున్నారు. ఆత్మవిశ్వాసం కోల్పోవడం వల్ల ఈ సమస్యల ను ధైర్యంగా ఎదుర్కోలేక పోతున్నారు. మరోవైపు యుక్త వయసులో వచ్చే శారీరక మార్పులకు అనుగుణంగా ఆరో గ్యం, పరిశుభ్రతపై అవగహన కొరవడుతోంది.

ఇలాంటి సమస్యలను అధిగమించడానికి బాలికల్లో ఆత్మవిశ్వసాన్ని నింపుతూనే వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ జీవన నైపుణ్యాలు పెంచేలా సమగ్ర శిక్ష అభియాన్‌ బాలిక సాధికారత క్లబ్‌లను ఏర్పాటు చేస్తోంది. ముఖ్యంగా ఉన్నత పాఠశాలలు, మోడల్‌ స్కూళ్లు, కేజీబీవీలను ఇందుకు ఎంచుకుంది. మొదటి విడతలతో జిల్లాలోని 20 కస్తూరిబా పాఠశాలలతో పాటు భూపాలపల్లి మండలంలోని గొర్లవీడు, కాటారం, ఏటూరునాగారం మండల కేంద్రాల్లోని ఉన్నత పాఠశాల్లో ప్రయోగాత్మకంగా ఈ క్లబ్‌లను ఏర్పాటు చేయడానికి కసరత్తు  చేస్తోంది. గత ఏడాది వేసవి సెలవుల్లో జిల్లాలోని పలు కస్తూరిబా విద్యాలయల్లో వివిధ అంశాలపై నిర్వహించిన ప్రత్యేక శిక్షణ ప్రస్తుతం ఈ క్లబ్‌ల ఏర్పాటుకు ఎంతో ఉపయోగపడుతోంది.

15 మంది సభ్యులతో కమిటీ
బాలిక సాధికారత క్లబ్‌లో భాగంగా 13 నుంచి 15 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఇందులో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లేదా కస్తూరిబా విద్యాలయ స్పెషల్‌ అధికారి చైర్మన్‌గా, గర్ల్‌ చైల్డ్‌ ఫ్రెండ్లీ టీచర్‌ కన్వీనర్‌గా, ప్రతి తరగతి నుంచి ఇద్దరు ప్రతిభ కలిగిన బాలికలతో మొత్తం 10 నుంచి 12 మంది సభ్యులు, అలాగే ఎక్స్‌టర్నల్‌ సభ్యులుగా సమీపంలోని పోలీసుస్టేషన్‌ నుంచి మహిళా కానిస్టేబుల్‌ ఉంటారు. ఈ క్లబ్‌లు ప్రతినెలా మొదటి శుక్రవారం సమావేశమై పాఠశాలతో పాటు గ్రామంలోని బాలికల నుంచి వచ్చిన ఫిర్యాదులు, గుర్తించిన సమస్యలపై సమీక్షిస్తారు.
 
క్లబ్‌ లక్ష్యాలు..
యుక్త వయసు బాలికల్లో వచ్చే శారీరక మార్పులు, ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రత, సంరక్షణ, లింగవివక్ష, జీవన నైపుణ్యాలు వంటి వాటిపై ఈ క్లబ్‌ల ద్వారా అవగహన కల్పిస్తారు. లైంగిక వేధింపులు, ఈవ్‌టీజింగ్, బెదిరింపులు తదితర సమస్యలను గుర్తించి సమస్యల పరిష్కారానికి క్లబ్‌లు చర్యలు తీసుకుంటాయి. విద్యార్థినులను ఎవరైనా మానసికంగా వేధించినా, చెప్పుకోలేని విషయాలు ఏమైనా ఉంటే కమిటీ సమావేశంలో చర్చించి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటా రు. ఈ క్లబ్‌లను ఏర్పాటు చేయడానికి జిల్లా విద్యాశాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

డిసెంబర్‌ నుంచి అమలు.. 
బాలికల కోసం ఏర్పాటు చేస్తున్న సాధికారత క్లబ్‌లను డిసెంబర్‌ మొదటి వారం నుంచి అమలు చేస్తాం. పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు రాష్ట్ర స్థాయిలో ఇప్పటికే శిక్షణ సైతం ఇచ్చారు. బాలికల ప్రయోజనం కోసమే రాష్ట్ర విద్యాశాఖ వివిధ కార్యక్రమాలు చేపడుతోంది. – పి.నిర్మల, ఎస్‌ఎస్‌ఏ సెక్టోరియల్‌ అధికారిణి 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top