టీఆర్‌ఎస్‌కు మద్దతుగా ఎంఐఎం సభలు 

MIM leaders brisk Campaign for TRS - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌కు మద్దతుగా మజ్లిస్‌ పార్టీ రంగంలో దిగింది. ఇప్పటికే మజ్లిస్‌ పార్టీ శ్రేణులు టీఆర్‌ఎస్‌తో కలసి పాదయాత్రలతో ప్రచారంలో పాల్గొంటున్నాయి. అలాగే టీఆర్‌ఎస్‌ బహిరంగ సభల్లో మజ్లిస్‌ అగ్రనేతలు పాల్గొని మద్దతు ప్రకటిస్తున్నారు. మంగళవారం సికింద్రాబాద్‌ లోక్‌సభ పరిధిలోని ఎర్రగడ్డ సుల్తాన్‌నగర్‌లో, చేవెళ్ల లోక్‌సభ పరిధిలోని పహాడీషరీఫ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ పాల్గొని టీఆర్‌ఎస్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ముస్లిం పక్షపాతి కేసీఆర్‌ను బలపరిచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని 16 స్థానాల్లో టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు.

అంతకుముందు కూడా సికింద్రాబాద్‌ లోక్‌సభ పరిధిలోని అహ్మద్‌నగర్‌ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ఓవైసీ సభల్లో ముస్లింలు పెద్ద ఎత్తున పాల్గొనడం టీఆర్‌ఎస్‌ నేతలకు మరింత బలాన్ని చేకూర్చుతోంది. మరోవైపు హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న అసద్‌ ప్రతిరోజు ఉదయం సాయంత్రం పాదయాత్రలు, రాత్రి బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. అలాగే మహారాష్ట్రలో సైతం మిత్రపక్షాల అభ్యర్థులకు మద్దతుగా చందాపూర్, అమరావతి, నాగ్‌పూర్‌ సభల్లో పాల్గొన్నారు. మజ్లిస్‌ పార్టీ హైదరాబాద్‌ లోక్‌సభతో పాటు మహారాష్ట్రలోని ఔరంగాబాద్, బిహార్‌లోని కిషన్‌గంజ్‌ స్థానాల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top