వండిందే మెనూ.. పెట్టిందే తిను!

Mid Day Meals.. - Sakshi

మరికల్‌ గురుకుల పాఠశాలలో కాంట్రాక్టర్ల కక్కుర్తి

అమలుకు నోచని మెనూ

అపరిశుభ్రంగా మరుగుదొడ్లు, వేధిస్తున్న తాగునీటి సమస్య

అధికారుల పర్యవేక్షణ  లోపమే అసలు కారణం

మటన్‌ స్థానంలో చికెన్‌.. చికెన్‌ స్థానంలో సాంబారు.. సాంబారు స్థానంలో నీళ్లచారు.. ఇదీ మరికల్‌ గురుకుల పాఠశాలలోని మెనూ.. అడిగే వారు లేక విద్యార్థుల కడుపు కొట్టి కాంట్రాక్టర్లు కాసులు వెనకేస్తున్నారు.. బాధ్యతగా వ్యవహరించాల్సిన ప్రిన్సిపాల్‌ సైతం విద్యార్థులకు అందాల్సిన మెనూ విషయమై కాంట్రాక్టర్ల వద్ద నోరు మెదపడం లేదు..

ఇంత జరుగుతున్న ప్రజాప్రతినిధులు, అధికారులు జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో ఎక్కడా విద్యార్థులకు అందిస్తున్న భోజనం మెనూ తెలుసుకోవడం కోసం ఏనాడూ ప్రయత్నించకపోవడంతో వారు 
ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారింది..

మరికల్‌ (నారాయణపేట) : మరికల్‌ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల అవినీతి, అక్రమాలకు అడ్డాగా మారింది. ఇక్కడ అధికారుల పర్యవేక్షణ లేకపొవడంతో భోజన కాంట్రాక్టర్లు వారు వండిందే మెనూ.. పెట్టిందే తినూ అన్న చందంగా తయారైంది గురుకుల పాఠశాల విద్యార్థుల పరిస్థితి. నాలుగు డబ్బులు వెనక వేసుకోవడం కోసం కూరగాయాలు, వివిధ సరుకులు అందిస్తున్న కాంట్రాక్టర్లు విద్యార్థుల నోళ్లు కొడుతున్నా ఇక్కడ పనిచేస్తున్న ప్రిన్సిపాల్, అధ్యాపకులు ఎందుకు నోరు విప్పడం లేదని గతంలో విద్యార్థుల తల్లిదంద్రులు ఆందోళనకు దిగిన సంఘటనలు కోకొల్లలు.  

దారితప్పిన మెనూ 

సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలాల్లో వి ద్యార్థులకు మంచి భోజనం అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం గుడ్డుతోపాటు మటన్, చికె న్‌ మెనూలో చేర్చింది. ప్రతినెల మొదటి, మూడో ఆదివారం విద్యార్థులకు మెనూ ప్రకారం మటన్‌ పెట్టాలి. 2వ, 4వ ఆదివారాల్లో చికెన్‌ భోజనం పెట్టాలి. పాఠశాతలు ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా కాంట్రాక్టర్‌ ఇప్పటి వరకు కేవలం రెండుసార్లు మాత్రమే మటన్‌ పెట్టినట్లు విద్యార్థులు తెలిపారు.

చికెన్‌ మాత్రం వారికి ఎప్పుడు ఇష్టం వస్తే అప్పుడు పెడుతూ ఆ రోజు మెనూను దారి తప్పిస్తున్నారు. మిగతా వారాల్లో సాంబర్, నీళ్ల చారు తప్ప మరొకటి ఉండదు. కూరగాయల, పాలు, గుడ్లు, మటన్, చికెన్, స్నాక్స్‌ను దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఎప్పుడు కూడా ఇక్కడ మెనూ పాటించడం లేదనే వాదన విద్యార్థుల నుంచి వినిపిస్తుంది. ప్రతిరోజు విద్యార్థులకు సాయంత్రం అందించే స్నాక్స్‌ పైతరగతి విద్యార్థులకు మాత్రమే అందుతున్నట్లు సమాచారం.  

విద్యార్థులను భయపెట్టి 

మెనూ ప్రకారం భోజనం పెట్టలేదనే విషయాలను కాని ఇక్కడ మరొకటి ఏదైనా సంఘటనలు జరిగిన విషయాలను బయట ఎవరికైనా, తల్లిదండ్రులకైనా చెబితే కఠిన చర్యలు తీసుకుంటామని స్వయంగా ప్రిన్సిపాల్, అద్యాపకులే విద్యార్థులను భయపెడుతున్నట్లు సమాచారం. అయితే ఈ వ్యవహారం ఇప్పుడే మొదలైంది కాదని.. గతంలో నుంచే కొనసాగుతుందని విద్యార్థులు వాపోతున్నారు. ఇక్కడి ఏ ప్రిన్సిపాల్‌ బదిలీపై వచ్చినా ముందుగా చెప్పే మాటలే ఇవని విద్యార్థులు పేర్కొనడం గమనార్హం.  

సమస్యల తిష్ట.. 

స్థానిక గురుకుల పాఠశాలలో 680 మంది విద్యార్థులున్నారు. ఇక్కడ అనేక సమస్యలు తిష్టవేసి పీడిస్తున్నాయి. జలమణి కింద శుద్ధనీరు అందకపోవడంతో గత కొన్నాళ్ల నుంచి ప్రధానంగా నీటి సమస్య నెలకొంది. ఎలిగండ్ల మన్నేవాగు నుంచి నీటి సమస్యను పరిష్కరించేందుకు పైపులైన్‌ వేసి అసంపూర్తిగా వదిలేశారు. అలాగే మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉండటంతో విద్యార్థులు కాలకృత్యాలను తీర్చుకోవడం కోసం తంటాలు పడుతున్నారు. మరోపక్క గురుకుల పాఠశాల ఆవరణలో పాములు బెడద చాలా ఉంది. దీంతో విద్యార్థులు రాత్రివేళలో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top