యాదాద్రి తరహాలో కరీంనగర్ జిల్లా వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి త్వరలో ప్రత్యేక అథారిటీ ఏర్పాటుకానుంది.
వేములవాడ : యాదాద్రి తరహాలో కరీంనగర్ జిల్లా వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి త్వరలో ప్రత్యేక అథారిటీ ఏర్పాటుకానుంది. దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి శనివారం తన శాఖ అధికారులతో సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆలయానికి రెండో ప్రాకరణ, మహా మండపం నిర్మాణం, వేదపాఠశాల ఏర్పాటుపై శృంగేరి పీఠం నుంచి సూచనలు, సలహాలు తీసుకోవాలని నిర్ణయించారు. ఇందుకోసం త్వరలో దేవాదాయశాఖ అధికారులను శృంగేరీకి పంపాలని మంత్రి ఆదేశించారు.
ఆలయ కోనేరు చుట్టూ విస్తరణ పనులు, ఆ ప్రాంతానికి రింగురోడ్డు నిర్మాణానికి సంబంధించి నీటిపారుదల శాఖ ఇప్పటికే డీపీఆర్ రూపొందించింది. గుడి చెరువు వద్ద ఆధ్యాత్మికపార్కు నిర్మాణానికి సంబంధించి దేవాదాయ శాఖ సిద్ధం చేసిన ప్రతిపాదనపై కూడా సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో దేవాదాయశాఖ కార్యదర్శి శివశంకర్, జాయింట్ కమిషనర్ కృష్ణవేణి, ఆలయ ఈఓ రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.