breaking news
Temple development authority
-
యాదాద్రికి గురిజాపల్లి ‘కృష్ణశిల’
♦ రాజగోపురం, పిల్లర్లకు ప్రకాశం జిల్లా రాయిని ఎంపిక చేసిన వైటీడీఏ ♦ త్వరలోనే ప్రారంభం కానున్న రాతి పనులు సాక్షి ప్రతినిధి, నల్లగొండ: యాదాద్రి క్షేత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలన్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పంలో తొలి అంకం ముగిసింది. స్వయంభు నారసింహుడి గర్భగుడిని మూసివేసి ఆధునికీకరణ పనులను ప్రారంభించేందుకుగాను భక్తుల దర్శనార్థం ఏర్పాటు చేసిన బాలాలయ ప్రతిష్ఠాపన మహోత్సవం గురువారం వైభ వంగా జరిగింది. యాదాద్రి ఆధునికీకరణ పూర్తిస్థాయిలో ప్రారంభమయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఆలయ రాజగోపురం, ప్రధాన ఆలయ ప్రాకారాలను నిర్మించేందుకు గాను అనేక తర్జన భర్జనల అనంతరం ప్రకాశం జిల్లా గురిజాపల్లిలో లభించే ‘కృష్ణశిల’ (బ్లాక్ స్టోన్)ను ఉపయోగించాలని 14 మంది సభ్యులు గల యాదా ద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ (వైటీడీఏ) నిర్ణయిం చింది. దేశంలోని వివిధ వైష్ణవాలయాలకు ఉపయోగించిన రాళ్లను అధ్యయనం చేయడంతో పాటు తెలంగాణ, ఏపీలోని పలు జిల్లాల్లో ఉన్న రాళ్లను వైటీడీఏ వైస్‌చైర్మన్ కిషన్‌రావు, ఆలయ స్థపతి సుందర రాజన్, ప్రధాన ఆర్కిటెక్ట్ ఆనంద్‌సాయి, ఆలయ ఈవో గీతారెడ్డి పరిశీలించిన అనంతరం ఈ గురిజాపల్లి నల్లరాయిని ఉపయోగించాలని నిర్ణయించినట్టు తెలిసింది. మిగిలిన పనులను నల్లగొండ జిల్లా భువనగిరి సమీపంలోని రాయగిరి రాళ్లతోనే చేయనున్నారు. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని వైటీడీఏ అధికారి చెప్పారు. -
త్వరలో వేములవాడ ఆలయ అభివృద్ధి అథారిటీ
వేములవాడ : యాదాద్రి తరహాలో కరీంనగర్ జిల్లా వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి త్వరలో ప్రత్యేక అథారిటీ ఏర్పాటుకానుంది. దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి శనివారం తన శాఖ అధికారులతో సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆలయానికి రెండో ప్రాకరణ, మహా మండపం నిర్మాణం, వేదపాఠశాల ఏర్పాటుపై శృంగేరి పీఠం నుంచి సూచనలు, సలహాలు తీసుకోవాలని నిర్ణయించారు. ఇందుకోసం త్వరలో దేవాదాయశాఖ అధికారులను శృంగేరీకి పంపాలని మంత్రి ఆదేశించారు. ఆలయ కోనేరు చుట్టూ విస్తరణ పనులు, ఆ ప్రాంతానికి రింగురోడ్డు నిర్మాణానికి సంబంధించి నీటిపారుదల శాఖ ఇప్పటికే డీపీఆర్ రూపొందించింది. గుడి చెరువు వద్ద ఆధ్యాత్మికపార్కు నిర్మాణానికి సంబంధించి దేవాదాయ శాఖ సిద్ధం చేసిన ప్రతిపాదనపై కూడా సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో దేవాదాయశాఖ కార్యదర్శి శివశంకర్, జాయింట్ కమిషనర్ కృష్ణవేణి, ఆలయ ఈఓ రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.