తక్కువ ధరకే మందులు అందించాలి

Medicines should Provide for Low cost - Sakshi

రాష్ట్ర గవర్నర్‌ తమిళి సై సౌందరరాజన్‌ సూచన 

ముగిసిన అంతర్జాతీయ రోగి భద్రత సదస్సు  

మాదాపూర్‌ : రాష్ట్రంలోని అన్ని వర్గాల వారికి తక్కువ ధరకే మందులు అందించేందుకు కృషి జరగాలని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ సూచించారు. మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో శనివారం జరిగిన ‘ఇంటర్నేషనల్‌ పేషెంట్‌ సేఫ్టీ కాన్ఫరెన్స్, ట్రాన్స్‌ ఫార్మింగ్‌ హెల్త్‌ కేర్‌ విత్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ’ముగింపు కార్యక్రమంలో గవర్నర్‌ మాట్లాడుతూ తెలంగాణలో మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఎన్నో పథకాలు పేద ప్రజలకు అందుబాటులో ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కొత్త ఆవిష్కరణలు, పరిశోధనల ద్వారా వైద్యాన్ని సామాన్యులకు మరింత చేరువ చేయాలన్నారు. 

ఆరోగ్య రాష్ట్రం దిశగా అడుగులు: ఈటల  
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య తెలంగాణ దిశగా అడుగులు వేస్తోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. ఇప్పటికీ ‘కంటి వెలుగు’ను విజయవంతంగా పూర్తి చేశామన్నారు. త్వరలో ‘తెలంగాణ హెల్త్‌ ప్రొఫైల్‌’ తయారు చేయబోతున్నామన్నారు. టీ–డయాగ్నొస్టిక్, టీ–డయాలజీ లాంటి సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందన్నారు. హైదరాబాద్‌ను ప్రపంచ హెల్త్‌ హబ్‌గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ సమావేశం ఆరోగ్య భద్రతకు ఎదురవుతున్న సవాళ్లకు పరిష్కారం చూపిస్తోందన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన డాక్టర్లకు బహుమతులు, మెమెంటోలనకు గవర్నర్‌ అందజేశారు. ఈ కార్యక్రమంలో అపోలో ఆసుపత్రుల చైర్మన్‌ ప్రతాప్‌ సీ రెడ్డి, జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సంగీతారెడ్డి, శోభన కామినేనిలతో పాటు డాక్టర్లు, 2,500 మంది ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top