సవా‘లక్ష’ ప్రశ్నలు | many more questions on loan waiver | Sakshi
Sakshi News home page

సవా‘లక్ష’ ప్రశ్నలు

Aug 14 2014 3:40 AM | Updated on Jun 4 2019 5:04 PM

రైతు రుణాల మాఫీపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై జిల్లా రైతులు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఖమ్మం వ్యవసాయం: రైతు రుణాల మాఫీపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై జిల్లా రైతులు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కుటుంబానికి రూ.లక్ష లోపు రుణాన్ని వూత్రమే మాఫీ చేస్తామని జీవోలో పేర్కొనడం సరైంది కాదంటున్నారు. ఎన్నికల ముందు లక్షలోపు రైతుల రుణాలన్నింటినీ మాఫీ చేస్తానన్న కేసీఆర్ ఇప్పుడు దాన్ని కుటుంబానికి పరిమితం చేయడంపై విమర్శలు వస్తున్నాయి.

 ప్రభుత్వం జారీ చేసిన జీవోలో స్పష్టత లేదని, 2014 మార్చికి 18 నెలల ముందు తీసుకున్న రుణాలకు మాత్రమే మాఫీ వర్తిస్తుందనడం అవకాశవాదమేనని అంటున్నారు. జిల్లాలో వ్యవసాయ అనుబంధంగా 5.70 లక్షల మంది రైతులు తీసుకున్న మొత్తం రూ.4021 కోట్ల బకాయిలున్నాయి. పంట రుణాలుగా 3.76 లక్షల మంది రైతులు తీసుకున్న రుణాలు రూ. 2,021 కోట్లు.

 గత సంవత్సరం 2.66 లక్షల మంది రైతులకు రూ. 1,266 కోట్ల పంట రుణాలు అందజేశారు. ఇందులో 55 వేల మంది పాస్‌బుక్ ఆధారంగా బంగారం తాకట్టు పెట్టి రూ.486 కోట్లు రుణాలను తీసుకున్నారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం 2014 మార్చి 31కి 18 నెలల ముందు తీసుకున్న రుణాలు మాఫీ చేస్తున్నందున గత ఏడాది తీసుకున్న రుణాలు మాత్రమే మాఫీ అవుతాయి.

 మార్గదర్శకాలు ఇలా..
 రుణమాఫీని ఎలా వర్తింప చేయాలనే అంశాలకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. వడ్డీతో కలుపుకొని లక్ష రూపాయల లోపు రుణాలను మాఫీ చేసేలా చర్యలు తీసుకున్నారు. 2014 మార్చి 31కి ముందు తీసుకున్న రుణాలకు మాత్రమే ఈ రుణ మాఫీ వర్తిస్తుంది. తీసుకున్న రుణాలు 18 నెలల లోపు తిరిగి చెల్లించేవిగా ఉండే వాటికి ఈ మాఫీ వర్తిస్తుంది. అంటే 2012 సెప్టెంబర్ నుంచి తీసుకున్న రుణాలకు ఈ మాఫీ వర్తించే అవకాశం ఉంది.

అన్ని కమర్షియల్ బ్యాంకులు, క్రెడిట్ కో-ఆపరేటివ్ సంస్థలు, రీజనల్ రూరల్ బ్యాంక్‌లలో తీసుకున్న రుణాలను మాఫీ చేయాలని బ్యాంకర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఒక బ్యాంకులో రుణం తీసుకుంటే ఆ బ్యాంకు రుణం మాఫీ చేస్తుంది. అయితే రెండో బ్యాంకులో కూడా రుణం తీసుకొని ఉంటే మండల స్థాయి బ్యాంక్ అధికారుల కమిటీ ఈ వ్యవహారాన్ని వారికున్న ఆదేశాలు, సూచనల మేరకు నిర్ణయిస్తుంది. కుటుంబంలో భర్త, బార్య, పిల్లలు ఎవరైనా ఒకరికి మాత్రమే ఈ రుణమాఫీ వర్తించే విధంగా చర్యలు తీసుకున్నారు. టైడ్ లోన్సుకు, ఇప్పటికే పంట రుణాలు తీసుకొని ముగించిన వారికి ఈ రుణమాఫీ వర్తించదు. రుణమాఫీ పొందిన రైతులకు తక్షణమే రుణాలు ఇవ్వాలని కూడా ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement