‘భవిష్యత్‌’ బలహీనం!

Malnutrition Shows Huge Impact On Children Health - Sakshi

సత్తువ లేని భావిపౌరులు

వసతిగృహాల్లోని చిన్నారుల్లో రక్తహీనత

65.3 శాతం పిల్లల్లో అనీమియా

13.1 శాతం పిల్లల్లో తీవ్ర సమస్యలు

బాలుర కంటే బాలికల్లోనే అత్యధికం

ఆరోగ్యకరంగా ఉన్నది 34.7 శాతమే

నివారణ చర్యలు పట్టని సంక్షేమ శాఖలు

సాక్షి, హైదరాబాద్‌: శరీరానికి సరిపడా పోషకాహారాన్ని తీసుకోకపోవడంతో భావిపౌరులు సత్తువ కోల్పోతున్నారు. వసతిగృహాల్లో పౌష్టికాహారాన్ని ఇస్తున్నప్పటికీ అక్కడి విద్యార్థుల్లో రక్తహీనత అధికంగా ఉంటోంది. తీసుకునే ఆహారంలో పోషకాలు లోపిస్తున్నాయో... లేక సరైన ఆహారమే అందడం లేదో కాని అత్యధికుల్లో రక్తహీనత లోపం కనిపిస్తోంది. ఒక ప్రైవేటు సంస్థ చేసిన సర్వేలో ఈ విషయం వెలుగు చూసింది. రాష్ట్రవ్యాప్తంగా 2,245 సంక్షేమ వసతి గృహాలున్నాయి. వీటి పరిధిలో 2.85 లక్షల మంది విద్యా ర్థులు వసతి పొందుతున్నారు. ప్రస్తుతమున్న వసతి గృహాల్లో 1,722 వసతి గృహాలు ప్రీ మెట్రిక్‌ హాస్టళ్లు కాగా.. మిగతా 523 వసతి గృహాలు పోస్టుమెట్రిక్‌ హాస్టళ్లు. తాజాగా ప్రీ మెట్రిక్‌ హాస్టళ్లలోని విద్యార్థుల ఆరోగ్య స్థితిపై ఓ సంస్థ అధ్యయనం చేసింది. అనీమియా కారణంగా దాదాపు 65.3 శాతం చిన్నారుల ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తేలింది. వీరిలో అత్యధికంగా బాలికలే ఉండడం గమనార్హం. 

బాలికల్లో అత్యధికం.. 
రక్తహీనత బాలుర కంటే బాలికల్లోనే అత్యధికంగా ఉంది. సాధారణంగా పిల్లల రక్తంలో ప్రతీ డెస్సీలీటర్‌కు కనీసం 12 గ్రాముల హిమోగ్లోబిన్‌ ఉండాలి. అంతకంటే తక్కువగా ఉంటే రక్తహీనత సమస్య ఉన్నట్లే. కానీ చాలామంది చిన్నారుల్లో 10 గ్రాములు/డీఎల్‌ కంటే తక్కువ ఉన్నట్లు తేలింది. ప్రతి 100 మంది బాలికల్లో 55 మందిలో రక్తహీనత తీవ్రంగా ఉంది. అదే బాలుర కేటగిరీలో 50 మంది పిల్లల్లో రక్తహీనత ఉన్నట్లు స్పష్టమైంది. ప్రతి 100 మందిలో 13 మంది పిల్లల ఆరోగ్యం ప్రమాదకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. రక్తహీనతతోపాటు పోషక లోపాలతో ఇతర అనారోగ్యాల బారిన పడుతున్నట్లు తెలుస్తోంది. నూరు మందిలో కేవలం 35 మంది పిల్లలు మాత్రమే ఆరోగ్యంగా ఉన్నట్లు సర్వేలో తేలింది.

అనర్థాలకు దారితీసేలా.. 
ఐరన్, ఫోలిక్‌ యాసిడ్, విటమిన్‌ బీ12 లోపించిన చిన్నారుల్లో రక్తహీనత సమస్యలు తలెత్తుతాయి. పిల్లల్లో రక్తహీనత సమస్య పలు అనర్థాలకు దారితీస్తాయి. ముఖ్యంగా చిన్నారుల ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అదేవిధంగా శ్వాస సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పలు రకాల ఇన్ఫెక్షన్లు సోకి దీర్ఘకా లిక వ్యాధులకు ఆస్కారం ఉంటుంది. రోగ నిరోధక శక్తి కోల్పోయి పలు రకాల వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది. దీంతో వారు ఏకాగ్రతను క్రమంగా కోల్పోయి అనారోగ్యానికి గురవుతారు. ఏఎన్‌ఎమ్‌లు వసతిగృహాలకు క్రమం తప్పకుండా వెళ్లి పిల్లల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించాల్సి ఉంది. అయితే అదేమీ లేకపోవడంతో పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. మరోవైపు సంక్షేమ శాఖలు కూడా దీనికి సంబంధించి ఎటువంటి నివారణ చర్యలను చేపట్టడం లేదు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top