ఓఆర్‌ఆర్‌.. ఇక జిగేల్‌!

LED Bulbs Use In ORR Soon Funds Release - Sakshi

ఔటర్‌ రింగ్‌రోడ్డు పొడవునా ఎల్‌ఈడీ బల్బులు

గచ్చిబౌలి–శంషాబాద్‌ మార్గంలో మాదిరిగానే

మిగతా ప్రాంతాల్లో...133.62 కి.మీ పరిధిలో

బల్బుల ఏర్పాటుకు రూ.107 కోట్లు ఖర్చు

సాక్షి, సిటీబ్యూరో: ఔటర్‌ రింగ్‌ రోడ్డు(ఓఆర్‌ఆర్‌)పై ఇక పూర్తి స్థాయిలో ఎల్‌ఈడీ వెలుగులు విరజిమ్మనున్నాయి. ఇప్పటికే 24.38 కిలోమీటర్ల మేర శంషాబాద్‌–గచ్చిబౌలి మార్గంలో అమర్చిన ఎల్‌ఈడీ బల్బులు రోడ్డు ప్రమాదాల నియంత్రణకు బాగా తోడ్పడ్డాయి. దీంతో మిగిలిన 133.62 కిలోమీటర్లలోనూ పూర్తి స్థాయిలో ఎల్‌ఈడీ వెలుగులు తీసుకొచ్చే దిశగా హెచ్‌ఎండీఏ అడుగులు వేస్తోంది. ఈ ఏడాది డిసెంబర్‌ నెలాఖరునాటికి ఓఆర్‌ఆర్‌ పూర్తిస్థాయిలో ఎల్‌ఈడీ వెలుగుల్లో కనపడాలని సీఎస్‌ ఎస్‌కే జోషి ఆదేశాలిచ్చారు. ఈ మేరకు రూ.107 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచారు. చెన్నైకి చెందిన శబరి ఎలక్ట్రికల్, హైదరాబాద్‌కు చెందిన కేఎంవీ ప్రాజెక్ట్స్‌ కంపెనీలు ఇందుకు పోటీపడుతున్నాయి. మరో వారం రోజుల్లో టెండర్‌ ఫైనల్‌ చేసి పనులు ప్రారంభించేలా హెచ్‌ఎండీఏ అధికారులు చొరవ తీసుకుంటున్నారు. అంటే టెండర్‌  నియమ నిబంధనల ప్రకారం 15 నెలల్లో ఎల్‌ఈడీ లైట్ల బిగింపు పనులు పూర్తి చేయాలి. 

పదివేలకుపైగా బల్బులు...
శంషాబాద్‌ ముగింపు ప్రదేశం నుంచి కోకాపేట ముగింపు ప్రదేశం వరకు కిలోమీటర్‌కు 40 స్తంభాల చొప్పున అంటే 133.62 కిలోమీటర్లకు 5,345 స్తంభాలను ఏర్పాటుచేయనున్నారు. అలాగే ఒక్కో స్తంభానికి రెండు లైట్ల చొప్పున 10,690 లైట్లు బిగించనున్నారు. మెయిన్‌ క్యారేజ్‌ వే, జంక్షన్ల మొదలుకొని అన్ని ప్రాంతాల్లో వెలుతురు ఉండేలా జాగ్రత్తలు తీసుకోనున్నారు. కిలోమీటర్‌న్నరకు ఒక్కో కంట్రోల్‌ బాక్స్‌ను కూడా ఏర్పాటుచేయనున్నారు. ఇప్పటికే గతేడాది జూన్‌ నెలలో 24.38 కిలోమీటర్ల ఓఆర్‌ఆర్‌ శంషాబాద్‌–గచ్చిబౌలి మార్గంలో ఫిలిప్స్‌ కంపెనీ ఎల్‌ఈడీ వెలుగులు అందుబాటులోకొచ్చిన సంగతి తెలిసిందే. మిగిలిన 133.62 కిలోమీటర్ల పనులు వచ్చే ఏడాది డిసెంబర్‌ నాటికి పనులు దక్కించుకున్న సంస్థ పూర్తి చేసే అవకాశముంది. 

ఆటోమేటిక్‌ సిస్టం...
గచ్చిబౌలి నుంచి శంషాబాద్‌ మార్గంలో ప్రస్తుతం పనిచేస్తున్న జీఎస్‌ఎం ఆధారంగా ఆటోమేషన్‌ సిస్టమ్, వెబ్‌ బేస్‌డ్‌ మేనేజ్‌మెంట్‌తో ఎల్‌ఈడీ లైటింగ్‌ వ్యవస్థను పనిచేసేలా అధికారులు తీర్చిదిద్దనున్నారు. ఎల్‌ఈడీ బల్బుల వల్ల విద్యుత్‌ ఖర్చు తక్కువ కావడంతో పాటు ముందు వెళ్లే వాహనాలు స్పష్టంగా కనిపిస్తాయి. సెన్సర్ల సహాయంతో వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు ఎల్‌ఈడీ బల్బులు దేదీప్యమానంగా వెలుగుతాయి. రద్దీ లేనప్పుడు దానంతటే అదే 50 శాతం వెలుగు తగ్గిపోతుంది. ఫలితంగా విద్యుత్‌ బిల్లులు తగ్గనున్నాయి. ఎల్‌ఈడీ దీపాల నిర్వహణ ఎలా ఉంది...సరిగ్గా ఉందా లేదా అనే తదితర అంశాలను అధికారులు ఆన్‌లైన్‌ ద్వారా పర్యవేక్షించే వెసులుబాటుంది. స్తంభాలకున్న జంక్షన్‌ బాక్సులను ఎవరైనా తెరిచిన...తస్కరించినా...విద్యుత్‌ చౌర్యం చేసినా వెంటనే ఆ సమాచారం సంబంధిత అధికారులు, హెచ్‌ఎండీఏ అధికారులకు తెలిసిపోయేలా ఏర్పాట్లు చేయనున్నారు.

రాత్రివేళ ప్రయాణం సేఫ్‌...
అంతర్జాతీయ ప్రమాణాలతో అందుబాటులోకి వచ్చిన ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌)పై రాత్రి ప్రయాణమంటే ప్రాణంతో చెలగాటం. రహదారిపై వాహనాలు నిలిపి ఉండటంతో చీకట్లో దగ్గరకు వచ్చేవరకు ఎదుటి వాహనాలు కనిపించక ప్రమాదాలు జరిగిన ఘటనలు అనేకం. వేగాన్ని అదుపుచేయలేక ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. అయితే దీనంతటికి కారణం ఓఆర్‌ఆర్‌లో రాత్రి సమయాల్లో వెలుతురు లేకపోవడమనే రెండేళ్ల క్రితం గుర్తించిన హెచ్‌ఎండీఏ అధికారులు గతేడాది గచ్చిబౌలి–శంషాబాద్‌ మార్గంలో ప్రయోగాత్మకంగా ఎల్‌ఈడీ బల్బులు అమర్చారు. దీనివల్ల ఆ మార్గంలో ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయి.

సురక్షిత ప్రయాణం కోసమే...
ఔటర్‌పై రోజుకు ప్రయాణించే వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగింది. గతేడాది 76 వేల వాహనాలుంటే ఇప్పుడది లక్షకు చేరుకుంది. రద్దీ సమయాల్లో రాత్రి సమయాల్లో ప్రమాదాలు జరిగి రోడ్లు నెత్తురోడుతున్నాయి. లైటింగ్‌ వ్యవస్థ లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించి ఎల్‌ఈడీ లైటింగ్‌ వ్యవస్థకు శ్రీకారం చుట్టాం. ఇందులో భాగంగానే గచ్చిబౌలి–శంషాబాద్‌ మార్గంలో ప్రయోగాత్మకంగా ఏర్పాటుచేసిన ఎల్‌ఈడీ లైటింగ్‌ సత్ఫలితాలనిచ్చింది. దీంతో ఈ వెలుగుల ప్రక్రియను మిగిలిన 133.62 కిలోమీటర్లలోనూ చేపడుతున్నాం. – టి.చిరంజీవులు,హెచ్‌ఎండీఏ కమిషనర్‌   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top