విద్యుత్‌వైరు తెగిపడి లారీ దగ్ధం | Larry burnt vidyutvairu tegipadi | Sakshi
Sakshi News home page

విద్యుత్‌వైరు తెగిపడి లారీ దగ్ధం

Feb 24 2015 3:57 AM | Updated on Apr 3 2019 7:53 PM

ప్రమాదవశాత్తు విద్యుత్‌వైరు తెగిపడటంతో ఓ లారీ దగ్ధమైంది. ఈ సంఘటన సోమవారం మండలంలోని పెద్దముద్దునూర్ గ్రామంలో చోటుచేసుకుంది.

నాగర్‌కర్నూల్ రూరల్: ప్రమాదవశాత్తు విద్యుత్‌వైరు తెగిపడటంతో ఓ లారీ దగ్ధమైంది. ఈ సంఘటన సోమవారం మండలంలోని పెద్దముద్దునూర్ గ్రామంలో చోటుచేసుకుంది. బొగ్గుల లోడ్‌తో పంజాబ్‌కు చెందిన ఓ లారీ రోడ్డుపై వెళ్తుండగా ఒక్కసారిగా వైర్లు తెగిపడి నిప్పు చెలరేగి మంటలు అంటుకున్నాయి. ఇంతలో లారీ పూర్తిగా దగ్ధమైంది. ఈ సంఘటనలో దాదాపు రూ.35లక్షల నష్టం జరిగి ఉంటుందని నాగర్‌కర్నూల్ ఫైర్‌స్టేషన్ అధికారులు అంచనా వేశారు.

సమాచారం తెలుసుకున్న నాగర్‌కర్నూల్, కొల్లాపూర్ ఫైర్ స్టేషన్ అధికారులు అక్కడికి వెళ్లి మంటలను ఆర్పివేయడంతో పాటు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. కొల్లాపూర్ ఫైర్‌స్టేషన్ అధికారి శ్రీనయ్య, సిబ్బంది బి.రాములు, రాంచందర్, బాలస్వామి, నాగేష్, తదితరులు పాల్గొనగా నాగర్‌కర్నూల్ హెడ్ కానిస్టేబుల్ బాలయ్య సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
 
తెగిన వైర్లు.. తప్పిన ప్రమాదం
ఆత్మకూరు (నర్వ): వరిపొలంలో 11 కెవీ హైటెన్షన్ విద్యుత్‌వైరు తెగిపోవడంతో 30 మంది కూలీలు ప్రాణాపాయంతో పరుగులు తీశారు. ఈ సంఘటన అమరచింత పట్టణంలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు తోకలి శంకర్ వ్యవసాయ పొలంలో 30 మంది కూలీలు కలుపుతీస్తున్నారు. ఉన్నట్టుండి ఒక్కసారిగా విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. తేరుకున్న కూలీలు వెంటనే పొలం నుంచి బయటికి పరుగులు పెట్టారు.

సమీపంలో ఉన్న రైతులు గమనించి సబ్‌స్టేషన్‌కు సమాచారం అందించడంతో విద్యుత్ సరఫరాను నిలిపేశారు. ఇంతలోనే సమీప పంటపొలాల్లోని రైతులకు చెందిన పదికిపైగా విద్యుత్ మోటార్లు, స్టార్టర్లు పైగా కాలిపోయాయి. తమ పంటపొలాల్లో ఏర్పాటుచేసిన  విద్యుత్ తీగల మూలాన రోజు విడిచిరోజు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని వారు ఆందోళన చెందుతున్నారు. ఇలా తీగలు తెగిపడితే తమ ప్రాణాకు కూడా ముప్పు ఉందని, ట్రాన్స్‌కో అధికారులకు తెలియజేసినా స్పందన లేదని వాపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement