టార్గెట్‌ హస్తిన..

KTR To Start Election Campaign And First Meeting In Karimnagar - Sakshi

16 లోక్‌సభ స్థానాల్లో ‘కారు’ గెలుపే లక్ష్యం

నేటి నుంచి టీఆర్‌ఎస్‌ సన్నాహక సమావేశాలు

కరీంనగర్‌ స్థానం నుంచి మొదలు

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హాజరు

ఎన్నికల షెడ్యూల్‌ రాగానే అభ్యర్థుల ప్రకటన

మూడునాలుగు స్థానాల్లో మార్పులు

సాక్షి, హైదరాబాద్‌: పార్లమెంట్‌ పోరుకు తెలంగాణ రాష్ట్ర సమితి సిద్ధమైంది. టీఆర్‌ఎస్‌ శ్రేణులను లోక్‌సభ ఎన్నికలకు సిద్ధం చేసే ప్రక్రియ మొదలవుతోంది. వచ్చే ఎన్నికల్లో 16 లోక్‌సభ సీట్లను గెలుచుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న టీఆర్‌ఎస్‌.. ప్రత్యర్థి పార్టీల కంటే ముందుగానే ఎన్నికల వ్యూహాన్ని అమలు చేస్తోంది. టీఆర్‌ఎస్‌ శ్రేణులను, నేతలను ఎన్నికలకు సిద్ధం చేసేందుకు లోక్‌సభ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తోంది. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారకరామారావు ఈ సమావేశాలకు హాజరవుతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు వ్యూహాన్ని పార్టీ శ్రేణులకు వివరిస్తారు. అసెంబ్లీ ఎన్నికల కంటే ఎక్కువగా కష్టపడి పనిచేయాలని, భారీ మెజారిటీతో ఎంపీ సీట్లను గెలుచుకునేలా పనిచేయాలని గులాబీ శ్రేణులకు సూచించనున్నారు. గులాబీ పార్టీకి సెంటిమెంట్‌ పరంగా కలసి వచ్చిన కరీంనగర్‌ లోక్‌సభ స్థానం నుంచి సన్నాహక సమావేశాలు మొదలు కానున్నాయి. బుధవారం కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో నియోజకవర్గ సన్నాహక సమావేశం జరగనుంది. మార్చి 17తో ఈ సమావేశాలు ముగియనున్నాయి. అనంతరం అభ్యర్థులను ప్రకటించి పూర్తి స్థాయిలో ప్రచారం ప్రారంభించనున్నారు.
అభ్యర్థుల ఎంపికపై కేసీఆర్‌ దృష్టి...
రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాలున్నాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 11, కాంగ్రెస్‌ 2 స్థానాలను... బీజేపీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, టీడీపీ, ఎంఐఎం ఒక్కో సీటును గెలుచుకున్నాయి. నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి (కాంగ్రెస్‌), మల్కాజిగిరి ఎంపీ సి.హెచ్‌.మల్లారెడ్డి (టీడీపీ), ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (వైఎస్సార్‌సీపీ) ఆ తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరారు. చేవెళ్ల లోక్‌సభ స్థానంలో టీఆర్‌ఎస్‌ తరుఫున గెలిచిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరారు. కేంద్ర రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించేందుకు వచ్చే ఎన్నికల్లో 16 ఎంపీ సీట్లను గెలుచుకోవాలని టీఆర్‌ఎస్‌ లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి అనుగుణంగా వ్యూహాన్ని అమలు చేస్తోంది. టీఆర్‌ఎస్‌ శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేయడం, విస్తృత ప్రచారంతోపాటు గెలిచే అభ్యర్థులను ఎంపిక చేసే అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టి సారించారు.

దీనికి అనుగుణంగా లోక్‌సభ నియోజకవర్గ స్థాయిలో సన్నాహక సమావేశాలను నిర్వహిస్తున్నారు. లోక్‌సభ సెగ్మెంట్‌ పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కనీసం రెండు వేల మంది చొప్పున ఈ దీనికి హాజరుకానున్నారు. ఇలా లోక్‌సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కలిపి సగటున 14 వేల మంది ఈ సభలో పాల్గొంటారు. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వీరికి ఎన్నికల వ్యూహాన్ని వివరిస్తారు. లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జీలు సమన్వయంతో పని చేయాలని సూచిస్తారు.
సిట్టింగ్‌లకే ప్రాధాన్యత...
లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల ప్రకటన విషయంలో టీఆర్‌ఎస్‌ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు భిన్నంగా లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల ప్రకటన ఉండనుంది. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అసెంబ్లీ రద్దు జరిగిన రోజే 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. అసెంబ్లీ రద్దుకు, ఎన్నికల పోలింగ్‌ మధ్య మూడు నెలలు ఉండటంతో ప్రచార ప్రక్రియ ఒకింత ఇబ్బందికరంగా మారింది. ప్రచార నిర్వహణ వ్యవహారం సుదీర్ఘంగా ఉండటంతో ఆర్థికంగా అభ్యర్థులకు, పార్టీకి భారమైంది. లోక్‌సభ ఎన్నికల్లో ఇలాంటి పరిస్థితికి ఆస్కారం లేకుండా షెడ్యూల్‌ వచ్చిన తర్వాతే అభ్యర్థులను ప్రకటించాలని భావిస్తున్నారు. ఇప్పటికే అన్ని స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. మూడునాలుగు స్థానాల్లో కొత్త వారికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. అభ్యర్థుల ఖరారు విషయంలో అసెంబ్లీ ఎన్నికల వ్యూహాన్నే అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ భావిస్తున్నారు. వీలైనంత వరకు ఎక్కువ మంది సిట్టింగ్‌ ఎంపీలకే మళ్లీ అవకాశం కల్పించనున్నారు. దాదాపు 10 స్థానాల్లో సిట్టింగ్‌ ఎంపీల పేర్లను ఖరారు చేసినట్లు తెలిసింది. మిగిలిన ఆరు సెగ్మెంట్లలో మాత్రం గెలుపు అంశాలను ప్రతిపాదనలోకి తీసుకుని అభ్యర్థులను ఖరారు చేయనున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top