ఎల్బీనగర్‌లో ఫ్లై ఓవర్‌ను ప్రారంభించిన కేటీఆర్‌ | Sakshi
Sakshi News home page

Published Fri, Aug 10 2018 7:24 PM

KTR Inaugurates Kamineni Flyover At LB Nagar - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్ చౌరస్తా వద్ద 49 కోట్లతో చేపట్టి నిర్మాణం పూర్తయిన ఫ్లై ఓవర్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పట్నం మహేందర్ రెడ్డి, బొంతు రామ్మోహన్, పార్లమెంట్ సభ్యులు చామకూర మల్లా రెడ్డి , ఎంఎల్ఏలు కృష్ణయ్య, తీగల కృష్ణారెడ్డి, కమీషనర్  జనార్థన్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ.. నగరంలో అత్యంత వేగంగా ఎల్బీనగర్‌ విస్తరణతో పాటు అభివృద్ధి సాగుతోందని పేర్కొన్నారు. 2030 వరకు హైదరాబాద్‌ మెగాసిటీగా అవతరిస్తుందని, దేశంలో మూడో స్థానంలో హైదరాబాద్‌ ఉంటుందని ఆశాభావం వ్యక్తంచేశారు. హైదరాబాద్‌కు చాలా ఫ్లై ఓవర్లు అవసరం ఉందని, అందుకే 23వేల కోట్ల రూపాయలతో ప్రణాళికను సిద్ధం చేశామని తెలిపారు. జాతీయ రహదారులను కూడా అభివృద్ధి చేస్తున్నామని, ఎల్బీనగర్‌లో రూ.450కోట్లతో రోడ్లు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఎన్ని రహదారులు విస్తరించిన ప్రూవేట్‌ వాహనాల రద్దీ తగ్గితేనే ట్రాఫిక్‌ సమస్య తగ్గుతుందని తెలిపారు. అమీర్‌పేట్‌-ఎల్బీనగర్‌ మెట్రో లైన్‌ను ఆగస్టు 15న ప్రారంభించాలనుకున్నామని కానీ, కొన్ని అనుమతులు రానందుకే ఆలస్యమవుతోందని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. ఎల్బీనగర్‌లోని కామినేని ఫ్లై ఓవర్‌ ఎడమ వైపు ప్రారంభించిన కేటీఆర్‌ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర మెట్రో సెఫ్టీ అథారిటీ పర్మిషన్‌ రానందుకే ఆలస్యమవుతోందని, సెప్టెంబర్‌ మొదటి వారంలో ప్రారంభిస్తామని తెలిపారు. 

‘హైదరాబాద్ - రంగారెడ్డి జిల్లాలో రోడ్ల అభివృద్ధి  46 వేల కోట్లు తో సాగుతున్నాయి. రద్దీగా ఉన్న ప్రాంతంలో ఇబ్బందులు కలగకుండ బ్రిడ్జీల నిర్మాణాలు. మహిళలకు మంచినీటి ఇబ్బందులు రాకుండా 1960 కోటలతో పనులు చేపట్టాం.  రంగారెడ్డి జిల్లాలో లక్ష మంది పేదలకు ఇళ్ళ పట్టాలు, మరో లక్షమంది కి డబుల్ బెడ్ రూంలను నిర్మిస్తున్నాం.  హైదరాబాద్ - రంగారెడ్డి జిల్లా పరిసరాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటుంన్నామ’ని రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌ రెడ్డి పేర్కొన్నారు.  ‘కెటిఆర్ హైదరాబాద్‌ను విశ్వ నగరంగా తీర్చి దిద్దుతున్నారు. వినూత్న ఆలోచనలు.. కొత్త దృక్పథంతో అభివృద్ధి చేస్తున్నారు. ప్రభుత్వ అభివృద్ది పధకాలకు మా మద్దతు ఉంటుంద’ని ఎల్ బి నగర్ ఎమ్మెల్యే ఆర్‌. కృష్ణయ్య  అన్నారు. ‘కామినేని వద్ద 944 మీటర్ల ఫ్లై ఓవర్ ను నిర్మించాము. 16 నెలల్లో ఫ్లై ఓవర్ ను నిర్మించారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా నగరంలో ఫ్లై ఓవర్లు నిర్మిస్తున్నామ’ని కమిషనర్ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. ఎల్బీ నగర్ సర్కిల్ కు మెట్రో స్టేషన్‌కు, లేదా కామినేని వద్ద నిర్మించిన ఫ్లై ఓవర్ కు అమరుడు శ్రీకాంతా చారి పేరు పెట్టాలని నిరసన కారులు ఆందోళన చేపట్టారు. 

Advertisement
Advertisement