‘కొండా’ కోర్టులోనే బంతి

Konda Couple Serious With TRS High Command Decision - Sakshi

సాక్షి ప్రతినిధి, వరంగల్‌ : వరంగల్‌ తూర్పు నియోజకవర్గం టికెట్‌ ఎవరికి ఇవ్వాలో తేల్చి చెప్పాలని అపద్ధర్మ ముఖ్యమంత్రి, గులాబీ దళపతి కేసీఆర్‌ కొండా దంపతులను కోరినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. కొండా దంపతులు రెండు శాసనసభ టికెట్లు అడుగుతుండగా రెండు టికెట్లు ఇచ్చే అవకాశం లేదని తూర్పు టికెట్‌ మాత్రమే ఉందని, కొండా సురేఖ లేదా సుస్మితా పటేల్‌లో ఎవరికి ఇవ్వమంటే వాళ్లకే ఇస్తామని కేసీఆర్‌ కరాఖండిగా చెప్పినట్లు తెలుస్తోంది. దీనికి ప్రతి సమాధానంగా తమ కూతురు సుస్మితా పటేల్‌కే ఇవ్వండని కొండా దంపతులు సూచనప్రాయంగా చెప్పినట్లు విశ్వసనీయంగా తెలిసింది.వారి సమాధానంతో కొంత సందిగ్ధంలో పడిన పార్టీ అధినాయకత్వం ఫైనల్‌గా ఏ విషయమైంది.. రెండు రోజుల్లో తేల్చిచెప్పాలని కొండా దంపతులను కోరినట్లు తెలుస్తోంది

మరోవైపు టీఆర్‌ఎస్‌ అధినాయకత్వం తీరుతో ఇబ్బందిపడుతున్న కొండా దంపతులు కాంగ్రెస్‌ పార్టీలో చేరాలనే నిర్ణయానికి వచ్చినట్లు, ఈ నెల 12న కాంగ్రెస్‌ పార్టీలో చేరుతారని ప్రచారం కూడా జరుగుతోంది. ఖచ్చితంగా తమకు రెండు టిక్కెట్లు కావాలని కొండా దంపతులు గట్టిగా పట్టుపడుతున్నారు. శనివారం కొండా మురళి పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ను కలిసే ప్రయత్నంలోఉన్నట్లు తెలిసింది. ఆయన సమయమిస్తే తన కూతురు సుస్మితా పటేల్, తన భార్య కొండా సురేఖకు చెరో టికెట్‌ ఇవ్వాలని చివరి ప్రయత్నంగా కోరే అవకాశం ఉంది. అందుకు కేసీఆర్‌ అంగీకరించకపోతే  టీఆర్‌ఎస్‌ నుంచి బయటికి వచ్చే అవకాశం ఉందని మురళి అనుచరులు చెప్తున్నారు.

మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ కొండా దంపతులను తిరిగి ఆహ్వానించి వరంగల్‌లో పార్టీకి పునఃవైభవం తేవాలనే యోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. వారు కోరిన రెండు టికెట్లు ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలిసింది. మరోవైపు పార్టీ తొలి జాబితాలో సురేఖకు చోటు దక్కకపోవడంతో ఆగ్రహంగా ఉన్న కొండా అనుచరులు తిరిగి సొంతగూటికి వెళ్దామని ఆయనపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారి రాజకీయ భవిష్యత్‌ కొంత సందిగ్ధంలోపడినట్లు తెలుస్తోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top