
సాక్షి, హైదరాబాద్: ప్రత్యే క తెలంగాణ రాష్టం ఏర్పడి ఆరేళ్లు కావస్తున్నా ఇప్పటివరకు అమర వీరులకు స్మృతివనాన్ని టీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్మించలేకపోయిందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. అమరుల స్మృతివనాన్ని నిర్మించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని, అన్ని సంఘాలను కలుపుకొని పోరాడతామని అన్నారు. శనివారం అసెంబ్లీ సమీపంలోని తెలంగాణ అమరుల స్తూపం వద్ద ఉద్యమంలో అమరులైన వారికి టీజేఎస్ నేతలతో కలిసి కోదండరాం నివాళులర్పించారు. హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో నామినేషన్లను దాఖలు చేసేందుకు వెళుతున్న సర్పంచ్‌లను ప్రభుత్వం అరెస్ట్ చేయడం సరికాదని, ఈ విషయంలో సీఈవో రజత్‌కుమార్ జోక్యం చేసుకోవాలని కోరారు.