ఖమ్మం సీపీఎం అభ్యర్థిగా వెంకట్‌  

Khammam CPM Declared Party Candidate As Venkat - Sakshi

ఈ నెల 22న నామినేషన్‌ 

హాజరు కానున్న సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి 

సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గ స్థానం నుంచి సీపీఎం అభ్యర్థిగా బోడా వెంకట్‌ను బరిలో నిలపనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్‌రావు ప్రకటించారు.       నగరంలోని సుందరయ్య భవన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏప్రిల్‌ 11వ తేదీన ఖమ్మం పార్లమెంట్‌ నియోజకవర్గానికి జరగనున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు సీపీఎం అభ్యర్థిగా వెంకట్‌ను నిర్ణయించామని, ఆయన ఈనెల 22వ తేదీన నామినేషన్‌ దాఖలు చేస్తారని చెప్పారు. ఆరోజు ఉదయం 11 గంటలకు పెవిలియన్‌ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామన్నారు. సభకు సీపీఎం అఖిలభారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతోపాటు ఇతర నాయకులు హాజరవుతారని తెలిపారు.

విద్యార్థి దశ నుంచే సమస్యలపై పోరాడిన వ్యక్తి వెంకట్‌ అని, విద్యార్థుల సమస్యలు, సంక్షేమం కోసం అనేక పోరాటాలు నిర్వహించారన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శిగా, వ్యవసాయ కార్మికసంఘ రాష్ట్ర బాధ్యుడిగా, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తిం చారని అన్నారు. కుల వివక్ష వ్యతిరేక ఉద్యమంలో కీలక పాత్ర వహించి జస్టిస్‌ పున్నయ్య కమిషన్‌ ఏర్పాటుకు కృషి చేశారన్నారు. భూ ఉద్యమం లో వెంకట్‌ చురుకైన పాత్ర పోషించి కోనేరు రంగారావు భూ కమిటీ ఏర్పాటుకు కారకులయ్యారని తెలిపారు. మల్లన్నసాగర్‌ ఉద్య మంలో రైతుల తరఫున ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకెళ్లారని పేర్కొన్నారు.  

రాజకీయ విలువలను దిగజార్చారు 
రాజకీయాన్ని వ్యాపారంగా మార్చి.. రాజకీయ విలువలను పూర్తిగా దిగజార్చారని, ప్రజాభిప్రాయాలకు తిలోదకాలు ఇస్తున్నారని పోతినేని సుదర్శన్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ, టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీల అభ్యర్థులు తమ వ్యాపారాలను కాపాడుకునేందుకు, అభివృద్ధి చేసుకునేందుకు రాజకీయాలను సంతలో సరుకుల్లా మార్చారని విమర్శించారు. ఆయా పార్టీల నుంచి గెలిచిన అభ్యర్థులు తమ స్వలాభం కోసం తప్ప ప్రజల కోసం పనిచేసిన దాఖలాలు లేవన్నారు. ప్రజలు తమ అభిప్రాయాలకు అనుగుణంగా ఓటు వేసి గెలిపిస్తే వారి వేలికి వేసిన సిరా చుక్క చెరగకముందే గెలిచిన అభ్యర్థులు ఇతర పార్టీల్లోకి మారి ఓటరును వెక్కిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఎంకు సీపీఐ, జనసేన, బీఎస్పీ మద్దతు ఉంటుందని తెలిపారు.

సీపీఎం ఖమ్మం పార్లమెంట్‌ అభ్యర్థి బి.వెంకట్‌ మాట్లాడుతూ తనకు ఖమ్మం పార్లమెంట్‌ నియోజకవర్గంపై పూర్తి అవగాహన ఉందని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, రైతుల ఇబ్బందులు, దళితుల సమస్యలన్ని తెలుసన్నారు. వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు తనకు తెలుసని చెప్పారు. వ్యాపారులు రాజకీయాల్లోకి ఎందుకు వస్తున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. కమ్యూనిస్టులు కలిసి పోటీచేయడం తెలంగాణకు అవసరమని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యుడు పొన్నం వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు యర్రా శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు. 

అభ్యర్థి బి.వెంకట్‌ బయోడేటా.. 
పేరు: బోడా వెంకట్‌ 
తండ్రి పేరు: బోడా బజారు 
తల్లిపేరు: బోడా నాగరత్నం 
పుట్టినతేది: 02.11.1964 
గ్రామం: వినోభానగర్, 
జూలూరుపాడు మండలం, ఉమ్మడి ఖమ్మంజిల్లా 
విద్యార్హత: డిగ్రీ 
భార్య: మేకల అరుణకుమారి 
రాజకీయ నేపథ్యం:మధ్య తరగతి రైతు కుటుంబంలో జన్మించారు. తండ్రి కాంగ్రెస్‌ పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. విద్యాభ్యాసం సమయంలో 1981లో ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి ఉద్యమానికి ఆకర్షితులయ్యారు. 1985లో సీపీఎం సభ్యుడు అయ్యారు. అనంతరం పార్టీ, అనుబంధ సంఘాల్లో రాష్ట్రస్థాయి బాధ్యతలను నిర్వర్తించారు. 

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top