40 లక్షల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంతో.. 

KCR Gave Orders For Building Of Warehouses In Telangana - Sakshi

సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో గోదాముల నిర్మాణానికి డీపీఆర్‌ తయారు చేసిన మార్కెటింగ్‌శాఖ

కొత్త గోదాముల కోసం రూ.2,500 కోట్ల వ్యయం

పంటల దిగుబడి గణనీయంగా పెరగడంతో యుద్ధప్రాతిపదికన సర్కారు ఏర్పాట్లు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వ్యవసాయ పంట ఉత్పత్తుల నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోవాలని సర్కారు నిర్ణయించింది. ప్రాజెక్టులు పూర్తవుతుండటం, సాగు విస్తీర్ణం పెరగడంతో ప్రభుత్వం గోదాముల నిర్మాణానికి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలతో వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ 40 లక్షల మెట్రిక్‌ సామర్థ్యం కలిగిన గోదాములను అన్ని జిల్లాల్లో నిర్మించాలని నిర్ణయించింది. ఈ మేరకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను సిద్ధం చేసింది. త్వరలో డీపీఆర్‌ను ముఖ్యమంత్రికి అందజేసే అవకాశం ఉంది. దానిపై తుది నిర్ణయం తీసుకున్నాక నిర్మాణానికి అవసరమైన రుణం తీసుకుంటారు. ఈ గోదాముల నిర్మాణానికి సుమారు రూ.2,500 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు తెలిపారు.

ప్రస్తుత సామర్థ్యం 24.75 లక్షల మెట్రిక్‌ టన్నులు... 
పంటలకు గిట్టుబాటు ధర వచ్చేదాకా రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులు, ధాన్యం నిల్వ చేసుకోవడానికి వీలుగా ప్రభుత్వం పెద్ద ఎత్తున గోదాముల నిర్మాణం చేపట్టింది. తెలంగాణ వచ్చే నాటికి కేవలం 4.17 లక్షల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములుంటే, ఆ తర్వాత వాటి సామర్థ్యాన్ని 24.75 లక్షల మెట్రిక్‌ టన్నులకు విస్తరించింది. ప్రస్తుతం 1,250 గోదాములు ఉన్నాయి. అయితే సాగునీటి ప్రాజెక్టులు పూర్తవుతుండటం, ప్రధానంగా కాళేశ్వరం జలాలు పంట పొలాలకు చేరుతుండటంతో రాష్ట్రంలో వరిసాగు విపరీతంగా పెరుగుతోంది. ఇతర పంటలూ గణనీయంగా సాగవుతున్నాయి. మంచి వర్షాలు కురవడంతో గత ఖరీఫ్‌లో సాధారణానికి మించి సాగైంది. మున్ముందు పంటల దిగుబడి మరింత పెరగనుంది. ఈ పరిస్థితుల్లో పెద్ద ఎత్తున పండుతున్న వ్యవసాయ ఉత్పత్తులను సేకరించడం, నిల్వ చేయడం, వాటిని అమ్మడం క్లిష్టంగా మారింది. అంతా సజావుగా సాగాలంటే గోదాముల్లో నిల్వ సామర్థ్యం పెరగాల్సిందేనని ఇప్పటికే సీఎం స్పష్టం చేశారు.

సామర్థ్యం సరిపోక పోవడంతో... 
ప్రస్తుతం ప్రభుత్వం గ్రామాల్లోనే కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం సహా ఇతర వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తోంది. అయితే అంత మొత్తంలో ధాన్యాన్ని నిల్వ చేసే సామర్థ్యం లేకపోవడంతో పాఠశాలలు, ఫంక్షన్‌ హాళ్లను వినియోగించుకోవాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే రానున్న కాలంలో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉంటుందని సర్కారు భావించింది. అందుకే గోదాముల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. సాగు పెరిగితే ఎరువులు, విత్తనాలు కూడా పెద్ద మొత్తంలో అవసరం అవుతాయి. వీటి నిల్వకు కూడా గోదాముల కొరత వేధిస్తోంది.

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (ప్యాక్స్‌)లో తగినంత గోదాముల సామర్థ్యం లేదు. దీంతో విత్తనాలు, ఎరువులు కూడా నిల్వ చేసుకునేలా గోదాముల నిర్మాణం చేపట్టనున్నారు. ఇదిలా ఉండగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు ప్రైవేటు గోదాముల్లో నిల్వచేసి, అవి నిండిన తరువాతే ప్రభుత్వ గోదాములను నింపేవారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ గోదాములు నిండిన తర్వాతనే ధాన్యాన్ని ప్రైవేటు గోదాముల్లో నింపుతున్నారు. దీంతో ప్రస్తుతం ప్రభుత్వ గోదాములు నూటికి నూరు శాతం నిండిపోతున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top