కాళేశ్వరం ప్రాజెక్టు పనులకు అడుగడుగునా అడ్డంకులు

Kaleshwaram Project Works Delay Due To rains - Sakshi

పలు చోట్ల వర్షాలకు నీటమునిగిన నిర్మాణ ప్రాంతాలు

మేడిగడ్డకు పరీక్ష పెడుతున్న ప్రాణహిత వరద

ఎల్లంపల్లి దిగువన ప్యాకేజీ–7లో కుంగుతున్న సొరంగాలు

గ్రావిటీ కెనాల్‌లోకి నీరు చేరడంతో లైనింగ్‌ పనులకు విఘాతం

కాళేశ్వరం పనుల ప్రాంతంలో ‘సాక్షి’ క్షేత్ర స్థాయి పరిశీలన

సాక్షి, హైదరాబాద్‌: కాలంతో పరుగులు పెడుతూ రూపుదిద్దుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు అదే స్థాయిలో అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఓవైపు వర్షాలు, వరదలు... మరోవైపు కూలుతున్న సొరంగాలు... వీటికితోడు లారీల సమ్మె నిర్మాణ పనులకు సవాళ్లు విసురుతున్నాయి. మేడిగడ్డ బ్యారేజీ ప్రాం తంలో మూడు లక్షల క్యూసెక్కులకుపైగా వస్తున్న ప్రాణహిత వరద, ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరుకు నీటిని తరలించే టన్నెళ్లు కూలుతుండటం, మేడిగడ్డకు అవసరమైన కంకరను 150 కి.మీ. దూరం నుంచి సరఫరా చేయాల్సి రావడం, లారీల సమ్మె నేపథ్యంలో సిమెంట్‌ లారీలను పోలీసు రక్షణ మధ్య తరలిస్తుండటం ప్రాజెక్టుకు పరీక్షలు పెడుతున్నాయి. అయినప్పటికీ అడ్డంకులు దాటుకొని ఆగస్టు నాటికి పంపుల డ్రై రన్‌ పూర్తి చేసి సెప్టెంబర్‌ నుంచి నీటిని ఎత్తిపోసేలా ఇంజనీర్లు పనులు కొనసాగిస్తున్నారు. 

పెద్దవాగుదీ పెద్ద కథే... 
మేడిగడ్డ పంప్‌హౌస్‌ నుంచి 13.2 కి.మీ. గ్రావిటీ కెనాల్‌ ద్వారా అన్నారం బ్యారేజీలకి నీటిని తరలించాల్సి ఉండగా అక్కడ సవాలక్ష సమస్యలు ఎదురవుతున్నాయి. 224 మీటర్ల వెడల్పుతో 3 టీఎంసీల నీటిని తరలించే సామర్థ్యంగల కెనాల్‌లో 1.80 కోట్ల క్యూబిక్‌ మీటర్ల మట్టిపని చేయాల్సి ఉండగా అందులో 90 శాతం పూర్తయింది. ఇక అండర్‌ టన్నెల్, సూపర్‌ పాసేజ్, పైప్‌ బ్రిడ్జి, ఇన్‌లెట్‌ అన్ని కలిపి 29 నిర్మాణాలు (స్ట్రక్చర్లు) నిర్మించాల్సి ఉండగా 12 నిర్మాణాలు పూర్తయ్యాయి. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు కెనాల్‌లో నీరు చేరడంతో లైనింగ్‌ పనులు నిలిచిపోయాయి. ఇతర నిర్మాణ ప్రాంతాల్లో దారంతా చిత్తడిగా మారడంతో వాహనాల రాకపోకలకు అవరోధం ఏర్పడుతోంది. ఇదే కెనాల్‌ పరిధిలోని చివరి అండర్‌ టన్నెల్‌ నిర్మాణంలో పెద్దవాగు పెద్ద సమస్యగా మారింది. సుమారు 18 వేల క్యూసెక్కుల మేర ప్రవాహం ఉండే పెద్దవాగు అన్నారం బ్యారేజీ నీటి నిల్వ ప్రాంతంలో గోదావరిలో కలుస్తుంది.

ఒకవేళ బ్యారేజీలో 11 టీఎంసీల గోదావరి నీటిని నిల్వ చేశాక పెద్దవాగు సైతం వచ్చి గోదావరిలో కలిస్తే పక్కనే ఉన్న దామరకుంట, గుండురాజుపల్లి, దుబ్బపల్లి, లక్ష్మీపూర్‌ గ్రామాలు పూర్తిగా మునగనున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని పెద్దవాగును అండర్‌ టన్నెల్‌ ద్వారా దారి మళ్లించి 4.1 కి.మీ. మేర అన్నారం బ్యారేజీ ఆవలకు తరలిస్తున్నారు. పెద్దవాగును దారి మళ్లించే 193.7 మీటర్ల వెడల్పైన అండర్‌ టన్నెల్‌ పైనుంచి గ్రావిటీ కెనాల్‌ ద్వారా నీటిని అన్నారం బ్యారేజీకి తరలిస్తున్నారు. అండర్‌ టన్నెల్‌ పనులకు 37 వేల క్యూబిక్‌ మీటర్ల పని చేయాల్సి ఉండగా ఇప్పటికే 22 వేల క్యూబిక్‌ మీటర్ల పని పూర్తయింది. ఇక్కడ రోజుకు 350 మంది కార్మికులు పనిచేస్తుండగా వచ్చే నెలలో ఈ పని పూర్తి చేస్తామని సీఈ నల్లా వెంకటేశ్వర్లు తెలిపారు. 

9 మీటర్ల సొరంగం పనికి ఎన్నో తిప్పలు... 
ఎల్లంపల్లి దిగువన పనులను మూడు ప్యాకేజీలు (6, 7, 8)గా విభజించి చేపడుతున్నారు. ప్యాకేజీ–6లో 124.4 మెగావాట్ల సామర్థ్యంగల 7 మోటార్లను సిద్ధం చేయాల్సి ఉండగా ఇప్పటికే రెండు సిద్ధమయ్యాయి. కానీ ప్యాకేజీ–7లోని సొరంగ పనులకు అనేక అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఇక్కడ 11.24 కి.మీ. మేర జంట సొరంగాలను నిర్మించాల్సి ఉండగా ఇందులో ఇప్పటికే ఐదు చోట్ల కుంగిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. టన్నెల్‌ ప్రాంతానికి ఎగువన ఎస్సారెస్పీ కాల్వలు, వాగులు పారుతుండటంతో మట్టి కూలుతోంది. దీనికితోడు పైనుంచి భారీగా నీరు టన్నెల్లోకి కారుతోంది. దీంతో 2,400 హెచ్‌పీ మోటార్లను పెట్టి సొరంగం నుంచి నీటిని తరలించాల్సి వస్తోంది. ఇప్పటివరకు తోడిన నీటి పరిమాణమే సుమారు టీఎంసీ వరకు ఉంటుందని, ఈ నీటితో మేడారం రిజర్వాయర్‌ను నింపొచ్చని నీటిపారుదల వర్గాలు తెలిపాయి. అయితే నిపుణుల సాయంతో నాలుగు చోట్ల ఈ సమస్యను అధిగమించగా, ఎడమవైపు సొరంగంలో ఇంకా సమస్య అలాగే ఉంది.

ఇక్కడ 13 మీటర్ల మేర మట్టి కూలుతుండటంతో విక్రంసింగ్‌ చౌహాన్‌ అనే నిపుణుడి సాయం తీసుకున్నారు. దీనికోసం వదులుగా ఉన్న రాతి పొరల్లోకి ప్రత్యేక యంత్రాల ద్వారా సిమెంట్‌ను పంపించి అవి కూలకుండా గట్టిపరుస్తున్నారు. అనంతరం కార్మికుల ద్వారా రోజుకు అర మీటర్‌ చొప్పున తవ్వకాలు చేపడుతున్నారు. ఇప్పటివరకు 4 మీటర్ల తవ్వకం పూర్తవగా మరో 9 మీటర్లు పూర్తి కావాల్సి ఉంది. అయితే సొరంగంలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు నమోదవుతుండటం, తగినంత ఆక్సిజన్‌ లేకపోవడం, సీపేజీ ఎక్కువగా ఉండటంతో ఈ పని పూర్తి చేయడం కత్తిమీద సాములా మారింది. దీంతో టన్నెల్‌కు రెండు వైపుల నుంచి పనిచేయిస్తున్నారు. దీనికితోడు సొరంగంలో లైనింగ్‌ పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరుకు నీటి తరలింపునకు ఇదే ముఖ్యం కావడంతో ఆ పని పూర్తికి ఇతర ప్యాకేజీల పనులు చేస్తున్న కాంట్రాక్టర్ల సేవలను వినియోగిస్తున్నారు. ఎడమవైపు సొరంగంలో పని జరిగినంత వరకు లైనింగ్‌ పూర్తిచేసి అక్కడి నుంచి కుడి సొరంగంలోకి నీటిని మళ్లించడం, దీనికి తగ్గట్లుగా కుడి సొరంగ మార్గంలో లైనింగ్‌ పూర్తి చేస్తే ఒక టీఎంసీ నీటిని అయినా మళ్లించే అవకాశాలపై దృష్టి పెట్టారు. 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top