సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ సుభాష్‌రెడ్డి ప్రమాణం | Sakshi
Sakshi News home page

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ సుభాష్‌రెడ్డి ప్రమాణం

Published Sat, Nov 3 2018 2:29 AM

Justice Subhash Reddy sworn as Supreme Court Judge - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ రామయ్యగారి సుభాష్‌రెడ్డి శుక్రవారం ప్రమాణం చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. జస్టిస్‌ సుభాష్‌రెడ్డితోపాటు జస్టిస్‌ హేమంత్‌ గుప్తా, జస్టిస్‌ ఎంఆర్‌.షా, జస్టిస్‌ అజయ్‌ రస్తోగీలు కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణం చేశారు. సుప్రీంకోర్టులో జరిగిన ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, వారి కుటుంబసభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు.

అనంతరం జస్టిస్‌ సుభాష్‌రెడ్డి సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ మదన్‌ బి.లోకూర్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనంలో కేసులను విచారించారు. గుజరాత్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న జస్టిస్‌ సుభాష్‌రెడ్డిని తెలంగాణ రాష్ట్ర కోటా నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమిస్తూ రాష్ట్రపతి గురువారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నలుగురు న్యాయమూర్తుల నియామకంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 28కి పెరిగింది. సుప్రీంకోర్టు మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 31 కాగా, ఈ నెల 29న సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ కురియన్‌ జోసెఫ్, అలాగే డిసెంబర్‌ 30న జస్టిస్‌ మదన్‌ బి.లోకూర్‌లు పదవీ విరమణ చేయనున్నారు. 

Advertisement
Advertisement