జూడాల నిరసన.. రోగుల యాతన

Junior Doctors Strike in Gandhi Hospital - Sakshi

వైద్యుల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌  

‘గాంధీ’లో నిలిచిపోయిన సాధారణ వైద్య సేవలు

తీవ్ర ఇబ్బందులకు గురైన రోగులు

గాంధీఆస్పత్రి: వైద్యుల పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్‌ చేస్తు గాంధీ ఆస్పత్రి జూనియర్‌ డాక్టర్లు (జూడాలు) బుధవారం సాధారణ విధులు బహిష్కరించి సమ్మెకు దిగారు. జూడాల సమ్మెతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. బుధవారం ఉదయం విధులు బహిష్కరించిన జూడాలు ఆస్పత్రి ప్రాంగణంలో బైఠాయించారు. ధర్నా, ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా జూడాల సంఘం గాంధీ యూనిట్‌ అధ్యక్షుడు లోహిత్, కార్యదర్శి అర్జున్‌ మాట్లాడుతూ.. న్యాయమైన తమ డిమాండ్‌ను పరిష్కరించాలని కోరారు. ఉద్యోగ విరమణ వయసు పెంపునకు తాము వ్యతిరేకం కాదని, ముందుగా వైద్యుల పోస్టుల భర్తీ చేసిన తర్వాతే దీనిపై ప్రకటన చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. చర్చల ద్వారా సమస్యను సానుకూలంగా పరిష్కరించుకునే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. తమ డిమాండ్‌ పరిష్కరించకుంటే నిరసన కార్యక్రమాలు మరింత ఉద్ధృతం చేస్తామన్నారు. సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. సాధారణ విధులను మాత్రమే బహిష్కరించామని, అత్యవసర సేవలకు హాజరవుతున్నామన్నారు. 

సీఏఎస్‌ అమలు చేయాలి: టీజీజీడీఏ  
కెరీర్‌ అడ్వాన్స్‌మెంట్‌ స్కీంను తక్షణమే అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం గాంధీ యూనిట్‌ వైద్యులు డిమాండ్‌ చేశారు. బుధవారం ఉదయం గంట సమయం పాటు విధులను బహిష్కరించి నిరసన చేపట్టారు. ముందుగా సీఏఎస్‌ అమలు చేసిన తర్వాతే పదవీ విరమణ వయసు పెంపుపై నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు. జూడాల సమ్మెకు మద్దతు ప్రకటించారు.  

శస్త్ర చికిత్సలు వాయిదా...
జూడాల సమ్మె నేపథ్యంలో గాంధీ ఆస్పత్రిలో 70 శాతం శస్త్రచికిత్సలు వాయిదా పడ్డాయి.  దీంతో రోగులు తీవ్ర ఇబ్బందదులకు గురయ్యారు. తెలంగాణ జిల్లాలతోపాటు నగరం నలుమూలల నుంచి వైద్యసేవల కోసం ఓపీ విభాగానికి వచ్చిన రోగులు గంటల తరబడి నిరీక్షించారు. జూడాల సమ్మె నేపథ్యంలో రోగులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా  ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శ్రవణ్‌కుమార్‌ తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top