‘బాల ఆరోగ్య రక్ష’కు అనారోగ్యం..! | Jawahar Bala Arogya Raksha scheme for Children Health | Sakshi
Sakshi News home page

‘బాల ఆరోగ్య రక్ష’కు అనారోగ్యం..!

Jun 18 2014 2:07 AM | Updated on Oct 9 2018 7:52 PM

‘బాల ఆరోగ్య రక్ష’కు అనారోగ్యం..! - Sakshi

‘బాల ఆరోగ్య రక్ష’కు అనారోగ్యం..!

బాల్యానికి భరోసా.. బాలల ఆరోగ్యాకి రక్షా అంటూ ఆర్భాటంగా ప్రారంభించిన జవహర్ బాల ఆరోగ్య రక్ష పథకం అటకెక్కింది. కాగితాలకే పరిమిత మైంది.

కెరమెరి : బాల్యానికి భరోసా.. బాలల ఆరోగ్యాకి రక్షా అంటూ ఆర్భాటంగా ప్రారంభించిన జవహర్ బాల ఆరోగ్య రక్ష పథకం అటకెక్కింది. కాగితాలకే పరిమిత మైంది. పిల్లలకు మంచి చేస్తుందని అందరూ భావించి సంతోషించినా ఆచరణలో మందగించింది. దీంతో ఈ పథకం 50శాతం కూడా లక్ష్యాన్ని సాధించలేదు. హడావుడిగా ఆరోగ్య కార్డులు అందజేసిన అధికారులు ఇప్పుడు వాటి గురించి పట్టించుకోవడం లేదు. పథకం అమలుకు కమిటీలు వేశామని, నెలనెలా వైద్య పరీక్షలు, విద్యార్థుల ప్రగతి వివరాల నమోదు చేస్తామని చెప్పినా అదంతా కేవలం ప్రకటనలకే పరిమితమైంది.
 
పథకం ప్రారంభం ఇలా..
2010 నవంబర్ 14న ఈ పథకం ప్రారంభమైంది. 1 నుంచి 10వ తరగతి పరకు పాఠశాలలో చదువుతున్న పిల్లలు పలు అనారోగ్య కారణాలతో హాజరు కావడం లేదని గుర్తించారు. దీన్ని నివారించడానికి పిల్లలందరికీ వైద్య పరీక్షలు చేసి ఉచితంగా అవసరమైన మందులు, చికిత్సలు అందించాలనేది పథకం ఉద్దేశం.
 
అమల్లో భాగంగా 1 నుంచి 10 తరగతి వరకు అందరికీ ఆరోగ్య రక్షా కార్డులు పంపిణీ చేశారు. కార్డుల్లో చిన్నారుల ఆరోగ్యం వివరాలు పూర్తిగా నమోదు చేయాల్సి ఉంది. కార్డుల పంపిణీ తర్వాత వాటి ఊసే లేదు. మొదట్లో వైద్యులతో కొన్ని చోట్ల మొక్కుబడిగా వైద్య పరీక్షలు చేయించారు. తర్వాత తమ పనైపోయిందని చేతులు దులిపేసుకున్నారు. పథకం నిర్వహణ కోసం వేసిన కమిటీలు పత్తా లేకుండా పోయాయి. చాలాచోట్ల విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించలేదు.
 
కుప్పలుగా ఆరోగ్య రక్ష పుస్తకాలు..
జవహర్ బాల ఆరోగ్య రక్ష పేరుతో అధికారులు  కరదీపికలను ముద్రించారు. వీటిలో విద్యార్థులకు ఎలా పరీక్షలు నిర్వహించాలి, పలు సూచనలు, సలహాల సమాచారం ఉంది. ప్రస్తుతం అనేక పాఠశాలల్లో, ఎమ్మార్సీల్లో కుప్పలుగా పడి ఉన్నాయి. ప్రతి నెలా పరీక్షలు చేయాల్సి ఉన్నప్పటికీ గత విద్యాసంవత్సరంలో ఆరోగ్యశాఖాధికారులు పట్టించుకోలేదు. పథకం ఆరంభంలో కొన్ని పాఠశాలలో ఈ పథకం పని చేయగా తర్వాత కనుమరుగైంది.  
 
 ఇలా చేయాలి..!
* మండల స్థాయిలో ఎంపీడీవో చైర్మన్‌గా , ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి, ఎంఈవోలు సభ్యులుగా ఉంటారు.
* కమిటీ సభ్యులు పాఠశాలను సందర్శించి విద్యార్థులకు వారి సమక్షంలో పరీక్షలు జరిగేలా చూడాలి. వారి ఆరోగ్య సమాచారాన్ని మొత్తాన్ని ఆ కార్డులో నమోదయ్యేలా పర్యవేక్షించాలి.
* ప్రతి మంగళవారం పాఠశాల ఆరోగ్య రోజుగా పాటించేలా చూడాలి. ప్రత్యేక చికిత్స అవసరమైన వారిని ప్రభుత్వ ఆస్పత్రికి రెఫర్ చేసేలా చర్యలు తీసుకోవాలి.
* ప్రతి విద్యార్థికి వైద్య పరీక్షలు జరిగేలా చూసే బాధ్యత తరగతి ఉపాధ్యాయుడితోపాటు ప్రధానోపాధ్యాయుడికి కూడా ఉంది. అలా జరుగుతుందో లేదో కమిటీ పర్యవేక్షించాలి.
* పాఠశాల ఆరోగ్య పరీక్షలు జరిగేటప్పుడు తల్లితండ్రులను కూడా పిలిచి వారితో సదరు విద్యార్థి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకుని నమోదు చేశారో లేదో చూడాలి.
* విద్యార్థుల తరగతి పరీక్షల్లో సాధించిన మార్కులు, గ్రేడుల వివరాలు రికార్డుల్లో నమోదు అయ్యాయో లేదో పర్యవేక్షించాల్సి ఉంది.
* అలాంటి దాఖలాలు అనేక ప్రభుత్వ పాఠశాల్లో కనిపించడం లేదు. ఆరోగ్య శాఖ, విద్యా శాఖ మధ్య సరైన సమన్వయం లేకపోవడంతోనే పిల్లలకు వైద్య పరీక్షలు అందడం లేదని పలువురు పెదవి విరుస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement