కాలేజీల షిఫ్టింగ్‌లపై సీరియస్‌

Jagadish Reddy Serious on college shiftings - Sakshi

సరైన కారణం ఉంటే తప్ప చేయవద్దని ఆదేశాలు

సమీక్ష సమావేశంలో విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని జూనియర్, డిగ్రీ కాలేజీలను ఇష్టారాజ్యంగా ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు చేస్తున్న షిప్టింగ్‌ల వ్యవహారంపై మంత్రి జగదీశ్‌రెడ్డి సీరియస్‌ అయ్యారు. ఇష్టారాజ్యంగా కాలేజీలను మండల పరిధి, జిల్లా పరిధి కాకుండా ఇతర జిల్లాలకు మార్చుతు న్నట్లు వస్తున్న ఫిర్యాదులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. సహేతుక కారణం లేకుండా ఎట్టి పరిస్థితుల్లో కాలేజీల షిఫ్టింగ్‌కు అనుమతించవద్దని స్పష్టంచేశారు. మరోవైపు ప్రభుత్వ విద్య బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపైనా అధికారులతో సమీక్షించారు. కొత్త విద్యా సంవత్సరం సమీపిస్తున్న నేపథ్యంలో విభాగాల వారీగా లక్ష్యాలను నిర్ధేశించుకొని పనిచేయాలని సూచించారు. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర అభిప్రాయాన్ని కోరిన దృష్ట్యా దానిపై అధికారులతో చర్చించారు.

రాష్ట్రంలోని వర్సిటీలు, డిగ్రీ కాలేజీల్లోనే దీనిని ప్రవేశ పెట్టేందుకు అనుమతించాలని నిర్ణయించిందన్నారు. నాలుగేళ్లు ఈ డిగ్రీని చదవడం, అందులో తొలి ఏడాది నుంచే విద్యా బోధనకు సంబంధించిన పాఠ్యాంశాలు ఉండటం ద్వారా మెరుగైన విద్య లభిస్తుందన్న భావనను వ్యక్తం చేశారు. ప్రమాణాలు పెరుగుతాయని, ప్రమాణాలు పాటించని కాలేజీలకు అడ్డుకట్ట పడుతుందని పేర్కొన్నారు. ఇంటిగ్రేటెడ్‌ బీఎడ్‌ కోర్సుపై సీఎం కేసీఆర్‌తో చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. ఇంటర్‌ ఫలితాల వెల్లడిపైనా సమీక్షించినట్లు తెలిసింది. ప్రవేశాలు, ఫలితాల ఆలస్యంపైనా సీరియస్‌ అయినట్లు సమాచారం. సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, కళాశాల విద్యా కమిషనర్‌ నవీన్‌ మిట్టల్, ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌ పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top