మాట్లాడింది బాబే!

మాట్లాడింది బాబే! - Sakshi


- ట్యాపింగ్‌కు అవకాశమే లేదు

- ‘ఓటుకు నోటు’ కేసులో నిర్ధారించిన ఇంటెలిజెన్స్ బ్యూరో

- ఈ వ్యవహారంపై కేంద్రానికి అరడజను నివేదికలు

- జూబ్లీహిల్స్‌లోని బాబు నివాసం నుంచే స్టీఫెన్‌సన్‌కు ఫోన్

- సెల్‌టవర్ లొకేషన్ వివరాలతో సహా వెల్లడి

- ఎమ్మెల్యేల కొనుగోలుకు భారీగా బేరసారాలు

- స్వయంగా ఓ కేంద్ర మంత్రి పర్యవేక్షణపైనా నివేదిక

 

సాక్షి, హైదరాబాద్:
‘ఓటుకు నోటు’ వ్యవహారంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో ఫోన్‌లో మాట్లాడింది ఏపీ సీఎం చంద్రబాబునాయుడేనని కేంద్ర నిఘా సంస్థ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) స్పష్టం చేసింది. చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్ మంత్రులు, టీడీపీ నేతలు ఆరోపిస్తున్నట్లుగా ఫోన్ ట్యాపింగ్ జరగలేదని.. ట్యాపింగ్ జరిగి ఉండే అవకాశం ఏమాత్రం లేదని నిర్ధారించింది. ఇందుకు తగిన ఆధారాలతో కూడిన అరడజను నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి ఐబీ అందజేసింది.ఈ వ్యవహారంలో ఎమ్మెల్యేల బేరసారాల దగ్గరి నుంచి ఓ కేంద్రమంత్రి భాగస్వామ్యం దాకా అన్ని వివరాలనూ ఆ నివేదికల్లో పొందుపరచింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటేయాలంటూ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో రూ. 5 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుని రూ.50 లక్షలు అడ్వాన్స్‌గా ఇస్తూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన విషయం విదితమే. ఈ వ్యవహారంలో స్టీఫెన్‌సన్‌కు రేవంత్ రూ.50 లక్షలు ఇవ్వజూపుతున్న దృశ్యాల వీడియోలతో పాటు స్టీఫెన్‌సన్‌తో ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడిన ఆడియో రికార్డులు బహిర్గతమయ్యాయి.దీంతో ఆత్మరక్షణలో పడిన చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్ మంత్రులు, టీడీపీ నేతలు.. తమ ఫోన్లను తెలంగాణ ప్రభుత్వం ట్యాప్ చేస్తోందంటూ అడ్డగోలు ఆరోపణలకు దిగారు. తమ ఫోన్లు ట్యాప్ చేస్తున్నారంటూ కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు కూడా చేశారు. దీంతో కేంద్ర హోంశాఖ ఈ వ్యవహారంపై నివేదిక ఇవ్వాల్సిందిగా ఇంటలిజెన్స్ బ్యూరో(ఐబీ)ను ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్‌కు అవకాశం ఉన్న దాదాపు అన్ని విభాగాల అధికారులను ఐబీ విచారించింది. బీఎస్‌ఎన్‌ఎల్‌తో పాటు ప్రైవేట్ ఆపరేటర్లను విచారించి.. తెలంగాణ రాష్ట్ర పోలీసులు ఎవరి ఫోన్లు ట్యాప్ చేయలేదని నిర్ధారించుకుంది.దీంతోపాటు ‘ఓటుకు నోటు’ కేసుకు సంబంధించి అన్ని అంశాలతో కేంద్ర ప్రభుత్వానికి దాదాపు అరడజను నివేదికలను ఐబీ అందజేసింది. ఫలానా ఫోన్ ట్యాపింగ్ కోసం లేదా ఫలానా ప్రాంతం నుంచి మాట్లాడే ఫోన్లు ట్యాప్ చేయడం కోసం ఎలాంటి సాంకేతిక సదుపాయాలు వినియోగించలేదని ఐబీ తన నివేదికలో స్పష్టం చేసింది. దీంతో తమ ఫోన్లు ట్యాప్ చేశారంటూ చంద్రబాబు, ఏపీ మంత్రులు, టీడీపీ నేతలు చేసిన ఆరోపణలన్నీ పూర్తిగా అవాస్తవాలని తేలిపోయింది.బాబు నివాసం నుంచే..

నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో ఫోన్‌లో మాట్లాడింది ఏపీ సీఎం చంద్రబాబేనని తమ నివేదికల్లో ఐబీ స్పష్టం చేసింది. ఆ సమయంలో హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచే చంద్రబాబు మాట్లాడారని సెల్‌టవర్ లొకేషన్ వివరాలతో సహా పేర్కొంది. ఎమ్మెల్యేలతో పెద్ద ఎత్తున బేరసారాలు జరిగాయని నివేదించింది. ఈ బేరసారాలకు ఎవరు పాల్పడ్డారు, వారు ఏ హోదాలో ఉన్నారనే వివరాలను రేవంత్ అరెస్టయిన రెండు రోజులకే కేంద్రానికి అందజేసిన నివేదికలో తెలియజేసింది. కేంద్ర మంత్రి ఒకరు ఈ వ్యవహారాన్ని దగ్గరుండి పర్యవేక్షించారని, కొందరు ఎమ్మెల్యేలతో నేరుగా మాట్లాడారని అందులో వివరించింది.ఈ కేసుకు సంబంధించి ఏసీబీ ఉన్నతాధికారులతో ఐబీ అధికారి ఒకరు ఇటీవల తరచూ సమావేశమై, కేసు పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు కూడా. ‘‘ఎప్పటికప్పుడు మేం కేంద్రానికి నివేదికలు ఇస్తుంటాం. ఇదేం కొత్త కాదు.. ఏ ముఖ్యమైన ఘటన జరిగినా పూర్వాపరాలు తెలుసుకుంటాం. ముఖ్యంగా రాష్ట్ర పోలీసులపైనే ఆధారపడుతాం. కానీ ఈ కేసులో ఓ ముఖ్యమంత్రి పాత్ర ఉండటంతో ప్రతి దానినీ లోతుగా పరిశీలిస్తున్నాం..’’ ఓ సీనియర్ అధికారి సాక్షి ప్రతినిధికి చెప్పారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top