తన్నుకున్న తెలుగు తమ్ముళ్లు

Internal Clashes Between TDP Leaders In Nalgonda - Sakshi

రసాభాసగా టీడీపీ పార్లమెంట్‌ స్థాయి సమావేశం

చావ కిరణ్మయి, మండవ వెంకటేశ్వర్లు వర్గీయుల కుమ్ములాటతో విరిగిన కుర్చీలు

సాక్షి, నల్లగొండ: తెలుగు తమ్ముళ్లు తన్నులాడుకున్నారు. జిల్లాకేంద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం టీడీపీ నల్లగొండ పార్లమెంట్‌ స్థాయి సమావేశం జరిగింది.  హుజూర్‌నగర్‌కు చెందిన టీడీపీ నేత చావ కిరణ్మయి వర్గం, వ్యతిరేక వర్గం వారు కుర్చీలు విసురుకున్నారు. కిరణ్మయి భర్త సహదేవరావుపై చేయిచేసుకున్నారు.    టీడీపీ నల్లగొండ పార్లమెంట్‌ స్థాయి సమావేశం రసాభాసగా మారిం ది. వర్గాలుగా విడిపోయిన తెలుగు తమ్ముళ్లు పరస్పరం దాడులు చేసుకోవడంతో కుర్చీలు విరిగిపోయాయి. వివరాలు.. పార్టీ పార్లమెంట్‌ స్థాయి సమావేశాన్ని రాష్ట్ర ఉపాధ్యక్షుడు సామ భూపాల్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహిం చారు. పార్టీని బూత్‌ కమిటీల నుంచి బలోపేతం చేసి పూర్వ వైభవం తేవాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో హుజూర్‌నగర్‌ నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత చావ కిరణ్మయి వేదిక మీద కూర్చోవడంతో సోమగాని నరేందర్‌గౌడ్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు.

దాడి చేసుకుంటున్న టీడీపీ కార్యకర్తలు

ఇటీవలనే బీజేపీలో చేరుతున్నట్లుగా, ఆ పార్టీ నాయకులను కలిసినట్లుగా పత్రికల్లో వార్తలొచ్చాయని, వెంటనే పార్టీ నుంచి కిరణ్మయిని సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. దీంతో కిరణ్మయి భర్త సహదేవరావు నీకేం హక్కు ఉంది..? నీకు పార్టీలో ఏం పదవి ఉంది...? అంటూ ఆగ్రహంతో నరేందర్‌ గౌడ్‌పై దూసుకొచ్చాడు. నియోజకవర్గంలో ఎవరికీ తెలియకుండా కమిటీలు వేస్తున్నాడని, మండవ నర్సయ్య, ఆయన కుమారుడు వెంకటేశ్వర్లుతో పాటు మరికొందరు సహదేవరావుపై చేయిచేసుకున్నారు.

ఘర్షణ పడుతున్న వారిని సముదాయిస్తున్న నాయకులు 

ఇద్దరి మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. దీంతో పార్టీ కార్యాలయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.  టీడీపీలోనే ఉంటూ బీజేపీ నాయకులతో కలిసి వచ్చిన వార్తలు పత్రికల్లో ప్రచురితమయ్యాయని, వెంకటేశ్వర్లు, నరేందర్‌ బయటపెట్టారు. ఇరువర్గాలను పార్టీ పార్లమెంట్‌ ఇన్‌చార్జి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సామభూపాల్‌రెడ్డి సముదాయించారు.

ప్రజా సంక్షేమంపై ముఖ్యమంత్రికి శ్రద్ధలేదు
ఇతర పార్టీల వారిని టీఆర్‌ఎస్‌లో చేర్చుకోవడం తప్ప సీఎం కేసీఆర్‌కు ప్రజా సంక్షేమంపై శ్రద్ధ లేదని టీడీపీ రాష్ట్ర పరిశీలకులు సామ భూపాల్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం పార్టీ పార్లమెంట్‌ స్థాయి సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ ఓవర్‌ లోడ్‌తో సతమతమవుతుందని, త్వరలోనే కేసీఆర్‌కి సొంత పార్టీ నాయకులే తగిన గుణపాఠం చెప్తారన్నారు. ఎంతో మంది విద్యార్థుల ప్రాణత్యాగం, పోరాటం ఫలితంగా వచ్చిన స్వరాష్ట్రంలో ఉద్యోగాలు లేక నిరుద్యోగులు దినసరి కూలీలుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డబుల్‌బెడ్‌రూం ఇళ్లు, మూడెకరాల భూమి, ప్రతి ఇంటికీ తాగునీరు పూర్తి చేయలేదన్నారు. మోడల్‌గా పథకాలను చూపించి రాష్ట్రం మొత్తం బంగారు తెలంగా ణగా అవుతుందని గ్లోబల్‌ ప్రచారం చేసుకుంటున్నారని ఆయన విమర్శించారు. వచ్చే ఎన్నికలనాటికి పార్టీని బలోపేతం చేసేందుకు కార్యకర్తలు సమష్టిగా కృషిచేయాలన్నారు. ప్రతి శనివారం పార్టీ అధినేత చంద్రబాబు హైదరాబాద్‌లో అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ సమావేశంలో మోపతయ్య, బంటు వెంకటేశ్వర్లు, కాశీనాథ్, నెల్లూరు దుర్గా ప్రసాద్, నాతాల రాంరెడ్డి, ఎల్వీ యాదవ్, తుమ్మల మధుసూదన్‌రెడ్డి, ఆకునూరి సత్యనారాయణ, జానకిరాములు, ప్రభాకర్, కృష్ణయ్య, శ్రీనివాస్‌రెడ్డి, రియాజ్‌అలీ, గుండు వెంకటేశ్వర్లు,  పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top