ఉచితంగా రూ.5 లక్షల బీమా | Sakshi
Sakshi News home page

ఉచితంగా రూ.5 లక్షల బీమా

Published Sat, Aug 29 2015 2:26 AM

ఉచితంగా రూ.5 లక్షల బీమా - Sakshi

{yైవర్లు, జర్నలిస్టులు, హోంగార్డులకు సౌకర్యం: నాయిని
ఈ నెల 22 నుంచే అందుబాటులోకి..

 
హైదరాబాద్: రూపాయి ఖర్చు లేకుండా రూ. 5 లక్షల వరకు ఆరోగ్య బీమా, ప్రమాద బీమా ప్రీమియం కల్పిస్తున్నట్లు హోం, కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి వెల్లడించారు. సామాజిక భద్రతలో భాగంగా డ్రైవర్లు, వర్కింగ్ జర్నలిస్టులు, హోంగార్డులు తదితరులు మొత్తం దాదాపు 10 లక్షల మందికి ఈ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ సదుపాయం ఈ నెల 22 నుంచే అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు. సచివాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కార్మిక దినోత్సవం ‘మేడే’ రోజున సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి ప్రీమియం లేకుండా ఉచితంగా ఆరోగ్య, ప్రమాద బీమా కల్పిస్తున్నట్లు తెలిపారు. దీనివల్ల డబ్బు ఖర్చు లేకుండా రూ. 5 లక్షల వరకు ఆరోగ్య చికిత్సలు చేయించుకోవచ్చన్నారు. ఏదైనా ప్రమాదంలో చనిపోతే ఆ కుటుంబం వీధిన పడకుండా ఉండేందుకు రూ. 5 లక్షలు అందజేయనున్నట్లు తెలిపారు. పథకం అమలుకు కార్మికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, మున్సిపల్‌శాఖ సెక్రటరీ, హోంగార్డ్స్ ఐజీ, సమాచార డెరైక్టర్‌తో చర్చించి నిర్ణయం తీసుకున్నామన్నారు.

ఈ పథకానికి నేషనల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని నాయిని తెలిపారు. ఈ పథకంపై త్వరలోనే సామాజిక భద్రత పేరుతో జిల్లాల వారీగా కలెక్టర్‌లతో సమావేశాలు నిర్వహిస్తామన్నారు. అదేవిధంగా హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో అన్ని కార్మిక సంఘాలతో సమావేశం నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో కార్మికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరిప్రీత్‌సింగ్, రవాణాశాఖ కమిషనర్ సందీప్ కుమార్ సుల్తానియా, హోంగార్డ్స్ ఐటీ బాలనాగదేవి, సమాచార పౌరసంబంధాల శాఖ డెరైక్టర్ సుభాష్ పాల్గొన్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement