
చెవులు మూసుకొని నిరసన వ్యక్తం చేస్తున్న భూబాధితులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: షాబాద్ మండలం చందనవెళ్లి పారిశ్రామికవాడ భూ పరిహారం పంపిణీలో జరిగిన అక్రమాలను కప్పిపుచ్చేందుకు రాజకీయ నేతలు యత్నిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధితులు రెండు రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాధితులు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి మధ్య రాజీ కుదిర్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయా.. పెద్దల డైరెక్షన్‌లోనే స్థానిక పోలీసులు మధ్యవర్తిత్వం నెరుపుతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. పోలీసుల తీరు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల వ్యవహారశైలి ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. పారిశ్రామికవాడ కోసం చేపట్టిన భూసేకరణలో రైతులకు పరిహారం పంపిణీలో దాదాపు రూ.2.6 కోట్ల మేర అక్రమాలు జరిగిన విషయం తెలిసిందే.
రాజకీయ పలుకుబడి, అధికారుల అండతో అనర్హులు పరిహారాన్ని అందిన కాడికి మెక్కేశారు. స్థానిక సర్పంచ్, ఆయన కుటుంబ సభ్యులు, తన సన్నిహితులే అక్రమంగా లబ్ధిపొందారని జిల్లా యంత్రాంగం ప్రాథమికంగా గుర్తించి 15 మంది జాబితా విడుదల చేసింది. అయితే, వీరు తమను బెదిరించి పరిహారం తీసుకుని అన్యాయం చేశారని ఐదుగురు బాధితులు ఈనెల 24న షాబాద్ పోలీసులను ఆశ్రయించారు. ఐదుగురి వ్యక్తుల పేర్లను పేర్కొంటూ సీఐ నర్సయ్యకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయితే, రెండు రోజులు గడుస్తున్నా ఇంతవరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శని, ఆదివారం సెలవులని, సోమవారం తప్పకుండా ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తామని పోలీసులు ఫిర్యాదు చేసిన రోజు బాధితులకు నచ్చజెప్పి ఇంటికి పంపించారు. ఇంకా కేసు నమోదు చేయకపోవడంపై వారి వ్యవహారశైలిపై పలు విమర్శలు వస్తున్నాయి.
నేతల అక్షింతలు
అక్రమంగా పరిహారం కొట్టేసిన వ్యవహారంలో రాజకీయ పెద్దల హస్తం ఉందని పేర్కొంటూ ‘పెద్దలే.. గద్దలై’ శీర్షికన ఈనెల 25న ‘సాక్షి’ ప్రచురించిన కథనం కలకలం రేపింది. దీంతో జిల్లాకు చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. షాబాద్ మండలంలో అధికార పార్టీ నేతలపై ఈమేరకు వారు సీరియస్ అయినట్లు వినికిడి. మీడియాలో విస్తృతంగా కథనాలు వస్తున్నా.. కనీసం ఖండించడం లేదని, ఫలితంగా పరిహారాన్ని నిజంగా నొక్కేశారనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్తున్నాయని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసి అక్షింతలు వేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే నాయకులంతా ఒక్కటై సోమవారం ప్రెస్‌మీట్ పెట్టి ఆరోపణలను ఖండించారు. తాము న్యాయబద్ధంగానే పరిహారం తీసుకున్నామని, ఇందుకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయన్నారు.
నేడు కలెక్టర్‌కు వివరణ..
పరిహారాన్ని అక్రమంగా నొక్కేశారని కలెక్టర్ లోకేశ్‌కుమార్ చేపట్టిన ప్రాథమిక విచారణలో తేలిన విషయం తెలిసిందే. ఎలాంటి అర్హత లేకున్నా మొత్తం 15 మంది రూ.2.6 కోట్లు కాజేశారని పేర్కొంటూ వారికి ఈనెల 23న నోటీసులు జారీ చేశారు. ఈనెల 27 లోపు దీనిపై వివరణ ఇవ్వాలని సూచించారు. లేదంటే రికవరీ యాక్ట్ అమలు చేసి సొమ్మును వెనక్కి తీసుకుంటామని హెచ్చరించారు. ఈక్రమంలో తమ వద్ద ఉన్న ఆధారాలతో మంగళవారం కలెక్టర్‌కు వివరణ ఇచ్చేందుకు 15 మంది సిద్ధమైనట్లు తెలిసింది. అనంతరం ఏం జరుగుతుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
రాజీ కోసం కబురు..
రాజకీయ నేతల డైరెక్షన్‌లో స్థానిక పోలీసులు రాజీ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఫిర్యాదు చేసిన బాధితులు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి షాబాద్ పోలీసులు సోమవారం ఫోన్ చేసి ఠాణాకు రావాలని చెప్పినట్లు తెలిసింది. మంగళవారం ఇరు పక్షాలు తమ వద్ద ఉన్న ఆధారాలతో హాజరుకావాలని సూచించినట్లు సమాచారం. ఆధారాలను బట్టి తదుపరి చర్యల కోసం ఆలోచిస్తామన్నారని వినికిడి.
చదవండి: రాజకీయ అండతో పెద్దలే.. గద్దలై!