మైనింగ్ మాయ! | illegal mining mafia | Sakshi
Sakshi News home page

మైనింగ్ మాయ!

Feb 12 2015 11:18 PM | Updated on Mar 28 2018 11:11 AM

మైనింగ్ మాయ! - Sakshi

మైనింగ్ మాయ!

అక్రమార్కుల కన్ను ప్రభుత్వ, అటవీ భూములపై పడింది...

కందుకూరు: అక్రమార్కుల కన్ను ప్రభుత్వ, అటవీ భూములపై పడింది. అనుమతులు తీసుకున్న చోట కాకుండా మరో ప్రాంతంలో తవ్వకాలు జరుపుతూ కోట్లాది రూపాయలను కొల్లగొడుతున్నారు. సంబంధిత అధికారులు మాత్రం ఫిర్యాదులు అందినప్పుడు హడావుడి చేస్తూ ఆ తర్వాత తమకేమీ పట్టనట్లుగా మిన్నకుండిపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
 
ఇష్టారీతీన తవ్వకాలు..
మండల పరిధిలో వివిధ గ్రామాల్లో క్వారీలు, క్రషర్లు, చెరువు శిఖాల్లో ఎర్రమట్టి, నల్లమట్టి తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. తిమ్మాపూర్, రాచులూరు, గుమ్మడవెల్లి, పులిమామిడి, లేమూరు, మీర్కాన్‌పేట, కందుకూరు తదితర గ్రామాల్లో మట్టి తవ్వకాలు ఇష్టారీతిన కొనసాగుతున్నాయి. ఆయా గ్రామాల్లో చాలా చోట్ల అనుమతులు ఒక దగ్గర తీసుకుని తవ్వకాలు మరో చోట నిర్వహిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. గురువారం లేమూరులో సర్వేనంబర్ 356లో 20 గుంటలకు అనుమతులు తీసుకుని కంకెల కుంట శిఖం భూమిలో తవ్వకాలు జరుపుతున్నారంటూ గ్రామస్తులు అక్కడికి చేరుకుని తవ్వకాలను నిలిపివేయించి ఆందోళన చేశారు.

చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు సైతం ఫిర్యాదు చేశారు. అటవీ భూముల్లో... మురళీనగర్ సమీపంలోని సర్వేనంబర్ 74, 75ల్లో 22.32 ఎకరాల భూమిపై క్వారీకి అనుమతులు తీసుకుని నాలుగేళ్లుగా తవ్వకాలు జరుపుతున్నారు. కాగా ఆ భూమికి ఆనుకుని చిప్పలపల్లి అటవీ భూమి సర్వే నంబర్185లో కూడా తవ్వకాలు జరుపుతున్నట్లు ఇటీవల మురళీనగర్, చిప్పలపల్లి గ్రామస్తులు పలువురు అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అనంతరం క్వారీకి వెళ్లే మార్గంమధ్యలో తవ్వి వాహనాల రాకపోకలను నిలువరించారు. నిత్యం అటవీ భూముల నుంచే టన్నులకొద్దీ విలువైన ఖనిజాన్ని తరలిస్తున్నారని, సర్వే చేయించి అటవీ భూములకు హద్దు రాళ్లను పాతాలని డిమాండ్ చేశారు.

కటికపల్లి వద్ద నిర్వహిస్తున్న క్రషర్‌తో చుట్టు పక్కల పంటలు పండించలేకపోతున్నామని దుమ్మూధూళీ దట్టంగా కమ్ముకుని ఇబ్బందికరంగా మారుతోందంటూ గ్రామస్తులు ఇటీవల ప్రజాదర్బార్‌లో ఫిర్యాదు చేశారు. అయినా ఎవరూ పట్టించుకున్న దాఖ లాలు లేకుండాపోయాయి. మరోవైపు బేగంపేట పరిధి లో కొనసాగుతున్న మరో క్రషర్ నిర్వాహకులు రెండు నెలల క్రితం అటవీ భూముల నుంచి రోడ్డు వేసుకుని రాకపోకలు సాగిస్తుండటంతో గ్రామస్తుల ఫిర్యాదుతో అటవీ అధికారులు లారీలకు చలానా విధించి రాకపోకలను నిలువరించారు.

వివిధ గ్రామాల్లో ఇటుక బట్టీలు యథచ్ఛగా కొనసాగుతున్నాయి. చెరువులు, కుంటల నుంచి మట్టిని అక్రమంగా తరలించి దందా నడుపుతున్నా మైనింగ్ అధికారులు కన్నెత్తి చూడటంలేదు. ఫిర్యాదు చేస్తే గానీ స్పందించడంలేదని, కొన్ని సందర్భాల్లో తూతూమంత్రంగా తనిఖీలు చేపట్టి మమ అనిపిస్తున్నారంటూ ప్రజలు ఆరోపిస్తున్నారు. అక్రమార్కులపై కొరడా ఝళిపించి అటవీ, ప్రభుత్వ భూములను పరిరక్షించాలని కోరుతున్నారు.
 
చర్యలు తీసుకుంటున్నాం
అక్రమంగా మైనింగ్ చేస్తున్నట్లు సమాచారం అందితే వెంటనే చర్యలు తీసుకుంటున్నాం. ఎవరినీ ఉపేక్షించడంలేదు. లేమూరులో కూడా ఫిర్యాదు అందగా తవ్వకాలను నిలిపివేయించాం. పరిశీలించిన తర్వాత అనుమతిస్తాం.
                  - సుశీల, తహసీల్దార్, కందుకూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement