పోర్టబుల్‌ వెంటిలేటర్‌  | IIT Hyderabad Developed Jeevanlight Emergency Ventilator | Sakshi
Sakshi News home page

పోర్టబుల్‌ వెంటిలేటర్‌ 

Apr 4 2020 1:39 AM | Updated on Apr 4 2020 7:54 AM

IIT Hyderabad Developed Jeevanlight Emergency Ventilator - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/సంగారెడ్డి టౌన్‌: కరోనా వైరస్‌ సోకిన వారికి చికిత్స అందించేందుకు అవసరమైన మాస్క్‌లు, వెంటిలేటర్ల తయారీకి సం బంధించిన నమూనాలపై అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. ఇటీవల తక్కువ ఖర్చుతో తయారయ్యే ‘బ్యాగ్‌ వాల్వ్‌ మాస్క్‌’ను డిజైన్‌ చేసిన ఐఐటీ హైదరాబాద్‌.. తాజాగా అత్యవసర సమయాల్లో ఉపయోగించే వెంటిలేటర్‌ను తయారు చేసింది. ఐఐటీ అనుబంధ సెంటర్‌ ఫర్‌ హెల్త్‌కేర్‌ ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ (సీఎఫ్‌హెచ్‌ఈ)కి చెందిన ఏరోబయోసిస్‌ ఇన్నోవేషన్స్‌ అనే స్టార్టప్‌ కంపెనీ ఈ వెంటిలేటర్‌ను రూపొందించింది. తక్కువ ఖర్చుతో తయారయ్యే ఈ ఎమర్జెన్సీ వెంటిలేటర్‌లో అనేక అత్యాధునిక ఫీచర్లు ఉన్నట్లు ఏరోబయోసిస్‌ చెబుతోంది. ‘జీవన్‌లైట్‌’గా పిలిచే ఈ వెంటిలేటర్‌.. ఇంట ర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ) ఆధారంగా పనిచేస్తుంది. దీంతో విద్యుత్‌ సౌకర్యం లేని మారుమూల ప్రాంతాల్లోనూ బ్యాటరీ ద్వారా వాడొచ్చు. 

వైద్యులు, కుటుంబ సభ్యులకు రక్షణ 
కరోనా వైరస్‌కు శరవేగంగా వ్యాపించే లక్షణం ఉండటంతో ఈ జీవన్‌లైట్‌ ఎమర్జెన్సీ వెంటిలేటర్‌ వెద్యులు, రోగుల కుటుంబ సభ్యులకు రక్షణ కల్పిస్తుంది. ఇది లక్ష రూపాయలకే అందుబాటులోకి వస్తుందని ఐఐటీ హైదరాబాద్‌ డైరెక్టర్‌ మూర్తి వెల్లడించారు. ప్రస్తుతం ఏరోబయోసిస్‌కు రోజుకు 50 నుంచి 70 యూనిట్లు తయారు చేసే సామర్థ్యం ఉందన్నారు. వెంటిలేటర్లను పెద్ద ఎత్తున తయారు చేసేందుకు పారిశ్రామిక సంస్థలు, ప్రభుత్వం ముందుకు రావాలని బయో మెడికల్‌ ఇంజనీరింగ్‌ విభాగం అధిపతి ప్రొఫెసర్‌ రేణు జాన్‌ కోరారు. కాగా, రోగి శ్వాస తీసుకునే తీరును రికార్డు చేసి, వైద్యుడికి యాప్‌ ద్వారా సమాచారం అందజేసే ఫీచర్‌తో పాటు, ఆక్సిజన్‌ సిలిండర్‌ను కూడా జత చేసి జీవన్‌లైట్‌ను రూపొందించారు. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ, డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ లైఫ్‌ సైన్సెస్, డీఆర్‌డీవో, ఐసీఎంఆర్‌ తదితర సంస్థల ప్రామాణికాలకు అనుగుణంగా దీన్ని తయారుచేసినట్లు ఏరో బయోసిస్‌ వెల్లడించింది. 

ఏకబిగిన 5 గంటలపాటు
హృద్రోగులు, టైప్‌–2 మధుమేహం ఉన్న వారు కరోనా వైరస్‌ బారిన పడితే శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇలాంటి వారికి అత్యవసర సమయాల్లో ఈ జీవన్‌ లైట్‌ రక్షణ కవచంలా పనిచేస్తుంది. కరోనా సోకిన వారికే కాకుండా ఇతర సందర్భాల్లో చిన్న పిల్లలు, వృద్ధులకు తలెత్తే శ్వాస సంబంధ సమస్యలకు కూడా ఈ ఎమర్జెన్సీ వెంటిలేటర్‌ను వాడొచ్చు. జీవన్‌లైట్‌లో ఉండే లిథియం అయాన్‌ బ్యాటరీని సెల్‌ఫోన్‌ తరహాలో రీచార్జి చేసుకోవచ్చు. ఇందులో ఉండే బ్యాటరీని ఒకసారి చార్జ్‌ చేస్తే 5 గంటలపాటు ఏకబిగిన పనిచేస్తుందని దీన్ని డిజైన్‌ చేసిన ఏరోబయోసిస్‌ ఇన్నోవేషన్‌ చెబుతోంది. ఈ పరికరానికి వైర్‌లెస్‌ కనెక్టివిటీ ఫీచర్‌ ఉండటంతో రిమోట్‌ మానిటరింగ్‌ విధానంలో రోగులను తాకకుండానే వాడే వీలుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement