ఏమిటా స్పీడు... చలాన్‌ పడుద్ది

Hyderabad Traffic Police Strict Actions Against Over Speed - Sakshi

వేగంపై హెచ్చరికలు

ఔటర్‌పై కొత్త యంత్రాలు

హైదరాబాద్‌ : డ్రైవింగ్‌... రద్దీ రోడ్లపై నెమ్మదిగా వెళ్లినా, ఖాళీగా కనిపిస్తే చాలు దూసుకుపోతాం. మనలో అనేక మందికి ఇది అలవాటే. ఇక ఔటర్‌ రింగ్‌ రోడ్‌ (ఓఆర్‌ఆర్‌) లాంటి మార్గాల్లో వేగానికి పరిమితే ఉండదు. సాధారణ స్పీడ్‌ దాటినా మీటర్‌ రీడింగ్‌ కూడా చాలా మంది చూసుకోరు. ఇదే ప్రమాదాలకు కారణమవుతోంది. ఇదిగో ఇలాంటి వారి కోసమే పోలీసులు కొత్త యంత్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇవి మీ స్పీడ్‌ను పరిశీలించి హెచ్చరిస్తాయి. ‘నో యువర్‌ స్పీడ్‌’, ‘యువర్స్‌ స్పీడ్‌’యంత్రాలను ఓఆర్‌ఆర్‌పై ఏర్పాటు చేయనున్నట్లు ట్రాఫిక్‌ డీసీపీ దివ్యచరణ్‌రావు ‘సాక్షి’కి తెలిపారు. పైలట్‌ ప్రాజెక్టుగా తమ పరిధిలో ఉన్న 62 కి.మీ. ఔటర్‌లో ఒక్కో రోజు ఒక్కో చోట వీటిని వినియోగించనున్నారు.

యువర్స్‌ స్పీడ్‌ పనిచేస్తుంది ఇలా.. 
ఈ యంత్రాన్ని నిర్ణీత ప్రాంతంలో ఏర్పాటు చేస్తారు. ఇది ఎదురుగా వచ్చే వాహనాలను 300–400 మీటర్ల దూరం నుంచే అధ్యయనం చేస్తుంది. రాడార్‌ టెక్నాలజీతో పనిచేసే ఈ యంత్రం వాహన వేగాన్ని అధ్యయనం చేసి అనుసంధానించి ఉండే బోర్డు మీద వేగాన్ని (యువర్‌ స్పీడ్‌ అంటూ..) అంకెల్లో సూచిస్తుంది. వాహనం సాధారణ వేగంతో ఉంటే గ్రీన్‌ సిగ్నల్‌ను, మితిమీరితే రెడ్‌ సిగ్నల్‌ను చూపిస్తూ ‘డేంజర్‌’అని హెచ్చరిస్తూ డ్రైవర్‌ను అప్రమత్తం చేస్తుంది. హెచ్చరికను పట్టించుకోకుండా ముందుకు వెళితే అక్కడ ఉండే స్పీడ్‌ లేజర్‌ గన్‌ కెమెరా దీన్ని గుర్తించి ఈ–చలాన్‌ రూపంలో వాహనదారుడికి జరిమానా విధిస్తుంది. 

ట్యాంక్‌బండ్‌పై ట్రయల్‌..
ఈ స్పీడ్‌ డిటెక్టింగ్‌ టెక్నాలజీని ఇన్‌స్పెక్టర్‌ ఎం.నర్సింగ్‌రావు నేతృత్వంలోని బృందం గత నెలలో ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసి అధ్యయనం చేసింది. ఈ స్పీడ్‌ డిటెక్టర్‌లు జర్మనీ టెక్నాలజీతో తయారై రాడార్‌ పరిజ్ఞానంతో పనిచేస్తాయి. ప్రయోగాత్మక పరిశీలనలో అనేక మంది వాహనచోదకులు ‘యువర్‌ స్పీడ్‌’చూసుకొని వేగం తగ్గించారని అధికారులు తెలిపారు. మరికొన్ని రోజులు వీటిని అధ్యయనం చేసి, సాధ్యాసాధ్యాలు గుర్తించాక కీలక ప్రాంతాల్లో పెట్టాలని యోచిస్తున్నారు. 


స్పీడ్‌ లిమిట్‌ లోపల వెళ్తే ఇలా ‘గ్రీన్‌’ రీడింగ్‌ చూపిస్తుంది.., స్పీడ్‌ లిమిట్‌ దాటి వెళ్తే ఇలా ‘రెడ్‌’ రీడింగ్‌ చూపిస్తుంది..

ప్రాథమికంగా రెండు యంత్రాలు... 
రోడ్డు ప్రమాద నిరోధం, ప్రాణనష్టం తగ్గించడమే మా లక్ష్యం. ఇందులో భాగంగా రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ ఆదేశాల మేరకు ఓఆర్‌ఆర్‌పై రెండు యంత్రాలను ఏర్పాటు చేస్తున్నాం. – దివ్యచరణ్‌ రావు, ట్రాఫిక్‌ డీసీపీ, రాచకొండ

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top