చలో ఆస్ట్రేలియా.. | Hyderabad Students Intrested on Education in Australia | Sakshi
Sakshi News home page

చలో ఆస్ట్రేలియా..

Jan 24 2020 8:21 AM | Updated on Jan 24 2020 8:21 AM

Hyderabad Students Intrested on Education in Australia - Sakshi

సాక్షి,సిటీబ్యూరో: ఉన్నత విద్యకోసం గ్రేటర్‌ విద్యార్థులు ఆస్ట్రేలియా దేశానికి పోటెత్తుతున్నారు. ఏటా వీరి సంఖ్య  పెరుగుతూనే ఉంది. మహానగరం పరిధిలోని డీమ్డ్‌ వర్సిటీలు, వృత్తి విద్యాకళాశాలల్లో ఫీజులతో పోలిస్తే ఆ దేశంలో ట్యూషన్‌ ఫీజులు తక్కువగా ఉండడం, సులభతరమైన వీసా నిబంధనలు, చదువుకుంటూనే పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు చేసుకుని జీవనవ్యయానికి అవసరమైన డబ్బులను సొంతంగా సంపాదించుకునే అవకాశం ఉండడంతో మెజార్టీ సంఖ్యలో విద్యార్థినీ విద్యార్థులు ఆ దేశం బాట పడుతున్నారు. గత మూడేళ్లుగా వీరి సంఖ్య క్రమంగా పెరుగుతోందని విద్యా సంబంధిత కన్సల్టెన్సీల ప్రతినిధులు పేర్కొన్నారు.

ట్రెండ్‌ మారింది..
గ్రేటర్‌ విద్యార్థులు ఇప్పుడు ట్రెండ్‌ మార్చారు.  అమెరికాకు బదులుగా ఆస్ట్రేలియా, కెనడా, యుకే దేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఆసక్తి చూపుతున్నారు. గత మూడేళ్లుగా వీరి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నగరం నుంచి 2017 లో సుమారు 13 వేల మంది, 2018లో 15 వేలు, 2019లో 20 వేల మంది  వివిధ రకాల కోర్సులు అభ్యసించేందుకు  ఆస్ట్రేలియా వెళ్లినట్లు కన్సల్టెన్సీల ప్రతినిధులు చెబుతున్నారు. అత్యధికులు ఇంజినీరింగ్, మెడిసిన్, బయోటెక్నాలజీ కోర్సుల పట్ల ఆసక్తి చూపుతున్నట్లు తెలిపారు. విద్యార్థులు సంఖ్య క్రమంగా పెరుగుతుండడంతో  ఆస్ట్రేలియా చెందిన పలు వర్సిటీలు, విద్యాసంస్థల ప్రతినిధులు నగరంలో ప్రత్యేకంగా అవగాహన శిబిరాలు నిర్వహిస్తున్నాయి.  ఆయా సదస్సుల్లో ప్రధానంగా విద్యార్థులు లేవనెత్తే సందేహాలను అక్కడి విద్యాసంస్థల ప్రతినిధులు నివృత్తి చేస్తుండటం విశేషం. ఉన్నత విద్యావకాశాలు, అక్కడి ప్రత్యేకతలు, కోర్సులో అంతర్భాగంగా ఉండే సబ్జెక్టులు, వాటితో వారికి భవిష్యత్‌లో లభించే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, వీసా నిబంధనలు, అక్కడి భౌగోళిక పరిస్థితులు, జీవనవ్యయం, చదువుకుంటూనే పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు చేసుకునే వెసులుబాటు తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఇంటర్మీడియట్‌ అనంతరం పలు డిగ్రీ, పీజీ కోర్సులతో పాటు మరికొందరు పీహెచ్‌డీ కోసం సైతం ఆస్ట్రేలియా బాటపడుతున్నట్లు కన్సల్టెన్సీల ప్రతినిధులు చెబుతున్నారు. 

ఫీజులు తక్కువే..
నగరంలోని పలు ఇంజినీరింగ్, మెడిసిన్‌ కోర్సులతోపాటు డీమ్డ్‌ వర్సిటీల్లో ఉన్న ఫీజుల కంటే ఆస్ట్రేలియాలో  ట్యూషన్‌  ఫీజులు అందుబాటులో  ఉండడంతో పలువురు విద్యార్థులు ఆస్ట్రేలియా బాట పడుతుండడం విశేషం. జీవనవ్యయాన్ని సొంతంగా సంపాదించుకునేందుకు ఏటా 100 రోజల పాటు  పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలకు  చట్టాలు అనుమతిస్తున్నాయన్నారు. దీంతో విద్యార్థినీ విద్యార్థులు తమకు నెలవారీగా అయ్యే ఖర్చులను పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు చేస్తూ సంపాదించుకునే అవకాశం ఉందంటున్నారు. 

ప్రధాన కారణాలివీ..
విద్యా సంబంధిత వీసా పొందేందుకు తక్కువ సమయం పట్టడం.
వివిధ వృత్తి విద్య కోర్సులకు ట్యూషన్‌ ఫీజులు అందుబాటులో ఉండడం.  
ఏడాదికి 100 రోజులపాటు పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు చేస్తూ  సొంతంగా సంపాదించుకునే అవకాశం ఉండడం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement