గ్రేటర్‌కు సాకర్‌ ఫీవర్‌.. 

Hyderabad FIFA Fans Going To Russia - Sakshi

ఫిఫా వరల్డ్‌కప్‌ నేపథ్యంలో

రష్యాకు హైదరాబాదీలు 

30 వేల మంది వెళ్లినట్లు అంచనా

సాక్షి, హైదరాబాద్‌: ప్రస్తుతం ప్రపంచం సాకర్‌ ఫీవర్‌లో మునిగి తేలుతోంది. అంచనాలకు అంద కుండా సాగుతున్న ఫిఫా ప్రపంచ కప్‌–2018ను చూసేందుకు అందరిలోనూ ఉత్సాహం ఉరక లేస్తోంది. రష్యా వేదికగా జరుగుతున్న ఈ సాకర్‌ మహాసంగ్రామాన్ని టీవీల్లో కోట్లాది మంది చూస్తుంటే.. ప్రత్యక్షంగా వీక్షించేందుకు లక్షలాది మంది రష్యాకు వెళుతున్నారు. దీనికి భాగ్యనగరం కూడా మినహాయింపు కాదు. నగరం నుంచి వేలాది మంది రష్యా బాట పట్టినట్లు తెలిసింది. సెమీఫైనల్, ఫైనల్‌ మ్యాచ్‌లను కనులారా వీక్షించేందుకు రష్యా వెళ్లిన వారి సంఖ్య సమారు 30 వేల వరకు ఉన్నట్లు ట్రావ్‌కార్ట్, మేక్‌ మై ట్రిప్‌ ట్రావెల్స్‌ అంచనా వేశాయి.  

40 శాతం పెరుగుదల
గతంతో పోలిస్తే నగరం నుంచి ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లను వీక్షించేందుకు వెళ్లిన వారి సంఖ్య 40 శాతం మేర పెరగడం విశేషం. నగరంలోని ట్రావెల్‌ ఏజెంట్ల లెక్కల ప్రకారం.. దేశంలో మెట్రో నగరాల నుంచి సాకర్‌ మ్యాచ్‌లను వీక్షించేందుకు సుమారు పది లక్షల మంది రష్యా పయనమయ్యారట. ఇందులో హైదరాబాద్‌ నుంచి 12 శాతం మంది.. ఢిల్లీ నుంచి 22 శాతం, కోల్‌కతా నుంచి 18 శాతం, ముంబై నుం చి 15 శాతం మంది వెళ్లినట్టు తేలింది. మార్చిలోనే సాకర్‌ మ్యాచ్‌లు చూసేందుకు ఎక్కువ మంది టికెట్లు బుక్‌ చేసుకున్నట్లు ట్రావ్‌కార్ట్, మేక్‌ మై ట్రిప్‌ ట్రావెల్స్‌ సంస్థల ప్రతినిధులు తెలిపారు. సాకర్‌ ప్రపంచ కప్‌ నేపథ్యంలో రష్యా వెళ్లే పర్యాటకుల సంఖ్య రెట్టింపయ్యిందని, ప్రధానంగా ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లు జరుగుతున్న సోచి, వోల్‌గ్రోగార్డ్, సరాన్సిక్, మాస్కో, రస్తోవ్, కజాన్‌ తదితర నగరాలకు క్రీడాభిమానులు వెల్లువెత్తుతున్నారని తెలిసింది. సాకర్‌ మ్యాచ్‌లతోపాటు మాస్కో అందాలు వీక్షించడం, హాలిడేస్‌ను జాలీగా గడిపేందుకే పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారని వెల్లడైంది. 

మ్యాచ్‌ టికెట్‌తో రష్యా వీసా.. 
వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లను వీక్షించేందుకు అవసరమైన టికెట్‌తోపాటే సులువుగా వీసా లభించడం హైదరాబాదీలు రష్యా బాట పట్టేందుకు ప్రోత్సహించిందని ట్రావెల్‌ ఆపరేటర్లు చెబుతున్నారు. ప్రయాణ ఛార్జీలు, వసతి సౌకర్యాలకు ఒక్కో వ్యక్తికి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు ఖర్చవుతోందని తెలిపారు. ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ టికెట్‌ ఆధారంగా ఆన్‌లైన్‌లో వీసాకు దరఖాస్తు చేసుకుంటే పలువురికి ఇంటికే వీసా వస్తోంది. వీసా ప్రక్రియ సులభతరం కావడంతో రష్యాకు పయనమైన వారి సంఖ్య గతంతో పోలిస్తే అనూహ్యంగా పెరిగినట్లు అంచనా.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top