‘మృతదేహాలకు ఎంబామింగ్ జరగలేదు’

Hospital Superintendent Shravan Talk On Disha Accused Bodies Repostmortem - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైకోర్టు ఆదేశాల మేరకు దిశ కేసు నిందితుల మృతదేహాలకు రీ పోస్ట్ మార్టం కొనసాగుతోందని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. శ్రవణ్‌కుమార్‌ తెలిపారు. తెలంగాణతో సంబంధంలేని డాక్టర్లతో ప్రక్రియ చేపట్టాలని న్యాయస్థానం స్పష్టం చేయడంతో ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్).. నలుగురు నిపుణులతో కూడిన బృందం రీ పోస్ట్‌మార్టం నిర్వహిస్తోంది.  ఈ సందర్భంగా డాక్టర్‌ శ్రవణ్‌ సోమవారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ..  పోస్ట్ మార్టం మొత్తం వీడియో రికార్డ్ చేస్తున్నామని తెలిపారు. సీడీ, పెన్ డ్రైవ్ ద్వారా వైద్యులు హైకోర్టుకు నివేదిక అందిస్తారని ఆయన తెలిపారు. సాయంత్రం 5 గంటల లోపు మృతదేహాలను కుటుంబ సభ్యులకు అందిస్తామన్నారు. రెండు అంబులెన్స్‌ వాహనాల్లో వారి గ్రామాలకు పంపిస్తామని ఆయన పేర్కొన్నారు. పోస్ట్ మార్టంలో గాంధీ వైద్యులు ఎవ్వరూ పాల్గొనలేదని డాక్టర్‌ శ్రవణ్‌ కుమార్‌ చెప్పారు. గతంలో ఫోరెన్సిక్ వైద్యులు చేసింది ఏంటో తమకు తెలియదని.. నింబంధనల ప్రకారం జరిపారని ఆయన పేర్కొన్నారు.

కాగా నిందితుల మృతదేహాలకు ఎంబామింగ్ ఏమి జరగలేదని చెప్పారు. 2-4 రోజులు రీ ఫ్రిజిరేటర్‌లో పెట్టామని.. మృతదేహాలు 50శాతానికి పైగా డి కంపోజ్ అయ్యాయని ఆయన తెలిపారు. ప్రత్యేక వైద్యుల బృందం అడిగిన యంత్ర పరికరాలను తాము సమకూర్చామని డా. శ్రవణ్‌ తెలిపారు. శీతాకాలం వల్ల మృతదేహాలు ఇంకా అలాగే ఉన్నాయని.. అదే వేసవికాలంలో అయితే మూడు రోజుల్లో డీ కంపోజ్ అవుతాయని అన్నారు. ఒక్కో  మృతదేహం రీ పోస్ట్ మార్టం చేసేందుకు 1 గంట సమయం పట్టే అవకాశం ఉందని డా. శ్రవణ్‌ తెలిపారు. రీ పోస్ట్‌ మార్టం పూర్తి అయిన తర్వాత వైద్యులు సాయంత్రం 7:30కి ఢిల్లీకి వెళ్లతారని ఆయన చెప్పారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top