పోలీసుల్ని ప్రజలకు దగ్గర చేశాం

Home Minister launched the Rachakonda Commissionerate - Sakshi

రాచకొండ కమిషనరేట్‌ను ప్రారంభించిన హోంమంత్రి

నేరాల నియంత్రణలో రాష్ట్ర పోలీసుల పురోగతిపై ప్రశంసలు

సీఎం ఆశయాల సాధనలో పోలీసులు సక్సెస్‌: డీజీపీ

సాక్షి, హైదరాబాద్‌: దండనీతిని పక్కనబెట్టి, ప్రజలకు పోలీసులను చేరువ చేయగలిగామని హోంమంత్రి మహమూద్‌అలీ అన్నారు. హైదరాబాద్‌ నేరెడ్‌మెట్‌లో నూతనంగా నిర్మించిన రాచకొండ కమిషనరేట్‌ను డీజీపీ మహేందర్‌రెడ్డి, కమిషనర్‌ మహేశ్‌ భగవత్, స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుతో కలిసి మంత్రి మహమూద్‌ అలీ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ఒకప్పుడు పోలీసు ఠాణాకు రావాలంటే.. జనాలు జంకేవారు. నేడు పోలీసులను మిత్రులుగా భావించి తమ కష్టాలను చెప్పుకుంటున్నారు. ఇటు నేరాల్ని నియంత్రించడంలో తెలంగాణ పోలీసులు గణనీయమైన పురోగతి సాధించారు. రాచకొండ కమిషనరేట్‌ను రూ.5.1 కోట్లతో కేవలం 18 నెలల కాలంలో పూర్తి చేయడం గొప్ప విషయం.

భవిష్యత్‌లో ప్రజలకు సేవలు మరింత చేరువ చేసేలా కార్యక్రమాలు చేపడతాం. ఏ రాష్ట్రానికైనా శాంతి భద్రతలే కీలకం. అందుకే సీఎం కేసీఆర్‌ ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించారు. రూ.700 కోట్లు కేటాయించి గస్తీకి పెద్దపీట వేశారు. దేశంలోనే తెలంగాణ పోలీసుల పనితీరు నంబర్‌ వన్‌గా ఉంది. ఇటీవల కేరళ సీఎం వచ్చి పంజగుట్ట పోలీస్‌ ఠాణాను సందర్శించి ప్రశంసించడమే ఇందుకు నిదర్శనం. త్వరలోనే 18 వేల ఖాళీలు భర్తీ చేస్తాం. రాచకొండ కమిషనరేట్‌ దేశంలోనే అతిపెద్ద కమిషనరేట్‌. 13 నియోజకవర్గాలు, 3 జిల్లాల్లో విస్తరించి ఉన్న కమిషనరేట్‌లో మేడ్చల్, రంగారెడ్డి, యాదాద్రి జిల్లాల కలెక్టర్లు, పోలీసులు సమన్వయం పనిచేసి మంచిపేరు తేవాలి..’అని ఆశాభావం వ్యక్తం చేశారు. 

కానిస్టేబుల్‌ నుంచి కమిషనర్‌ వరకు.. 
పోలీసుల రికార్డులను భద్రపరిచేందుకు రాచకొండ పోలీసు కమిషనరేట్‌ భవనంలో మొదటిసారిగా ఆటోమేటెడ్‌ రికార్డింగ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (ఏఆర్‌ఎమ్‌ఎస్‌) సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తెచ్చారు. పుణేలోని టెక్‌–మార్క్‌ ఆటోమేషన్‌ సంస్థ ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చింది. కానిస్టేబుల్‌ నుంచి కమిషనర్‌‡ వరకు.. అందరి సర్వీసు బుక్‌లు, పాలనా రికార్డులన్నీ ఏఆర్‌ఎంఎస్‌లో భద్రపరుస్తారు. రికార్డుల పూర్తి వివరాలను పీడీఎఫ్‌ రూపంలో సాఫ్ట్‌ కాపీని ఏఆర్‌ఎమ్‌ఎస్‌లోని కంప్యూటర్‌లో, ఆటోమేటిక్‌గా పనిచేసే ర్యాక్‌లో మ్యాన్యువల్‌ రికార్డులను ఉంచుతారు. అగ్నిప్రమాదం సంభవించినా, నీళ్లు పడినా ఎలాంటి నష్టం సంభవించకపోవడం ఈ ఏఆర్‌ఎంఎస్‌ ప్రత్యేకత. ఏఆర్‌ఎమ్‌ఎస్‌లో రికార్డులను పరిశీలించేందుకు కమిషనరేట్‌ కార్యాలయంలో పరిపాలనా విభాగం ముఖ్య అధికారులకు ప్రత్యేక పాస్‌వర్డ్‌లు, యూజర్‌ ఐడీలను కేటాయించి, ఎలా ఉపయోగించాలో శిక్షణ ఇవ్వనున్నారు. 

ప్రజల హృదయాలు గెలుచుకోవాలి: డీజీపీ 
పోలీసులు మెరుగైన పనితీరుతో ప్రజల మనసులు గెలుచుకోవాలని డీజీపీ మహేందర్‌ అన్నారు. ‘సీఎం కేసీఆర్‌ ఆశయాలను సాధించడంలో తెలంగాణ పోలీసులు సఫలీకృతులయ్యారు. నగరంలో శాంతి భద్రతలకు సీఎం పెద్దపీట వేశారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ ప్రవేశపెట్టి, 5 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. ఇందుకోసం పేద, ధనిక వర్గాలు ముందుకు రావడం అభినందనీయం. కేవలం గస్తీకే రూ. 350 కోట్లతో 11 వేల వాహనాలను సీఎం పోలీసుశాఖకు కేటాయించారు. ఈ కమిషనరేట్‌ ఏర్పాటు వల్ల సైబరాబాద్‌పై భారం తగ్గుతుంది’ అని వ్యాఖ్యానించారు  

ఏఆర్‌ఎమ్‌ఎస్‌తో క్షణాల్లో రికార్డులు: సీపీ  
కేవలం 18 నెలల్లోనే కమిషనరేట్‌ను పూర్తి చేసినందుకు టీఎస్‌ పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దామోదర్, ఎండీ మల్లారెడ్డికి రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ కృతజ్ఞతలు తెలిపారు. ‘దేశంలో ఎక్కడాలేని విధంగా ఏఆర్‌ఎమ్‌ఎస్‌ను ఇక్కడ ప్రవేశపెట్టాం. దీని సాయంతో అన్ని రికార్డులను క్షణాల్లో చూడొచ్చు. మేడిపల్లి వద్ద ప్రభుత్వం కమిషనరేట్‌కు 50 ఎకరాలు, యాదగిరిగుట్ట వద్ద పోలీసు శిక్షణ కేంద్రానికి మరో 36 ఎకరాలు కేటాయించిన సీఎంకు కృతజ్ఞతలు’ అని అన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top