ఫీజు‘ముడి’

HMDA Rejects LRHS Applications Hyderabad - Sakshi

భారీగా ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల తిరస్కరణ  

కట్టిన ఫీజు ఇచ్చేయాలని బాధితుల డిమాండ్‌

ఒక్కొక్కరి నుంచి రూ.10 వేలు వసూలు చేసిన హెచ్‌ఎండీఏ  

తిరిగిచ్చే ప్రస్తావన జీఓలో లేదన్న అధికారులు

అందిన దరఖాస్తులు 1.75 లక్షలు.. తిరస్కరించినవి 63 వేలు

సాక్షి, సిటీబ్యూరో: అరుణ్‌.. ఓ మధ్య తరగతి సాధారణ ప్రైవేట్‌ ఉద్యోగి. వచ్చిన జీతంలో కొంత మిగిల్చుకుని శంకర్‌పల్లిలో ఓ ప్లాట్‌ కొన్నాడు. మణికొండకు చెందిన ప్రకాశ్‌ కూడా అలాంటి వారే. సమీపంలో ఓ ప్లాట్‌ తక్కువకు వస్తుందని లోన్‌ పెట్టి మరీ తీసుకున్నాడు. హయత్‌నగర్‌లో ఉంటున్న ధీరజ్‌ సొంతూరిలో పొలం అమ్మగా వచ్చిన డబ్బుతో ఇక్కడ స్థలం కొన్నాడు. ఇటీవల హెచ్‌ఎండీఏ ‘ల్యాండ్‌ ఎగ్యులేషన్‌ పథకం’(ఎల్‌ఆర్‌ఎస్‌) కింద దరఖాస్తులు కోరడంతో అందరిలాగే వీరూ తలో రూ.10 వేలు ఫీజు కట్టి దరఖాస్తు చేసుకున్నారు. అయితే, మాస్టర్‌ ప్లాన్‌ రోడ్డు కింద ప్లాట్‌ ఉందంటూ ఒకరిది.. వాటర్‌ బాడీస్‌ కింద ప్లాట్‌ ఉందని, ఇండస్ట్రీయల్‌ జోన్‌లో ఉందంటూ మిగతావారి రెగ్యులేషన్‌ను అధికారులు తిరస్కరించారు.

హెచ్‌ఎండీకు అందిన 1.75 లక్షల దరఖాస్తుల్లో దాదాపు 1.02 లక్షల దరఖాస్తులకు ఫైనల్‌ ప్రొసిడింగ్స్‌ ఇచ్చారు. మరో 10 వేల దరఖాస్తులు రెవెన్యూ, ఇరిగేషన్‌ నుంచి ఎన్‌ఓసీలు రాక పెండింగ్‌లో ఉంచారు. మాస్టర్‌ ప్లాన్‌లో రోడ్డు, శిఖం, చెరువులు, సరైన పత్రాలు ఆప్‌లోడ్‌ చేయలేదనే కారణాలతో సుమారు 63 వేల దరఖాస్తులను తిరస్కరించారు. ఎల్‌ఆర్‌ఎస్‌ క్లియరెన్స్‌ ప్రక్రియ గడువు ముగియడంతో తిరస్కరించిన దరఖాస్తుల ఇనీషియల్‌ పేమెంట్‌ ఫీజు రూ.10 వేలు వెనక్కి ఇవ్వాలంటూ బాధితులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇందుకోసం తార్నాకలోని హెచ్‌ఎండీఏ కార్యాలయానికి వస్తున్నారు. అయితే అధికారులు మాత్రం అలా ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పడంతో వారు ఆందోళన చెందుతున్నారు. భవిష్యత్‌లో అవసరాలకు ఉపయోగపడతాయని ఎంతో కష్టపడి ప్లాట్‌ కొనుగోలు చేశామని, ఇప్పుడు ఆ ప్లాట్‌ మాస్టర్‌ప్లాన్‌లో పోతుందంటూ తిరస్కరించారని, అయితే, అప్పుగా తీసుకొచ్చి కట్టిన ప్రారంభ ఫీజును కూడా వెనక్కి ఇవ్వడం లేదని వాపోతున్నారు. ప్రభుత్వం ఆలోచించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 

మా గోడు వినిపించుకోరా..!
తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల ప్రజలు ఉపాధి కోసం వచ్చి నగరంలో ఉంటున్నారు. దినసరి కూలీల దగ్గరి నుంచి వివిధ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగుల వరకు వీరిలో ఉన్నారు. వీరంతా అహర్నిశలు శ్రమించి కూడబెట్టిన డబ్బుతో శివారుల్లో ప్లాట్లు కొనుగోలు చేశారు. కొందరు తమ పిల్లల పెళ్లిళ్లకు ఉపయోగపడతాయని, మరికొందరు భవిష్యత్‌లో ఇల్లు కట్టుకోవాలని భావించారు. శివార్లలోని గ్రామ పంచాయతీ లే అవుట్లలోని ప్లాట్లు తీసుకున్నారు. ఎంతో వ్యయాప్రయాసలతో కొనుగోలు చేసిన ఈ ప్లాట్లను ఎల్‌ఆర్‌ఎస్‌ కింద క్రమబద్దీకరించుకుంటే క్రయవిక్రయాలకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని భావించి వేలాది మంది ప్రారంభ ఫీజు రూ.10 వేలు చెల్లించి దరఖాస్తు చేశారు. అయితే, ఇప్పుడా ప్లాట్లు మాస్టర్‌ ప్లాన్‌ రోడ్డులో ఉన్నాయని, శిఖం, నాలా, చెరువులో వస్తున్నాయని, ఇండస్ట్రియల్‌ జోన్‌లో ఉన్నాయనే కారణాలతో దాదాపు 63 వేలకు పైగా దరఖాస్తులను హెచ్‌ఎండీఏ అధికారులు తిరస్కరించారు. ‘ఏళ్ల క్రితం కొనుగోలు చేసినప్పుడు ఆ ప్లాట్లు అంతా బాగానే ఉన్నాయి. అయితే మాస్టర్‌ ప్లాన్‌లో ఆయా ప్రాంతాల్లో రోడ్లు, చెరువులు, కుంటలు, నాలాలు, ఇండస్ట్రియల్‌ జోన్‌లో ఉన్నవంటూ ఇప్పుడు చెబుతున్నారు. మేం కొన్నప్పుడు అవేమీ లేవు కదా. కొత్తగా తీసుకొచ్చిన మాస్టర్‌ ప్లాన్‌ తప్పుల తడక వల్ల ప్లాట్‌ మీద పెట్టిన డబ్బులు పోతున్నాయి. అవి అమ్మినా తీసుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. పోనీ మేం దరఖాస్తు చేసిన సమయంలో చెల్లించిన రూ.10 వేలు కూడా హెచ్‌ఎండీఏ ఇవ్వనంటోంది’ అని హెచ్‌ఎండీఏకు వచ్చిన దరఖాస్తుదారుడు వెంకటేశ్‌ వాపోయాడు. 

అందరికీ సమన్యాయం ఉండాలి
లక్షా 75 వేల మందికిపైగా ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తు చేసుకున్న సమయంలో ప్రారంభ ఫీజు రూ.10 వేలు చెల్లించారు. వీరిలో లక్షా రెండు వేల మందికి ఎల్‌ఆర్‌ఎస్‌ క్లియరై ప్రారంభ ఫీజు రూ.10వేలను మినహాయించి మిగతా ఫీజు చెల్లించారు. అయితే, తిరస్కరణకు గురైన 63 వేల మందికి మాత్రం ఆ ప్రారంభ ఫీజును తిరిగి ఇచ్చేదే లేదని, జీఓలో ఆ ప్రస్తావన ఎక్కడా లేదని హెచ్‌ఎండీఏ అధికారులు చెబుతుండడం గమనార్హం. ఎల్‌ఆర్‌ఎస్‌ క్లియర్‌ అయినవారికి ప్రారంభ ఫీజును మినహాయించినట్టుగానే తమకూ ఆ పీజులు తిరిగిచ్చేయాలని తిరస్కరణకు గురైన వారు డిమాండ్‌ చేస్తున్నారు. తమకు న్యాయం జరగకపోతే ఆందోళనకు దిగుతామని చెబుతున్నారు. 

అసలు జీఓ నం. 151లో ఏముంది..  
ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తు చేసుకునే సమయంలో పూర్తిస్థాయి ఫీజు చెల్లించవచ్చు. లేదంటే ప్రారంభ ఫీజు రూ.10 వేలు చెల్లించవచ్చు. దీంతో పాటు మరో పది శాతం డబ్బులు కూడా చెల్లించవచ్చని జీఓ నం.151లో ప్రభుత్వం ప్రస్తావించింది. కానీ తిరస్కరణకు గురైన దరఖాస్తుదారులకు తిరిగి ఆ మొత్తం చెల్లిస్తామని ఎక్కడా ప్రస్తావించలేదని హెచ్‌ఎండీఏ అధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. మరి ఇప్పటికే తమ ప్లాట్ల సంగతేంటో తేలయ ఆందోళన చెందుతున్న 63 వేలమంది బాధితులకు ప్రభుత్వం తిరిగి అవకాశం కల్పిస్తుందా.. లేదంటే కనీసం కంటితుడుపుగానైనా కట్టిన రూ.10 వేలను తరిగి ఇస్తుందా అన్నది ప్రభుత్వం తేల్చాలి.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top