డిగ్రీలోనూ ‘మేనేజ్‌మెంట్‌’ బాదుడేనా?

Higher Education Council To Implement Management Quota In Private Degree Colleges - Sakshi

యాజమాన్య కోటా అమలు ప్రతిపాదనలు ప్రభుత్వానికి

యాజమాన్యాల ఒత్తిడికి తలొగ్గిన ఉన్నత విద్యా మండలి

సర్కార్‌ ఓకే అంటే ప్రైవేట్‌ కాలేజీలకు పండుగే..

అడ్డగోలుగా సీట్లు అమ్ముకునేందుకు వెసులుబాటు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లోనూ మేనేజ్‌మెంట్‌ కోటా అమల్లోకి తెచ్చేందుకు ఉన్నత విద్యా మండలి చర్యలు వేగవంతం చేసింది. గత రెండేళ్లుగా యాజమాన్యాలు చేస్తున్న ఒత్తిడికి తలొగ్గి ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో మేనేజ్‌మెంట్‌ కోటాను అమలు చేసేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేసి శుక్రవారం ప్రభుత్వానికి పంపింది. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఓకే అంటే 500 ప్రైవేటు డిగ్రీ కాలేజీల పంట పండినట్లే. మేనేజ్‌మెంట్‌ కోటా ప్రవేశపెట్టినా, వివిధ కోర్సులకు యూనివర్సిటీలు నిర్ణయించిన ఫీజులనే మేనేజ్‌మెంట్‌ కోటాలోనూ వసూలు చేయాలని ఉన్నత విద్యా మండలి చెబుతున్నా యాజమాన్యాలు ఇష్టానుసారంగా ఫీజులను దండుకునేందుకు మార్గం సుగమం కానుంది.

ప్రత్యేక ఫీజు విధానం లేదు.. 
ప్రస్తుతం రాష్ట్రంలో మేనేజ్‌మెంట్‌ కోటాకు ప్రత్యేక ఫీజు విధానం అంటూ ఏమీ లేదు. కన్వీనర్‌ కోటాలో నిర్ణయించిన ఫీజునే మేనేజ్‌మెంట్‌ కోటాలోనూ అమలు చేయాలి. అయినా ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, బీఎడ్, లా వంటి వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లో మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లను అడ్డగోలుగా అమ్ముకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డిగ్రీ కోర్సుల్లోనూ అదే విధానానికి ఉన్నత విద్యా మండలి తెరతీస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో డిమాండున్న ఎక్కువ సీట్లు భర్తీ అయ్యే డిగ్రీ కాలేజీలు 500 వరకు ఉంటే అందులో 40కి పైగా కాలేజీలు కోర్టును ఆశ్రయించి మరీ ఇష్టానుసారంగా ఫీజులను వసూలు చేస్తున్నాయి.

తాము కోర్సును నిర్వహించాలంటే తమకు నచ్చి న ఫీజును వసూలు చేస్తామని, యూనివర్సిటీ నిర్ణయించిన ఫీజుతో తాము కాలేజీలను నడపలే మని చెబుతున్నారు. ప్రభుత్వం నిర్వహించే ఆన్‌లైన్‌ ప్రవేశాల నుంచి కోర్టు నుంచి మినహాయింపు తెచ్చుకొని తమ ఇష్టానుసారంగా ఫీజులను తీసుకుంటూ సీట్లను భర్తీ చేస్తున్నాయి. మరోవైపు మైనారిటీ కాలేజీలు సొంతంగానే ప్రవేశాలు చేపట్టుకుంటున్నాయి. అలాంటి కాలేజీలను సాధారణ విద్యార్థులకు అందుబాటులోకి తేవడంలో విఫలమైన ఉన్నత విద్యా మండలి విద్యార్థులకు అందుబాటులో ఉన్న కాలేజీల్లోనూ మేనేజ్‌మెంట్‌ కోటాను ప్రవేశపెట్టి సీట్లు అమ్ముకునేందుకు అవకాశం కల్పిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వృత్తి, సాంకేతిక విద్యా సంస్థల తరహాలో 30 శాతం.. 
వృత్తి, సాంకేతిక విద్యా సంస్థల తరహాలోనే డిగ్రీలోనూ మేనేజ్‌మెంట్‌ కోటా 30 శాతం అమలు చేసేందుకు విద్యా మండలి సిద్ధమైంది. ఈ అంశాన్ని తమ ప్రతిపాదనల్లో పొందుపరిచినట్లు తెలిసింది. పైగా ఇష్టం ఉన్న కాలేజీలు కోటాను అమలు చేసుకోవచ్చు. ఇష్టం లేని కాలేజీలు మొత్తం కన్వీనర్‌ కోటా కింద నిర్వహించే ఆన్‌లైన్‌ ప్రవేశాల్లో భర్తీ చేసుకునే వెసులుబాటును కల్పిస్తున్నాయి. దీనివల్ల టాప్‌ కాలేజీలు, కొంత పేరున్న కాలేజీలు, 80 శాతానికి పైగా సీట్లు భర్తీ అయ్యే కాలేజీలు 500కు పైగా మేనేజ్‌మెంట్‌ కోటాను అమలు చేస్తాయి. అంటే ఇపుడు కోర్టును ఆశ్రయించి సొంతంగా ప్రవేశాలు చేస్తూ, సొంతంగా ఫీజులను నిర్ణయించుకొని వసూలు చేస్తున్న 40 కాలేజీలకు తోడు మరో 450 పైగా కాలేజీలు తమ ఇష్టానుసారంగా 30 శాతం సీట్లను భర్తీ చేసుకునే వీలును ఉన్నత విద్యా మండలే కల్పిస్తోంది.

మేనేజ్‌మెంట్‌ కోటాలో లక్షకు పైగా సీట్లు.. 
ప్రస్తుతం రాష్ట్రంలో 1,170 డిగ్రీ కాలేజీలుండగా, వాటిల్లో 4,44,169 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ప్రభుత్వ, ఎయిడెట్, అటానమస్, గురుకులాలు పోగా 845 ప్రైవేటు డిగ్రీ కాలేజీలున్నాయి. వాటిల్లో 3,13,485 సీట్లున్నాయి. వాటన్నింటిలో ఇప్పటివరకు డిగ్రీ ఆన్‌లైస్‌ సర్వీసెస్, తెలంగాణ (దోస్త్‌) ద్వారానే ప్రవేశాలు జరుగుతున్నాయి. వాటికి తోడు మరో 42,460 సీట్లు కలిగిన 118 కాలేజీలు సొంతంగా ప్రవేశాలు చేపడుతున్నాయి. ఇందులో కోర్టును ఆశ్రయించినవి ఉన్నాయి. అవి కూడా కలుపుకొని (వాటిల్లో మేనేజ్‌మెంట్‌ కోటా అమలు చేస్తే) మొత్తంగా 966 కాలేజీల్లో 3,55,945 సీట్లు అందుబాటులో ఉండనుండగా, అందులో మేనేజ్‌మెంట్‌ కోటా కింద 1,06,783 సీట్లను యాజమాన్యాలే భర్తీ చేసుకునే వీలు ఏర్పడనుంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top