చిరునవ్వుల తెలంగాణ కేసీఆర్‌ విజన్‌

Harish Rao credits CM KCR for improving lives of Telangana farmers - Sakshi

మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌ రావు

సాక్షి, హైదరాబాద్‌/ సిద్దిపేటజోన్‌: రైతులు, వారి కుటుంబాలను సంతోషంగా ఉంచే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనావిధానం సాగిస్తున్నారని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ప్రజలు చిరునవ్వుల తెలంగాణలో ఉండే రోజులు రానున్నాయని.. అదే విజన్‌తో కేసీఆర్‌ పనిచేస్తున్నారని చెప్పారు. రాబోయే రోజుల్లో తెలంగాణ అన్నిరంగాల్లో అభివృద్ధి జరిగి దేశానికి గొప్ప నమూనాగా నిలుస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్‌ఆర్‌ఐ శాఖ ఆధ్వర్యంలో అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం ట్యాంపా సిటీలో ఇటీవల నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో హరీశ్‌రావు ముఖ్య అతిథిగా ప్రసంగించారు.

ఇంకా హరీశ్‌ మాట్లాడుతూ ‘తెలంగాణ ఉద్యమం జరిగే సమయంలో 2010లో నేను అమెరికాకు వచ్చాను. పది రోజుల పాటు 14 రాష్ట్రాల్లో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నాను. తెలంగాణ రాష్ట్రం వస్తుందని అప్పుడు అనుకున్నాం. అదే సాకారమైంది. వచ్చే రెండేళ్లలో రైతులు పడే కష్టాలు పోతాయి. వారి కళ్లలో సంతోషాన్ని చూస్తాం. ఒకప్పుడు భారతదేశంలో అభివృద్ధి అంటే పశ్చిమబెంగాల్‌ అనేవారు. అభివృద్ధి, సంక్షేమంలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా మారింది. నిరంతర కరెంటు సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. మిషన్‌ కాకతీయ, కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులతో కోటి ఎకరాలకు సాగు నీరు ఇవ్వాలన్నది సీఎం కేసీఆర్‌ లక్ష్యం.

రైతుబంధు, రైతు భీమా, ఎరువులు విత్తనాల పంపిణీ , మార్కెటింగ్‌ వ్యవస్థ, ఉచితంగా కరెంటు ఇస్తూ రైతులకు ఆత్మవిశ్వాసాన్ని నింపింది. కేసీఆర్‌ ప్రభుత్వం రైతుల జీవితాలకు భరోసానిచ్చింది. మొక్క పెరిగి ఫలాన్ని ఇవ్వడానికి కొంత సమయం పడుతుంది. వ్యవసాయరంగమే కాదు విద్య, వైద్యం, విద్యుత్‌... అన్ని రంగాల్లో ప్రగతి సాధించే దిశగా ప్రభుత్వం ముందుకు పోతోంది.అప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఎన్‌ఆర్‌ఐలు కీలకంగా పని చేశారు. టీఆర్‌ఎస్‌కు మీ సహకారం మరువలేనిది. అమెరికాలో ఎన్‌ఆర్‌ల ఆతిథ్యం, ఆత్మీయత తెలంగాణలోనే ఉన్నట్టు అనిపిస్తోంది. చాలా సంతోషంగా ఉంది’ అని హరీశ్‌రావు అన్నారు.  

ఐటీ నిపుణులు కూడా వ్యవసాయం వైపు..
అమెరికా వచ్చి ఇంజనీర్, డాక్టర్‌ ఉద్యోగాలు చేసే రోజులు చూశాం. ఈ వృత్తిలో కొనసాగుతున్న వారు ఇప్పుడు వ్యవసాయం పై ఆసక్తి చూపుతున్నారు. ఒకప్పుడు రైతు అంటే చిన్న చూపు ఉండేది. ఇప్పుడు రైతు అంటే గౌరవం పెరుగుతోంది. ఐటీని వృత్తిగా ఎంచుకున్న వారు కూడా వ్యవసాయాన్ని ఎంచుకునే పరిస్థితులు వచ్చే నాలుగేళ్లలో రాబోతున్నాయి’అని హరీశ్‌రావు ఆశాభావం వ్యక్తం చేశారు.

హరీశ్‌రావు ఘన ఆత్మీయ సన్మానం  
ట్యాంపాసిటీలో మూడు గంటల పాటు జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో తెలంగాణ వాసులు హరీశ్‌రావును ఘనంగా సన్మానించారు. సుమారు 300మంది ఒక్కొక్కరుగా హరీశ్‌ను కలిసి ఆత్మీయంగా పలకరించి అభినందించారు. తెలంగాణ సంప్రదాయాల ప్రకారం మహిళలు బోట్టు పెట్టి హరీశ్‌రావుకు మంగళ హారతులతో స్వాగతం పలికారు. అనంతరం ఎన్‌ఆర్‌ఐల ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సన్మానించారు. ముఖ్యంగా సిద్దిపేట ప్రాంతానికి చెందిన బళ్ల రాజేందర్, విఠల శశికాంత్‌శర్మ, సుధాకర్, కిషోర్‌లు హరీశ్‌రావును సన్మానించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top