నందిని కవిత్వం సమాజ హితం

Harish rao about Nandini Sidda Reddy - Sakshi

సాహిత్య వికాసంలో ఆయన పాత్ర విస్మరించలేనిది: హరీశ్‌రావు

సాక్షి, హైదరాబాద్‌: నందిని సిధారెడ్డి కవిత్వమైనా, మనస్తత్వమైనా సమాజ హితమేనని ఆపద్ధర్మ మంత్రి హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ అస్తిత్వం, సాహిత్య వికాసంలో ఆయన కృషి విస్మరించలేమన్నారు. తెలుగు విశ్వవిద్యాలయంలో గురువారం తెలంగాణ భాషా సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు డాక్టర్‌ నందిని సిధారెడ్డి సాహిత్య ప్రస్థానంపై రూపొందించిన ‘మందారం’సంపుటిని మంత్రి హరీష్‌రావు ఆవిష్కరించారు. నిరాడంబరమైన జీవితంలో పుస్తకాలతోనే సహచర్యం చేసిన సిధారెడ్డి తాను ఎదగడంతో పాటు ఇతరులను ప్రోత్సహించారని హరీశ్‌రావు తెలిపారు.

నిర్మొహమాటంగా మాట్లాడే సిధారెడ్డి కేసీఆర్‌కు అత్యంత ఇష్టుడని తెలిపారు. అధ్యక్షత వహించిన ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి మాట్లాడుతూ సిధారెడ్డి కవిత్వం అప్పటికప్పుడు సంఘ టనలపై రాసే సాహిత్యం కాదని, వెతల నుంచి తపనతో కవిత్వాన్ని రాశారని ప్రశంసించారు. ప్రముఖ కవి డాక్టర్‌ కె.శివారెడ్డి మాట్లాడుతూ, కవిత్వం వ్యక్తిత్వాన్ని రూపొందిస్తుందని ఇందుకు ఉదాహరణ నందిని సిధారెడ్డి అన్నారు.  సీఎం కార్యాలయ ప్రత్యేక అధికారి దేశపతి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. జీవన తాత్వికత తెలిసినవాడు, తెలంగాణ గ్రామీణ వాతావరణం లోని నిసర్గ సౌందర్యాన్ని ఆవిష్కరించినవాడు నందిని అని అన్నారు.

తెలుగు వర్సిటీ వీసీ ఆచార్య ఎస్వీ సత్యనారాయణ విశ్వవిద్యాలయం తరఫున నందిని మాతృమూర్తి రత్నమ్మను, సతీమణి మల్లీశ్వరిని సత్కరించారు. సదస్సులో సిధారెడ్డి సాహిత్యంపై ప్రముఖులు ప్రసంగించారు. సంస్థస్థాపకుడు ఘంటా జలంధర్‌రెడ్డి, శాసనమండలి సభ్యులు పాతూరి, పూర్వ శాసనసభ్యుడు రామలింగారెడ్డి, పార్లమెంట్‌ సభ్యుడు బీబీ పాటిల్‌ పాల్గొన్నారు. అనంతరం సాయంత్రం ఇందిరా పరాశరం నృత్య దర్శకత్వంలో నందిని రచించిన ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’నృత్యరూ పకాన్ని కనులపండువగా ప్రదర్శించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top