గొప్పగా జరిగిన సర్వే :కెసిఆర్

కె.చంద్రశేఖర రావు - Sakshi


హైదరాబాద్: రాష్ట్రంలో  సమగ్ర కుటుంబ సర్వే చాలా గొప్పగా జరుగుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు చెప్పారు. ఈ సాయంత్రం ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ  ప్రపంచ చరిత్రలో ఎక్కడా జరగని విధంగా సర్వే జరిగిందన్నారు. ప్రజలందరూ ఎంతో సంతోషంగా సర్వేలో పాల్గొన్నట్లు తెలిపారు. ఆంధ్ర ప్రాంత ప్రజలు  కూడా సంతోషంగా పాల్గొన్నారని చెప్పారు. ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జూనియర్ ఎన్టీఆర్ వంటివారు కూడా సర్వేలో తమ కుటుంబాల పేర్లు నమోదు చేయించుకున్నట్లు  తెలిపారు. ఇతర దేశాల నుంచి కూడా వచ్చి సర్వేలో పాల్గొన్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, సర్వేలో పాల్గొన్న ఉద్యోగులు, టీచర్లు, జిహెచ్ఎంసి సిబ్బంది, విద్యార్థులు అందరికీ  కృతజ్ఞతలు తెలిపారు. ఇదే విధంగా ప్రజలు సహకారం అందిస్తే బంగారు తెలంగాణ అందిస్తానని కెసిఆర్ చెప్పారు.



చాలా జిల్లాలలో 94 శాతం,  హైదరాబాద్లో 88 శాతం సర్వే పూర్తి అయినట్లు వివరించారు. ఊహించని విధంగా హైదరాబాద్ జనాభా పెరిగిపోయిందని, ఆ విషయం ఈ సర్వే ద్వారా తెలిసిందని చెప్పారు.   హైదరాబాద్ జనాభా కోటి 20 లక్షల మంది ఉన్నట్లు తేలిందని చెప్పారు. సర్వే ద్వారా సేకరించిన వివరాలు ప్రభుత్వ కార్యక్రమాలకు  ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. హైదరాబాద్లో ఎంతమంది జనాభా ఉన్నారో తెలిస్తే, నగరానికి వచ్చేపోయే జనాభాతో కలుపుకొని తాగునీరు ఎంత అవసరం ఉంటుందో అంచనా వేయవచ్చని చెప్పారు. 15 రోజులలో సర్వే పూర్తి వివరాలు కంప్యూటర్లలో ఎంటర్ చేస్తారని చెప్పారు. ఆ వివరాలు ముఖ్యమంత్రి దగ్గర నుంచి గ్రామ సర్పంచ్ వరకు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి ఎమ్మార్వో టేబుల్ వరకు వస్తాయన్నారు. అప్పుడు నిజమైన లబ్దిదారులకు న్యాయం జరుగుతుందని చెప్పారు.



ఈ సర్వే వల్ల శుభం జరుగుతుందన్నారు. దొంగలకు బాధ కలిగిస్తుందని చెప్పారు.ఎవరైనా తన కుటుంబాల పేర్లు నమోదు చేసుకోలేకపోతే, వారికి మరో అవకాశం ఇస్తారన్నారు.  ఆ వివరాలు రేపు తెలియజేస్తారని చెప్పారు. ఇక నుంచి ముస్లీం అమ్మాయిల పెళ్లిళ్లకు 51వేల రూపాయలు ఇస్తామన్నారు. ఇంతకు ముందు వస్తువులు కొని ఇచ్చేవారని, అందులో చాలా మోసాలు జరిగేవని చెప్పారు. మోసాలకు తావు లేకుండా నేరుగా ఆ అమ్మాయి  బ్యాంకు ఖాతాలో నగదు జమ చేస్తామని చెప్పారు. కళ్యాణ లక్ష్మిపథకం ద్వారా కూడా 51వేల రూపాయలు ఇస్తామని చెప్పారు.  అవినీతి రహితంగా స్వచ్చమైన పాలన అందించడమే తన లక్ష్యం అని కెసిఆర్ చెప్పారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top