79 మంది విద్యార్థినులకు అస్వస్థత

Govt Girls Hostel Students Fall Ill Due To Water Contamination - Sakshi

సాక్షి, ఆసిఫాబాద్‌రూరల్‌: జిల్లా కేంద్రంలోని ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో కలుషిత నీరు, ఆహారం తిని 36 మంది విద్యార్థినినులు సోమవారం రాత్రి 11 గంటలకు అస్వస్థతకు గురికాగా, ఆ సంఖ్య మంగళవారం మధ్యాహ్నం వరకు 79కి చేరింది. బాధిత విద్యార్థినులు స్థానిక ప్రభుత్వ అసుపత్రిలో చికిత్స పొందుతుండగా, అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ సంఘటన చోటు చేసుకుందని వారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

ఇదిలా ఉంటే, తాగునీటి కోసం పాఠశాలలో ఏర్పాటు చేసిన బోర్‌ చెడిపోయి 20 రోజులైందని విద్యార్థులు తెలిపారు. ఈ విషయాన్ని ప్రిన్సిపాల్‌ స్వర్ణలతకు చెప్పినా పట్టించుకోలేదనీ.. దీంతో 10 ఏళ్లుగా వాడకుండా నిరుపయోగంగా ఉన్న చేతిపంపు నీటిని తాగాల్సి వచ్చిందని వారు వాపోయారు. కాగా, పాఠశాలను డీటీడీవో దిలీప్‌కుమార్‌ సందర్శించి వంటశాల పరిసరాలను పరిశీలించి సంబంధిత అధికారులపై అగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది నిర్లక్ష్యంతోనే ఈ సంఘటన జరిగిందనీ, దీనిపై పూర్తి విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

నిర్లక్ష్యమే శాపం..
జిల్లాలో మొత్తం 40 ఆశ్రమ వసతి గృహాల్లో సుమారు 13 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ వసతిగృహాల్లో కనీస వసతులు కల్పించడం అటుంచి.. వాటిలో ఏదైనా ప్రమాదం జరిగితే తప్ప అధికారులు మేల్కోవడం లేదనే ఆరోపణలున్నాయి. ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే వాంకిడి మండలంలోని బాంబార ఆశ్రమ పాఠశాలలో 30 మంది, తిర్యాణి మండలంలోని చెలమెల గురుకుల పాఠశాల 70 మంది, కౌటాల కేజీబీవీ పాఠశాలలో 50 మంది విద్యార్థులు కలుషిత ఆహరం తిని అస్వస్థతకు గురైన సంఘటనలు జరిగాయి. ఇలా ప్రతీ ఏడాది మూడు నాలుగు సంఘటనలు జరుగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం నిర్లక్ష్యం వీడటం లేదు.. ఆయా పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించడం లేదని బాధిత విద్యార్థులు తల్లిదండ్రులు మండిపడుతున్నారు. 

వారం నుంచి కడుపునొస్తుంది..
బోర్‌ పని చేయకపోవడంతో చేతి పంపు నీళ్లనే తాగినం. అవి తాగినప్పుటి నుంచి కడుపు నొప్పి వస్తోంది.మేడంకు చెప్పినా ఏం కాదన్నారు. ఇప్పుడు ఎక్కువయ్యే సరికి దవాఖానకు తీసుకొచ్చిన్రు.

– కళ్యాణి, 8వ తరగతి 

చెప్పినా పట్టించుకోలేదు..
బోర్‌ నీళ్లు రావడం లేదని వార్డెన్‌కు, ప్రిన్సిపాల్‌కు చెప్పినా పట్టించుకోలేదు. మురికి నీటితోనే వంటలు కూడా చేస్తున్నారు. సోలార్‌ ప్లాంట్లు పని చేయక చల్లనీళ్లే స్నానం చేస్తున్నం.

– మౌనిక, 9వ తరగతి 

బాధ్యులను సస్పెండ్‌ చేయాలి
ఇలా మళ్లీ జరగకుండా ఉండలంటే బాధ్యులైన అధికారులను వెంటనే సస్పెండ్‌ చేయాలి. విద్యార్థుల కోసం వచ్చిన నిధులను వారి కోసం ఖర్చు చేయకపోవడం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి.

-యూకే రాము, పాఠశాల చైర్మన్‌  

ఇద్దరి సస్పెన్షన్‌
విద్యార్థినులు అస్వస్థతకు గురైన సంఘటనలో సిబ్బం ది నిర్లక్ష్యమే కారణమని నిర్ధారించి, ఇందుకు బాధ్యులుగా పాఠశాల ప్రధానోపా ధ్యాయురాలు స్వర్ణమంజుల, వార్డెన్‌ శాంతను సస్పెండ్‌ చేస్తున్నట్లు డీటీడీవో దిలిప్‌కుమార్‌ ఒక ప్రకటనలో మంగళవారం తెలిపారు. విద్యార్థుల వసతి గృహాల్లో ఇలాంటి సంఘటనలు జరిగితే కఠిన చర్యలే తీసుకోకుంటామని ఆయన పునరుద్ఘాటించారు.  

డీటీడీఓ దిలీప్‌ కుమార్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top