ఈఎస్‌ఐలో ప్లాస్మా బ్యాంకును ప్రారంభించిన గవర్నర్‌

Governor Tamilisai Soundararajan Launched Plasma Bank In ESI - Sakshi

అమీర్‌పేట: కరోనా లేని రాష్ట్రంగా తెలంగాణను చూడటమే తన లక్ష్యమని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. శనివారం సనత్‌నగర్‌ ఈఎస్‌ ఐ మెడికల్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన ప్లాస్మా బ్యాంకును ఆమె ప్రారంభించి, తొలి ప్లాస్మా దాత సంతోష్‌గౌడ్‌ను అభినందించారు. అనంతరం వార్డులో తిరిగి వైద్యసేవలపై వాకబు చేశారు. ఈ సందర్బంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, కరోనా చికిత్స విధానంలో ప్లాస్మా థెరపీ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని, వైరస్‌ నుండి కోలుకున్న వారు తమ ప్లాస్మా ను ఇతర రోగులకు అందించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్లాస్మా దానం చేయడం వల్ల ఎటువంటి భయం అవసరం లేదని పేర్కొన్నారు. వైరస్‌ బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, కరోనా లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరూ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈఎస్‌ఐ ఆసుపత్రిలో కరోనా రోగులకు అందుతున్న సేవలపై గవర్నర్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన బాధితులకు చికిత్స అందించేందుకు వీలుగా రూపొందించిన అత్యాధునిక పీఏపీఆర్‌ కిట్‌ను ఆసుపత్రిలో ప్రదర్శించారు.  వైద్య కళాశాల డీన్‌తో పాటు ఈఎస్‌ఐసీ రిజిస్ట్రార్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top