మరింత కిక్కు..! 

Governmenment Planning For New Excise Policy In Nalgonda - Sakshi

కొత్త మున్సిపాలిటీల్లో బార్ల ఏర్పాటు

లైసెన్స్‌ ఫీజు పెంచే యోచన!    

సాక్షి, యాదాద్రి :  రాష్ట్ర ఖజానాకు ప్రధాన ఆదా య వనరు మద్యం వ్యాపారం. దీని ద్వారా ప్రభుత్వం మరింత ఆదాయం పెంచుకునే దిశగా నూతన పాలసీ ఉండబోతోందన్న వాదన విన్పిస్తోంది. ప్రస్తుతం ఉన్న మద్యం షాపుల సంఖ్య పెంచడం, బార్లకు అనుమతులు ఇవ్వడం, లైసెన్స్‌ ఫీజు పెంచే దిశగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఉన్నతాధికారులు కసరత్తు ప్రారంభించారు. 

విధివిధానాలు రూపొందిస్తోన్న ఎక్సైజ్‌ యంత్రాంగం 
2017 అక్టోబర్‌ 1తేదీ నుంచి ప్రారంభమైన మద్యం దుకాణాల కాలపరిమితి సెప్టెంబర్‌31తో ముగియనుంది. కాలపరిమితి ముగిసిన వెంటనే నూతన పాలసీని అమల్లోకి తేవడం కోసం అధికార యంత్రాంగం ఇప్పటి నుంచే తమ విధివిధానాలను రూపొందిస్తోంది. ప్రభుత్వం తీసుకురానున్న నూతన మద్యం పాలసీపై లిక్కర్‌ వ్యాపారుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పడున్న మద్యం దుకాణాల నిర్వాహకులకు వరుస ఎన్నికలు రావడంతో ఆర్థికంగా కలిసొచ్చింది. దీంతో మరో సారి మద్యం దుకాణాలను దక్కించుకోవాలన్న తపన వారిలో పెరిగింది. దీంతోపాటు కొత్తగా మద్యం వ్యాపారంలోకి వచ్చేందుకు చాలా మంది ఉత్సాహం చూపుతున్నారు.  లాభసాటి బిజినెస్‌ కావడంతో వారి కన్ను మద్యం దుకాణాలపై పడింది.   

పోటీ పెరిగే అవకాశం
ప్రస్తుతం నడుస్తున్న మద్యం దుకాణాల కోసం రెండేళ్ల కిత్రం నిర్వహించిన టెండర్లకు పెద్ద ఎత్తున పోటీ పడ్డారు. జిల్లాలో 15 మండలాల్లో  67మద్యం షాపులకు 1,130మంది దరఖాస్తు చేసుకున్నారు. రిజిస్ట్రేషన్‌ రుసుం రూపేణా రూ.11.30కోట్ల ఆదాయం ప్రభుత్వానికి అప్పట్లో సమకూరింది. భువనగిరి, ఆలేరు, రామన్నపేట, మోత్కూర్‌ సర్కిళ్లలో మద్యం దుకాణాలు ఉన్నాయి.  2015లో మద్యం దుకాణం  దరఖాస్తు రుసుం రూ.50వేలు ఉండగా  2107లో  రూ.1లక్షకు పెంచారు. అయినా దరఖాస్తులు భారీగా వచ్చాయి. ఈ సారి మద్యం దుకాణాల సంఖ్యతోపాటు మద్యం రెంటల్‌ కూడా పెంచే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అయినప్పటికీ మద్యం వ్యాపారంలోకి వచ్చే వారి సంఖ్య పెరగనుంది. 

డ్రా ద్వారా..
గతంలో వేలం పాటల్లో ఎవరు ఎక్కువ పాట పడితే వారికి దుకాణాలను కేటాయించే వారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల వేలంపాటల విధానాన్ని రద్దు చేసి లక్కీడ్రా ద్వారా మద్యం దుకాణాలను కేటాయించారు. ప్రభుత్వం లైసెన్స్‌ ఫీజును నిర్ణయించి వచ్చిన దరఖాస్తుల ఆధారంగా లక్కీడిప్‌ ద్వారా మద్యం దుకాణాలను కేటాయిస్తుంది. ఈ సారి పాత రెండు పద్ధతుల్లో దేన్ని అమలు చేస్తారన్నది ఇంకా నిర్ణయం కాలేదు. లక్కీడిప్‌ పద్ధతి ద్వారానే దుకాణాలను కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది. మద్యం దుకాణాల లైసెన్స్‌ఫీజును మాత్రం పెంచడం ఖాయంగా కన్పిస్తోంది. 

మున్సిపాలిటీల్లో బార్‌లు..  
 ప్రస్తుతం జిల్లాలో ఆరు మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇందులో భువనగిరి మున్సిపాలిటీ గతంలోనే ఉండగా,  యాదగిరిగుట్ట, ఆలేరు, మోత్కూరు, భూదాన్‌పోచంపల్లి, చౌటుప్పల్‌ కొత్తగా ఏర్పడ్డాయి. గతంలో మండల కేంద్రాలుగా ఉన్న ఈ మున్సిపాలిటీ కేంద్రాల్లో ఒక్కో మద్యం దుకాణం లైసెన్స్‌ ఫీజు రూ. 1లక్ష ఉండగా ప్రస్తుతం పెరిగే అవకాశం ఉంది. అలాగే మున్సిపాలిటీల్లో ప్రస్తుతం ఉన్న దుకాణాలకు అదనంగా పెరగనున్నాయి.

అంతేకాకుండా బార్‌లకు అనుమతి ఇవ్వనున్నారు. ఇప్పటికే నూతన మున్సిపాలిటీల్లో బార్‌లకు లైసెన్స్‌లు ఇవ్వాలని ఉన్నా అమలు కాలేదు. ఈ సారి తప్పకుండా బార్‌లకు అనుమతి వస్తుందని అధికారులు చెబుతున్నారు. అలాగే నూతన మండల కేంద్రాల్లో మద్యం దుకాణాలను ఏర్పాటు చేయనున్నారు. అడ్డగూడురు మండల  కేంద్రంలో ఇప్పటి వరకు మద్యం దుకాణం ఏర్పాటు కాలేదు. జనగామ జిల్లా నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాలో కలిసిన గుండాల మండలం మద్యం దుకాణాలు అదనం కానున్నాయి. 

పెరిగిన మద్యం అమ్మకాలు 
2017–2019 రెండు సంవత్సరాలకు మద్యం షాపుల నిర్వహణ లాభసాటిగా ఉంటుందని వ్యాపారులు పెద్ద ఎత్తున పోటీపడ్డారు. అందుకు అనుగుణంగానే వరుస ఎన్నికలు మద్యం వ్యాపారులకు సిరులు కురిపించాయి.  గ్రామపంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ఈరెండేళ్ల కాలంలోనే జరిగాయి.  ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున మద్యం విక్రయించారు.  దీంతో అనుకున్న దానికన్నా ఎక్కువ మద్యం విక్రయాలు జరిగాయి. దీంతో లిక్కర్‌ వ్యాపారంలో అడుగుపెట్టడానికి చాలా మంది ప్రయత్నాలు ప్రాంరంభించారు. 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top