మక్తల్ సహకార బ్యాంకులో రూ.83,88,575 పక్కదారి పట్టిన వ్యవహారంలో సంబంధిత శాఖ ఉన్నతాధికారులు బ్యాంకు
మక్తల్ సహకార బ్యాంకులో రూ.83లక్షలు పక్కదారి
విచారణ జరుపుతున్న బ్యాంకు ఉన్నతాధికారులు
మక్తల్: మక్తల్ సహకార బ్యాంకులో రూ.83,88,575 పక్కదారి పట్టిన వ్యవహారంలో సంబంధిత శాఖ ఉన్నతాధికారులు బ్యాంకు మేనేజర్, సిబ్బందిని రహస్యంగా విచారిస్తున్నట్లు తెలిసింది. ఆర్నెళ్లుగా మక్తల్ సహకార బ్యాంకులో సిబ్బంది అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పక్షంరోజులుగా బ్యాంకు ఆడిటర్లు ఖాతాదారుల సొమ్ముపై గోప్యంగా విచారిస్తున్నారు. ఇదిలాఉండగా, డబ్బును స్వాహా చేసినట్లు ఈనెల 12న జిల్లా సహకార బ్యాంకు జనరల్ మేనేజర్ జయసూర్య మక్తల్ పోలీసులకు ఫిర్యాదుచేయడంతో అసలు విషయం ఆలస్యంగా వెలుగుచూసింది.
స్థానిక బ్యాంకు మేనేజర్ ల క్ష్మణ్‌జీ, అసిస్టెంట్ మేనేజర్ నర్సిములు, షౌకత్‌అలీ, ఆశ న్న, సిబ్బంది చంద్రశేఖర్, క్లర్కు నర్సిములు శెట్టిపై ఫిర్యా దు చేశారు. సిబ్బంది బ్యాంకు, మేనేజర్ కుమ్మక్కై బ్యాంకు లో డిపాజిట్ చేసిన ఖాతాదారుల సొమ్ము నుంచి ‘ఎక్స్’ అనే బినామీ ఖాతాలోకి డబ్బును బదలాయించి పథకం ప్రకారం డ్రాచేసి స్వాహాచేసినట్లు సమాచారం. ఇంతపెద్ద మొత్తంలో నిధులు దుర్వినియోగమవడంపై బ్యాంకు ఉన్నతాధికారుల నిర్లక్ష్యం, వైఫల్యం ఉందని ఖాతాదారులు మండిపడుతున్నారు. అయితే ఖాతాదారులు సొమ్ము విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని, బ్యాంకులో డిపాజిట్ చేసిన ఖాతాదారుల సొమ్ము భద్రంగా ఉందని బ్యాంకు అధికారులు ధైర్యం చెబుతున్నారు. ఈ కుంభకోణంపై లోతుగా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఖాతాదారులు డిమాండ్ చేస్తున్నారు.