
సాక్షి, హైదరాబాద్: తమ రెస్టారెంట్లలోని స్మోకింగ్ జోన్లలో మాత్రమే హుక్కా సేవలను అందిస్తుంటే పోలీసులు జోక్యం చేసుకుంటున్నారంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు పోలీసుల వివరణను కోరింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హైదరాబాద్ పోలీసులను ఆదేశించింది.
తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. తమ రెస్టారెం ట్లలోని స్మోకింగ్ జోన్‌లో మాత్రమే హుక్కా సేవలను అందిస్తున్నామని.. అయినా పోలీసులు దీనిపై జోక్యం చేసుకుంటున్నారంటూ హైదరాబాద్‌కు చెందిన అర్బన్ గ్రిల్ డైన్ అండ్ కాఫీ షాప్, మరో సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. స్మోకింగ్ జోన్లలో హుక్కా సేవలపై ఎటువంటి నిషేధం లేదని విచారణలో పిటిషనర్ల తరఫు న్యాయవాది వేదుల వెంకటరమణ వాదించారు.