మా కొలువు.. మా ఇష్టం!

GHMC Engineers Likes Work in Serilingampally - Sakshi

నచ్చిన చోటే పనిచేస్తామంటున్న ఇంజినీర్లు

శేరిలింగంపల్లిపైనే మక్కువ అందుకనుగుణంగా ఆదేశాలు

సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీలో కొందరి మాట చెల్లుబాటవుతోంది. ఎంతగా అంటే వారు తమకిష్టమైన జోన్‌ లేదా సర్కిల్‌లో మాత్రమే పనిచేస్తారు. లేదంటే.. వేరే జోన్‌ లేదా సర్కిల్‌కు బదిలీ చేసినా వెళ్లరు. దీర్ఘకాలం సెలవులోనైనా ఉంటారు తప్ప మరో చోటుకు వెళ్లరు.  ఇలాంటి వారు ఆడింది ఆట.. పాడింది పాటగా సాగేందుకు పైఅధికారుల ఆశీస్సులు పుష్కలంగా ఉండటమే కారణం. ఇదే సందర్భంలో పనిలో పనిగా తమకు నచ్చని వారిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేస్తారు.  అలాంటి ఘటనలకు తాజా మచ్చుతునక ఇది. దీర్ఘకాలంగా జీహెచ్‌ఎంసీలో పనిచేస్తున్న ఇంజినీర్ల బదిలీల్లో భాగంగా గత సంవత్సరం శేరిలింగంపల్లి సర్కిల్‌లో పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ను ప్రభుత్వం నిజామాబాద్‌కు బదిలీ చేసింది. హైదరాబాద్‌..అందునా శేరిలింగంపల్లి సర్కిల్‌లో తప్ప ఎక్కడా పనిచేయడం ఆయనకు  ఇష్టముండదనేది సహచర ఇంజినీర్లు చెబుతున్న మాట.

దానికి ఊతమిస్తూ ఆయన బదిలీ అయ్యాక  దాదాపు వారం కూడా అక్కడ  పనిచేయకుండానే దీర్ఘకాలంగా సెలవులో ఉన్నారు. ఏడాది తిరక్కముందే నిజామాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ నుంచి తిరిగి జీహెచ్‌ఎంసీకే బదిలీ అయ్యారు. దీర్ఘకాలంగా జీహెచ్‌ఎంసీలో పనిచేస్తున్నారని బదిలీ చేయగా, అక్కడ పనిచేయకుండా తిరిగి జీహెచ్‌ఎంసీకి వచ్చారు. ఈ సంవత్సరం జనవరి 24వ తేదీన ఆయన బదిలీ కాగా, 25వ తేదీన జాయినింగ్‌ రిపోర్టు ఇచ్చారు. జీహెచ్‌ఎంసీలో పలు సర్కిళ్లలో ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాంటి వాటిల్లో ఎక్కడైనా ఆయనను నియమించవచ్చు. కానీ..ఈనెల 12వ తేదీ వరకు ఆయనకు ఎలాంటి పోస్టింగు ఇవ్వలేదు. ఆయన కోరుకునే.. గతంలో పనిచేసిన శేరిలింగంపల్లి సర్కిల్‌లోనే నియమించేందుకు ఈ జాప్యం చేశారనే ఆరోపణలున్నాయి.  ఆయనను తిరిగి శేరిలింగంపల్లి ఈఈగా పోస్టింగ్‌ ఇచ్చారు. ఒక్కరినే మారిస్తే బాగోదని కావచ్చు లేదా ఉన్నతాధికారులు తమకు నచ్చని వారిని ఆయా స్థానాల నుంచి కదిలించేందుకు కావచ్చు మరికొందరి స్థానాల్లో సైతం మార్పుచేర్పులు చేస్తూ బదిలీలు చేశారు.

ప్రాజెక్టు విభాగం నుంచి నిర్వహణకు..
ఇలా చేసిన బదిలీల్లోనూ అన్నీ నిర్వహణ విభాగంలోనివేనా అంటే కాదు.. ప్రాజెక్టు విభాగమైన హౌసింగ్‌ విభాగంలోని ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ను నిర్వహణ విభాగంలోకి.. నిర్వహణ విభాగంలోని వారిని హౌసింగ్‌ విభాగంలోకి మార్చారు. హౌసింగ్‌ విభాగం ఆధ్వర్యంలో ప్రస్తుతం డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. లక్ష ఇళ్ల నిర్మాణ లక్ష్యంలో భాగంగా దాదాపు 30 వేల ఇళ్లు పూర్తయ్యే దశలో ఉన్నాయి. మిగతావి పురోగతిలో ఉన్నాయి. నిధుల లేమి తదితర కారణాలతో మందకొడిగా పనులు సాగుతున్నాయి. పునాదుల నుంచి దాదాపు 60 శాతం వరకు పనులు చేసిన వారిని వారి స్థానంలో నుంచి తప్పించి, నిర్వహణ విభాగంనుంచి నియమించారు.  హౌసింగ్‌ డివిజన్‌ –2 ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ను ముషీరాబాద్‌ సర్కిల్‌ నిర్వహణ విభాగానికి బదిలీ చేశారు. అంబర్‌పేట సర్కిల్‌ నిర్వహణ విభాగం ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ను హౌసింగ్‌ విభాగానికి బదిలీ చేశారు.

ఇంజినీర్లకు ఎక్కడైతేనేమీ పనిచేయడానికి అనే ప్రశ్నలు సహజమే అయినప్పటికీ.. అదే సూత్రం అందరికీ ఎందుకు వర్తించదనేదే ప్రశ్న. కొందరికేమో కనీసం సర్కిల్‌ కూడా మార్చరు. కొందరినేమో ఏకంగా విభాగాలే మార్చడం వెనుక మతలబేమిటన్నదీ జీహెచ్‌ఎంసీలో ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. హౌసింగ్‌పనులు మొదట్నుంచీ పర్యవేక్షిస్తున్న వారికి వాటిల్లో లోటుపాట్లను గుర్తించడంతో పాటు ఇతరత్రా అంశాల్లోనూ తగిన అనుభవం వచ్చినందున ఆమేరకు ప్రభావం ఉంటుంది. కొత్తవారికి మరికొంత సమయం తీసుకుంటుందనే అభిప్రాయాలున్నాయి. ఇటీవలే రాంపల్లిలో జరుగుతున్న డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణంలో  జరిగిన ప్రమాదంలో కార్మికులు మృతి చెందడం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్తగా నిర్వహణ విభాగం నుంచి డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పనుల్లో నియమించడం ఎందుకో అంతుబట్టడం లేదు. వీటిపై కమిషనర్, ఉన్నతాధికారులు ఏం చేయనున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top