సొంతంగా ప్రిపేరయ్యా..

Gate First Ranker Sourav Singh Special Interview - Sakshi

గేట్‌ మొదటి ర్యాంకర్‌ సౌరవ్‌సింగ్‌

అగ్‌లాసెమ్‌ సైట్‌ విషయపరిజ్ఞానం పెంచింది

నిట్‌లో చదువుకోవడం అదృష్టం

సాక్షి, మహబూబాబాద్‌: ‘ఎక్కడా కోచింగ్‌ తీసుకో లేదు.. అధ్యాపకుల పర్యవేక్షణలో ప్రణాళిక ప్రకారం.. సొంతంగా నోట్స్‌ ప్రిపేర్‌ చేసుకుని చదివి గేట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (గ్రాడ్యూయేట్‌ అప్టిట్యూడ్‌ టెస్ట్‌)లో ఆలిండియా ఫస్ట్‌ ర్యాంకు సాధించా’నని తెలిపాడు సౌరవ్‌ సింగ్‌. వరంగల్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్‌)లో మెటలార్జికల్‌ విభాగంలో ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన సౌరవ్‌ గేట్‌లో ప్రతిభ చాటాడు. తన ప్రిపరేషన్, భవిష్యత్‌ లక్ష్యాలను ‘సాక్షి’తో పంచుకున్నాడు. గేట్‌లో మొదటి ర్యాంక్‌ వచ్చిందని తెలిసినప్పుడు చాలా హ్యాపీగా ఫీలయ్యాను. నమ్మటానికి కొంచెం టైమ్‌ పట్టింది. ఒకటికి రెండుసార్లు రిజల్ట్‌ చూసుకున్నా.

కుటుంబ నేపథ్యం..
బీహార్‌ రాష్ట్రంలోని ముజాఫర్‌పూర్‌కు చెందిన విమల్‌సింగ్, పూనమ్‌సింగ్‌ నా తల్లిదండ్రులు. నాకు దివ్య, ప్రతిమ అక్కలు ఉన్నారు. నాన్న గ్రామంలో ట్రాన్స్‌పోర్ట్‌ వ్యాపారం చేస్తూ మమ్మల్ని చదివిస్తున్నారు. పెద్దక్క టీసీఎస్‌లో ఉద్యోగం చేస్తోంది. రెండో అక్క సివిల్స్‌ పరీక్షలకు ప్రిపేర్‌ అవుతోంది.

ప్రిపరేషన్‌ ఇలా...
నిట్‌లో డాక్టర్‌ నర్సయ్య సార్‌ అందించిన ప్రోత్సాహం, నిట్‌ డైరెక్టర్, ఇతర ప్రొఫెసర్ల చొరవతోనే నంబర్‌వన్‌ ర్యాంకు సాధించా. గేట్‌ ప్రవేశపరీక్షకు సుమారు ఆరు నెలలు కష్టపడి చదివాను. ప్రతిరోజూ నాలుగు గంటలపాటు వివిధ పుస్తకాలను చదివే వాడిని. విషయ పరిజ్ఞానం కోసం అగ్‌లాసెమ్‌ వెబ్‌సైట్‌ చాలా తోడ్పడింది. సైట్‌లో గేట్‌లో విజయం సాధించిన ర్యాంకర్ల ఇంటరŠూయ్వలను పొందుపరిచారు. గత ఏడాది నంబర్‌వన్‌ ర్యాంకు సాధించిన నితీష్‌రాయ్‌ ఇంటరŠూయ్వ స్ఫూర్తినిచ్చింది. సొంతంగానే ప్రిపేర్‌ అయ్యాను. సొంతగానే నోట్స్‌ తయారు చేసుకున్నా.

ఐఓసీఎల్‌లో ఉద్యోగం చేస్తా..
మాది సాధారణ మధ్య తరగతి కుటుంబం. గేట్‌లో ఆల్‌ ఇండియా లెవల్‌లో నంబర్‌ వన్‌ ర్యాంకు సాధించిన నాకు ఎంటెక్‌ వైపు కాకుండా ఆయిల్, రీఫైనరీలో ఉద్యోగం చేయాలనుంది. ఆయిల్‌ కంపెనీల్లో పేరెన్నిక గల ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఐఓసీఎల్‌)లో ఉద్యోగం చేస్తా. ప్రస్తుతం ఐఓసీఎల్‌లో జాయిన్‌ అవుతా.

నిరుపేద విద్యార్థులకు ప్రోత్సాహం అందిస్తా..
నిట్‌లో చదువుకునే అవకాశం రావడం అదృష్టం. జేఈఈలో 20605 ర్యాంకు సాధించి నిట్‌ వరంగల్‌లో మెటలర్జికల్‌ విభాగంలో చేరాను. నిట్‌లోని అత్యుత్తమ బోధనతోనే ఆల్‌ ఇండియా నంబర్‌వన్‌ ర్యాంకు సాధించా. నాకు నంబర్‌వన్‌ ర్యాంకు అందించిన నిట్‌కు రుణపడి ఉంటా. నిరుపేదలకు ప్రోత్సాహం అందిస్తా. ఆర్థిక చేయూతనందిస్తా. వరంగల్‌ బ్యూటీపుల్‌ సిటీ. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top