నిర్లక్ష్యంపై వేటు 

Forest Department Employees Transfer In Adilabad - Sakshi

నిర్మల్‌: ‘జంగిల్‌ బచావో–జంగిల్‌ బడావో’ నినాదాన్ని సీఎం కేసీఆర్‌ వందశాతం అమలు చేసేందుకు సీరియస్‌గా వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో వన్యప్రాణుల వేట, కలప అక్రమ దందాలు జోరుగా సాగడం అధికారుల పనితీరుకు అద్దం పడుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈక్రమంలో ఇన్నేళ్లుగా అడవులను కాపాడటంలో నిర్లక్ష్యం చేసిన అధికారులపై సర్కారు బదిలీ వేటు వేసింది. పలువురికి తక్కువ స్థాయి బాధ్యతలు అప్పగించింది. వారి స్థానాల్లో కఠినంగా వ్యవహరించే, నిబద్ధత, అంకితభావం కలిగిన అధికారులను నియమించాలనే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అటవీశాఖ ఉన్నతాధికారులు బదిలీలను చేపట్టారు.

 అడవుల సంరక్షణ, చెట్ల పెంపకంపై చిత్తశుద్ధి చూపించే అధికారులను ముఖ్యప్రాంతాల్లో నియమించినట్లు ఆ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. అటవీ ప్రాంతం ఎక్కువగా ఉండే ఉమ్మడి ఆదిలాబాద్‌లో నిబద్ధత కలిగిన అధికారులను నియమించడం, స్మగ్లర్లు, వన్యప్రాణుల వేటగాళ్లపై ఉక్కుపాదం మోపడం వంటి చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా మంగళవారం సాయంత్రం జిల్లా భారీగా బదిలీలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో బుధవారం నలుగురు ఎఫ్‌ఆర్‌ఓలకూ స్థానచలనం చేశారు. మొత్తం క్షేత్రస్థాయి నుంచి బదిలీల ప్రక్రియ కొనసాగుతుందని అటవీ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.

మరో నలుగురు బదిలీ..
ఉమ్మడిజిల్లా అటవీశాఖలో బదిలీల అలజడి కొనసాగుతోంది. కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌(సీఎఫ్‌)తో పాటు కవ్వాల్‌ అభయారణ్యం ఫీల్డ్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాజెక్ట్‌ టైగర్స్‌(ఎఫ్‌డీపీటీ)గా ఉన్న శరవణన్, నిర్మల్, మంచిర్యాల డీఎఫ్‌ఓలు దామోదర్‌రెడ్డి, రామలింగంను మంగళవారం సాయంత్రం బదిలీ చేశారు. వారి తర్వాత బుధవారం ఉమ్మడి జిల్లాలో నలుగురు ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారు(ఎఫ్‌ఆర్‌ఓ)లను ట్రాన్స్‌ఫర్‌ చేశారు. నిర్మల్‌జిల్లా దిమ్మదుర్తి రేంజ్‌ ఎఫ్‌ఆర్‌ఓ షబ్బీర్‌ అహ్మద్‌ను మంచిర్యాలలోని తునికాకు(బీడీ లీఫ్‌) గోదాం ఇన్‌చార్జి(స్పెషల్‌డ్యూటీ)గా పంపించారు. దిమ్మదుర్తి రేంజ్‌ బాధ్యతలను ఇంకా ఎవరికీ అప్పగించలేదు. కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని తిర్యాణి ఎఫ్‌ఆర్‌ఓ నిజామొద్దీన్‌ను కెరమెరి రేంజ్‌ అధికారిగా బదిలీ చేశారు. కెరమెరిలో ఎఫ్‌ఆర్‌ఓగా పనిచేస్తున్న మజారొద్దీన్‌ను మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రేంజ్‌ ఎఫ్‌ఆర్‌ఓగా బదిలీ చేశారు. బెల్లంపల్లి ఎఫ్‌ఆర్‌ఓ వినయ్‌కుమార్‌ను తిర్యాణి రేంజ్‌కు పంపించారు.

పనితీరుపైనే..
ఏళ్లుగా అటవీశాఖలో కలప దొంగతనాలు, వన్యప్రాణుల వేట కొనసాగుతూ వస్తోంది. అరికట్టాల్సిన శాఖాధికారుల్లోనే కొందరు ఇంటిదొంగలుగా మారి, స్మగ్లర్లకు సహకరించారు. తమకు తెలిసినా అరికట్టలేకపోయిన తీరు, విధుల నిర్వహణలో నిర్లక్ష్యంపైనే సర్కారు సీరియస్‌గా స్పందించినట్లు తెలుస్తోంది. దీనికి తోడు.. ఉమ్మడి జిల్లా అడవుల్లో ఇటీవల కాలంలో వరుస సంఘటనలు చోటు చేసుకున్నాయి. పెంబి మండలం పుల్గంపాండ్రి వద్ద పెద్దపులిని హతమార్చడం, పాత మంచిర్యాల బీట్‌లో చిరుతపులి, శివ్వారం బీట్‌లో ఏకంగా రాయల్‌ బెంగాల్‌ టైగర్‌ను మట్టుబెట్టడం.. ఇలా వరుసగా సంచలనాలు చోటుచేసుకున్నాయి.

కవ్వాల్‌ అడవుల్లోకి అడుగు పెట్టిన ప్రతి పులినీ వేటగాళ్లు ఖతం చేస్తున్నా.. అరికట్ట లేకపోవడం స్థానిక అధికారులకు మైనస్‌ అయ్యింది. దీనికి తోడు ఆదిలాబాద్‌–నిర్మల్‌–నిజామాబాద్‌ జిల్లాల మధ్య పెద్ద కలప రాకెట్‌ కూడా బయట పడటం, అందులో ఇంటి దొంగలతో పాటు పోలీసు అధికారుల ప్రమేయం ఉన్నట్లు తేలడంతో పరిస్థితి మరింత జటిలంగా మారింది. ఈ వరుస ఘటనలపై ‘సాక్షి’ లోతైన పరిశోధనలతో వరుస కథనాలనూ ప్రచురించింది. వీటన్నింటి నేపథ్యంలో ఉమ్మడి జిల్లా అటవీశాఖ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సర్కారు సీరియస్‌గా దృష్టి పెట్టింది. ఏకంగా సీఎఫ్‌తో పాటు ఇద్దరు డీఎఫ్‌ఓలు, పలువురు ఎఫ్‌డీఓలు, ఎఫ్‌ఆర్‌ఓలను బదిలీ చేసింది.

విధుల్లో చేరని కొత్త బాస్‌లు..
ఉమ్మడి ఆదిలాబాద్‌ సీఎఫ్‌ శరవణన్‌ను మంగళవారం సాయంత్రం మెదక్‌ బదిలీ చేశారు. ఆయన స్థానంలో నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట పరిధిలోని అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌ ఎఫ్‌డీపీటీ, సీఎఫ్‌గా ఉన్న సీపీ. వినోద్‌కుమార్‌ను కేటాయించారు. కానీ ఆయన బుధవారం విధుల్లో చేరలేదు. అలాగే మంచిర్యాల డీఎఫ్‌ఓగా ఉన్న రామలింగంను వరంగల్‌అర్బన్, జనగామ జిల్లాల డీఎఫ్‌ఓగా పంపించారు. ఆయన స్థానంలో రావాల్సిన ఐఎఫ్‌ఎస్‌ అధికారి శివానీ డోగ్రా కూడా బాధ్యతలు చేపట్టలేదు. నిర్మల్‌ డీఎఫ్‌ఓగా ఉన్న దామోదర్‌రెడ్డిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ డివిజన్‌లోని కిన్నెరసాని వైల్డ్‌లైఫ్‌కు కేటాయించారు.

నిజామాబాద్‌జిల్లా డీఎఫ్‌ఓ వీఎస్‌ఎన్‌వీ ప్రసాద్‌ నిర్మల్‌కు కేటాయించారు. ఆయన కూడా ఇంకా విధుల్లో చేరలేదు. పులి హతం కేసులకు సంబంధించిన విచారణలో సీఎఫ్‌ శరవణన్, నిర్మల్‌ డీఎఫ్‌ఓ దామోదర్‌రెడ్డి హైదరాబాద్‌లోనే ఉన్నట్లు తెలిసింది. ఈమేరకు వారు వచ్చిన తర్వాత కొత్త అధికారులు విధుల్లో చేరనున్నట్లు ఆశాఖ వర్గాలు చెబుతున్నాయి. అలాగే మంచిర్యాల ఎఫ్‌డీఓగా కిన్నెరసాని వైల్డ్‌లెఫ్‌ ఎఫ్‌డీఓగా ఉన్న ఎం.నాగభూషణం, కాగజ్‌నగర్‌ ఎఫ్‌డీఓగా పీసీసీఎఫ్‌ ఆఫీస్‌లో ఏసీఎఫ్‌గా ఉన్న ఎం.రాజారమణారెడ్డి, ఖానాపూర్‌ ఎఫ్‌డీఓగా ప్రస్తుతం బెల్లంపల్లి ఎఫ్‌డీఓ, మంచిర్యాల ఇన్‌చార్జి ఎఫ్‌డీఓగా ఉన్న తిరుమల్‌రావు బాధ్యతలు చేపట్టాల్సి ఉంది.

కొనసాగనున్న బదిలీలు..
ప్రభుత్వం మంగళవారం సాయంత్రం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 200 మంది అధికారులను బదిలీ చేసింది. ఇందులో చీఫ్‌ కన్జర్వేటర్‌ నుంచి బీట్‌ ఆఫీసర్‌ వరకు ఉన్నారు. రాష్ట్రంలో 19 మంది రేంజ్‌ ఆఫీసర్లను మార్చినట్లు తెలిసింది. ఇందులో బుధవారం ఉమ్మడి జిల్లాలో నలుగురికి స్థానచలనం కల్పించారు. కెరమెరి, బెల్లంపల్లి, తిర్యాణి, దిమ్మదుర్తి ఎఫ్‌ఆర్‌ఓలను బదిలీ చేశారు. ఇక రాష్ట్రంలో బీట్‌ ఆఫీసర్లు 160 మందిని బదిలీ చేయనున్నట్లు సమాచారం.

ఇందులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఎంతమంది ఎఫ్‌బీ ఓల బదిలీ జరగనుందో తేల్చే పనిలో ఉన్నట్లు తెలిసింది. ప్రధానంగా అటవీ సంబంధిత నేరాలను నివారించడంలో విఫలమైన వారిని, పనితీరు సరిగా లేని వారిని బదిలీ చేసి, ఆయా అటవీ ప్రాంతాల్లో సమర్థులను కేటాయించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం అటవీశాఖలో ఇదే అంశంపై చర్చ సాగుతోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top