బస్సు కోసం పాట్లు | For bus flittings | Sakshi
Sakshi News home page

బస్సు కోసం పాట్లు

Aug 28 2015 11:53 PM | Updated on Sep 3 2017 8:18 AM

బస్సు కోసం పాట్లు

బస్సు కోసం పాట్లు

విద్యార్థులు చదువు మాటేమోగానీ ప్రతిరోజూ రోడ్డెక్కుతున్నారు. బస్సులకోసం రోజూ ఎక్కడో ఒక చోట ఆందోళనలు కొనసాగుతున్నాయి

♦  రాస్తారోకోలు, ధర్నాలు చేసినా ఫలితం శూన్యం
♦  చదవలేకపోతున్నామంటున్న విద్యార్థులు
 
 రామాయంపేట : విద్యార్థులు చదువు మాటేమోగానీ ప్రతిరోజూ రోడ్డెక్కుతున్నారు. బస్సులకోసం రోజూ ఎక్కడో ఒక చోట ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆర్టీసీ బస్సులు సరిగా రాక పోవడం, వందలాది మంది విద్యార్థులకు సరిపడేటన్ని బస్సులు లేకపోవడం ఆందోళనకు దారి తీస్తుంది. పదిహేను రోజులుగా రోజూ విద్యార్థులు ఆందోళన నిర్వహిస్తునే  ఉన్నారు. మండలంలోని జాన్సీలింగాపూర్, ఆర్.వెంకటాపూర్, నందగోకుల్, రాయిలాపూర్ స్టేజీ, చల్మెడ స్టేజీ వద్ద విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఒక్కో ప్రాంతం నుంచి వందలాది మంది విద్యార్థులు చదువు నిమిత్తం రామాయంపేటకు వస్తుండగా వారికి సరిపడేటన్నీ బస్సులు రావడం లేదు.

నిజామాబాద్ జిల్లా బీబీపేట, ఇస్సానగర్, ఉప్పర్‌పల్లి, చల్మెడగ్రామాలకు చెందిన 350 మంది విద్యార్థులు, నార్లాపూర్, కల్వకుంట, బచ్చురాజ్‌పల్లి, రాయిలాపూర్ గ్రామాలకు చెందిన 500 మంది విద్యార్థులు, చేగుంట మండలం పులిమామిడి, బోనాల, ఇబ్రహీంపూర్, రామాయంపేట మండలం డి.ధర్మారం, శివాయిపల్లి, సుతార్‌పల్లి, ఆర్.వెంకటాపూర్ గ్రామాల నుంచి 400 మంది విద్యార్థులు చదువు నిమిత్తం రోజూ రామాయంపేటకు వస్తున్నారు. ఉదయం పూట ఒక్కోరూట్ నుంచి ఒక బస్సును మాత్రమే నడిపిస్తుండగా అది సరిపోక విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.

 ఉదయం 7 గంటలకే ఇంట్లో నుంచి బయలుదేరినా తాము ఏ రోజూ సకాలంలో కాలేజీలకు వెళ్లలేక పోతున్నామని విద్యార్థులు వాపోయారు. ఆర్టీసీ డ్రైవర్లు స్టేజీల వద్ద బస్సులను ఆపడం లేదని, దీంతో తాము ఆటోలు, ట్రాక్టర్లు ఇతర వాహనాల్లో అష్టకష్టాలు పడి రామాయంపేటకు చేరుకుంటున్నామని వాపోయారు. తమకు బస్సుటాప్ ప్రయాణాలు తప్పడంలేదని, ప్రమాదమని తెలిసినా టాప్‌పై ప్రయాణిస్తున్నామన్నారు.
 
 ప్రమాదకరంగా బస్సు టాప్‌పై ప్రయాణిస్తున్నాం..
 నాలుగు, ఐదు వందల మంది విద్యార్థులకు ఒకే బస్సు నడిపితే ఎలా ఎక్కేది. దీంతో ప్రతిరోజూ డ్రైవర్, కండక్టర్‌తో గొడవలు జరుగుతున్నాయి. దీంతో ప్రమాదకర పరిస్థితుల్లో టాప్‌పై కూర్చోవాల్సి వస్తోంది.
 -నాగరాజు, ఇంటర్ విద్యార్థి, ఆర్.వెంకటాపూర్
 
 రోజూ ఇబ్బందులే...
 ఆర్టీసీ బస్సులు  సరిగా రాకపోవడంతో తాము కాలేజీలకు వెళ్లడానికి ప్రతిరోజూ ఇబ్బందులకు గురవుతున్నాం. బస్సులు సరిగా ఆపడం లేదు. దీంతోప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది.
 - మధు, ఇంటర్ విద్యార్థి, ఆర్.వెంకటాపూర్
 
 గంటల తరబడి రోడ్డుపై పడిగాపులు కాస్తున్నాం...
 సకాలంలో ఆర్టీసీ బస్సులు రాకపోవంతో ప్రతి రోజూ గంటల తరబడి రోడ్డుపై పడిగాపులు కాయాల్సి వస్తోంది. వచ్చినా బస్సుల నిండా ప్రయాణికులు ఉంటున్నారు. దీంతో తాము బస్సులో ఎక్కలేని పరిస్థితి నెలకొంది.
 -ప్రియాంక విద్యార్థిని, డి.ధర్మారం
 
 రోజూ కళాశాలకు ఆలస్యంగా వెళ్తున్నాం...
 ఆర్టీసీ బస్సు సకాలంలో రాకపోవడంతో ప్రతి రోజూ కళాశాలకు ఆలస్యంగా వెళ్తున్నాం, దీంతో మొదటి పిరియడ్ పూర్తి కావస్తున్న సమయంలో తాము కాలేజీలో అడుగుపెడుతున్నాం. అదనపు ట్రి ప్పులు నడపాలి.
 -రేవతి, ఇంటర్ విద్యార్థిని, బోనాల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement