మే నుంచి ఆహార భద్రతా కార్డులు:ఈటెల | food security cards will issue from may, says finance minister eetela rajendar | Sakshi
Sakshi News home page

మే నుంచి ఆహార భద్రతా కార్డులు:ఈటెల

Apr 23 2015 7:37 PM | Updated on Oct 16 2018 2:49 PM

మే నుంచి ఆహార భద్రతా కార్డులు:ఈటెల - Sakshi

మే నుంచి ఆహార భద్రతా కార్డులు:ఈటెల

మే నెల నుంచి ఆహార భద్రతా కార్డులను లబ్ధిదారులకు అందజేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రకటించారు.

-అక్రమాల నిరోధానికి ఈ-పాస్ యంత్రాలు
సాక్షి, హైదరాబాద్: మే నెల నుంచి ఆహార భద్రతా కార్డులను లబ్ధిదారులకు అందజేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రకటించారు. నిజమైన లబ్ధిదారులెవరూ నష్టపోకుండా ప్రతి ఒక్కరికీ కార్డులు జారీ చేస్తామన్నారు. గురువారం సచివాలయంలో పౌర సరఫరాల శాఖ నూతన కమీషనర్ రజత్‌కుమార్‌తో కలిసి మంత్రి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రేషన్ బియ్యం పంపిణీలో అక్రమాలను ఉపేక్షించేది లేదని... డీలర్లు వంద గ్రాముల బియ్యం తుక్కువిచ్చినా తమకు నేరుగా ఫిర్యాదు చేయాలని పిలుపునిచ్చారు. అక్రమార్కులపై పీడీ యాక్టు కింద కేసులు పెట్టేందుకు వెనుకాడేది లేదన్నారు. సరుకుల్లో అక్రమాల నిరోధానికి ఈ-పాస్ యంత్రాలను ఏర్పాటు చేయనున్నామని దీనికి రూ.225 కోట్లు అవసరం కానుండగా కొంతమేర సాయం చేసేందుకు కేంద్రం అంగీకారం తెలిపిందని వివరించారు. దీంతో పాటే జీపీఎస్ వ్యవస్థను సైతం ప్రవేశపెట్టి అక్రమాలకు కళ్లెం వేస్తామన్నారు. ఆధార్ సీడింగ్ ద్వారా డూప్లికేషన్‌ల ఏరివేతతో కార్డుల సంఖ్య కొంత తగ్గిందని వెల్లడించారు.

మూడేళ్లలోపు పిలల్లలకు బియ్యం కోటా రద్దు చేసినట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని, వారికి యథావిధిగా బియ్యం సరఫరా చేస్తున్నామని తెలిపారు. కందిపప్పు, చక్కెర టెండర్లలో పారదర్శకత లోపించిందంటూ వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. ఎక్కడా అలాంటివీ జరుగలేదని, ఒప్పందాల మేరకు చక్కెర, కందిపప్పులను సరఫరా చేయని వారిపై కఠిన చర్యలు తీసుకున్నామని, రూ.2 కోట్ల వరకు జప్తు చేసినట్లు చెప్పారు. పేద ప్రజల కడుపు నింపే విషయంలో ప్రభుత్వంపై పడే ఆర్ధిక భారాన్ని ఏమాత్రం లెక్కచేయబోమని మంత్రి స్పష్టం చేశారు. కేంద్రం నుంచి అదనంగా బియ్యం కేటాయింపులు జరుగకున్నా, పేదరిక లెక్కల సర్వేతో సంబంధం లేకుండా రూ.2600 కోట్ల నిధులతో 2.86 కోట్ల మంది లబ్ధిదారులకు రేషన్ బియ్యం అందిస్తున్నామని తెలిపారు. రేషన్ డీలర్‌కు ఆర్ధిక చేయూతనిచ్చేలా నెలకు రూ.6 వేలు మిగిలే విధంగా కార్డుల సంఖ్యను పెంచేందుకు ఆలోచనలు చేస్తున్నామని అన్నారు.

సబ్సిడీ వదులుకొండి: గ్యాస్ సబ్సిడీని తాను వదులకున్నానని స్థోమత కలిగిన ఉన్నత వర్గాలు సైతం సబ్సిడీని వదులుకునేందుకు ముందుకు రావాలని ఈ సందర్భంగా ఈటెల సూచించారు. ఉన్నత వర్గాలు వదులుకునే సబ్సిడీతో పేదలకు మరిన్ని సంక్షేమ ఫలాలు అందించే అవకాశం ఉంటుందని అన్నారు. ఈ విషయంలో ప్రజా ప్రతినిధులు, సంపన్న వర్గాలు సానుకూలంగా వ్యవహరించి సబ్సిడీ వదులకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement